
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 12.5 శాతం ఓట్లు పెరిగాయి
ఈసీ ప్రకటించిన ఓట్ల లెక్కలకు, తుది ఓటింగ్ శాతానికి మధ్య భారీ తేడా
ఈవీఎంల యుగంలోనూ ఇంత వ్యత్యాసాలా?
ఈ ఎన్నికల ఫలితాలు సరైనవేనా?
కాంగ్రెస్ పార్టీ నేత సందీప్ దీక్షిత్
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సంఘం తొలుత ప్రకటించిన ఓట్ల శాతం కంటే.. తుది ఓటింగ్ 12.5 శాతం పెరగడం పట్ల ఆ పార్టీ నేత సందీప్ దీక్షిత్ విస్మయం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో సందీప్ దీక్షిత్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ నివేదికను ఉటంకిస్తూ ఆయన పలు ఆరోపణలు చేశారు.
ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించిన ఓట్ల లెక్కలకు, తుది ఓటింగ్ శాతానికి మధ్య భారీ తేడా ఉందన్నారు. ఈవీఎంల యుగంలోనూ ఇంత వ్యత్యాసాలు ఉండటం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలా వచ్చిన ఎన్నికల ఫలితాలు సరైనవేనా అని నిలదీశారు. ఇంత వ్యత్యాసం ఉండటం మొత్తం ఎన్నికల ప్రక్రియపైనే పలు ప్రశ్నలను లేవనెత్తుతోందన్నారు. కేవ లం ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా ఒడిశాలో కూడా 12.5 శాతం ఓట్లు పెరిగాయన్నారు.
ఎన్నికల అవకతవకలతో బీజేపీకి అదనంగా 79 సీట్లు..
ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడటం ద్వారా బీజేపీ 79 సీట్లు అదనంగా గెలుచుకుందని సందీప్ దీక్షిత్ ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల ఓటింగ్ శాతం పెరుగుదలకు సంబంధించి రిగ్గింగ్ జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రాథమిక గణాంకాలతో పోలిస్తే తుది ఓటింగ్ శాతంలో గణనీయంగా వ్యత్యాసాలు ఉండటంపై కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాలన్నారు. పోలింగ్ రోజుల్లో ఎన్నికల సంఘం ప్రకటించిన ఓట్ల లెక్కలకు, తుది ఓటింగ్ శాతానికి మధ్య భారీ వ్యత్యాసం ఉందని పలు సంస్థలు కూడా విశ్లేషించాయన్నారు.
జాతీయ స్థాయిలో సగటు వ్యత్యాసం 4.7 శాతం ఉంటే ఎన్నికల ఫలితాలు సరైనవేనా అని సందీప్ దీక్షిత్ ప్రశ్నించారు. ప్రతి దశలో ఓటింగ్ ముగిశాక చాలా రోజుల తర్వాత కానీ ఆ దశకు సంబంధించిన ఓటింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం ప్రకటించలేదని గుర్తు చేశారు. ఈవీఎంలతో ఓటింగ్ ప్రారంభమైనప్పుడు, ప్రతి రెండు గంటలకు బూత్‌లో ఎంత ఓటింగ్ జరిగిందనే సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాల్సి ఉంటుందన్నారు.
ఈసీ వివరణ ఇవ్వకపోతే కోర్టుకెళ్తాం..
ఇంటర్‌నెట్ వంటి సాంకేతిక సమస్యలతో సమాచారం ఇవ్వడంలో ఆలస్యమైందని కేంద్ర ఎన్నికల సంఘం చెబుతోందని సందీప్ దీక్షిత్ మండిపడ్డారు. ఈసీ విడుదల చేసిన డేటాలో వ్యత్యాసం పలు ప్రశ్నలను లేవనెత్తుతోందన్నారు. 2019లోనూ ఈ విధంగానే డేటా విడుదలలో ఆలస్యం జరిగిందని గుర్తు చేశారు.
ఓట్ ఫర్ డెమోక్రసీ నివేదిక ప్రకారం.. దేశంలోని 79 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం పెరుగుదల.. బీజేపీ తక్కువ ఓట్ల తేడాతో గెలిచిన దాని కంటే ఎక్కువగా ఉందన్నారు. ఈ నివేదికపై కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సంతృప్తికర సమాధానాలు, వివరణ రాకపోతే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు.