sandeep dixit
-
ఎన్నికల్లో భారీగా అవకతవకలు
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సంఘం తొలుత ప్రకటించిన ఓట్ల శాతం కంటే.. తుది ఓటింగ్ 12.5 శాతం పెరగడం పట్ల ఆ పార్టీ నేత సందీప్ దీక్షిత్ విస్మయం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో సందీప్ దీక్షిత్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ నివేదికను ఉటంకిస్తూ ఆయన పలు ఆరోపణలు చేశారు. ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించిన ఓట్ల లెక్కలకు, తుది ఓటింగ్ శాతానికి మధ్య భారీ తేడా ఉందన్నారు. ఈవీఎంల యుగంలోనూ ఇంత వ్యత్యాసాలు ఉండటం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలా వచ్చిన ఎన్నికల ఫలితాలు సరైనవేనా అని నిలదీశారు. ఇంత వ్యత్యాసం ఉండటం మొత్తం ఎన్నికల ప్రక్రియపైనే పలు ప్రశ్నలను లేవనెత్తుతోందన్నారు. కేవ లం ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా ఒడిశాలో కూడా 12.5 శాతం ఓట్లు పెరిగాయన్నారు. ఎన్నికల అవకతవకలతో బీజేపీకి అదనంగా 79 సీట్లు.. ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడటం ద్వారా బీజేపీ 79 సీట్లు అదనంగా గెలుచుకుందని సందీప్ దీక్షిత్ ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల ఓటింగ్ శాతం పెరుగుదలకు సంబంధించి రిగ్గింగ్ జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రాథమిక గణాంకాలతో పోలిస్తే తుది ఓటింగ్ శాతంలో గణనీయంగా వ్యత్యాసాలు ఉండటంపై కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాలన్నారు. పోలింగ్ రోజుల్లో ఎన్నికల సంఘం ప్రకటించిన ఓట్ల లెక్కలకు, తుది ఓటింగ్ శాతానికి మధ్య భారీ వ్యత్యాసం ఉందని పలు సంస్థలు కూడా విశ్లేషించాయన్నారు. జాతీయ స్థాయిలో సగటు వ్యత్యాసం 4.7 శాతం ఉంటే ఎన్నికల ఫలితాలు సరైనవేనా అని సందీప్ దీక్షిత్ ప్రశ్నించారు. ప్రతి దశలో ఓటింగ్ ముగిశాక చాలా రోజుల తర్వాత కానీ ఆ దశకు సంబంధించిన ఓటింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం ప్రకటించలేదని గుర్తు చేశారు. ఈవీఎంలతో ఓటింగ్ ప్రారంభమైనప్పుడు, ప్రతి రెండు గంటలకు బూత్‌లో ఎంత ఓటింగ్ జరిగిందనే సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాల్సి ఉంటుందన్నారు. ఈసీ వివరణ ఇవ్వకపోతే కోర్టుకెళ్తాం.. ఇంటర్నెట్ వంటి సాంకేతిక సమస్యలతో సమాచారం ఇవ్వడంలో ఆలస్యమైందని కేంద్ర ఎన్నికల సంఘం చెబుతోందని సందీప్ దీక్షిత్ మండిపడ్డారు. ఈసీ విడుదల చేసిన డేటాలో వ్యత్యాసం పలు ప్రశ్నలను లేవనెత్తుతోందన్నారు. 2019లోనూ ఈ విధంగానే డేటా విడుదలలో ఆలస్యం జరిగిందని గుర్తు చేశారు. ఓట్ ఫర్ డెమోక్రసీ నివేదిక ప్రకారం.. దేశంలోని 79 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం పెరుగుదల.. బీజేపీ తక్కువ ఓట్ల తేడాతో గెలిచిన దాని కంటే ఎక్కువగా ఉందన్నారు. ఈ నివేదికపై కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సంతృప్తికర సమాధానాలు, వివరణ రాకపోతే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. -
దివాళా బదులు దివాళి
సాక్షి, న్యూఢిల్లీ : వస్తు సేవల సుంకం మార్పులతో దేశ ప్రజలకు ముందుగానే దివాలి (దీపావళి) వచ్చిందని దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విపక్షాలు ఆయన ప్రకటనపై ఘాటుగానే స్పందిస్తున్నాయి. దివాళి స్థానంలో దివాళా అనే పదం బావుంటుందని కాంగ్రెస్ పార్టీ వ్యంగ్యస్త్రాలను సంధించింది. ‘బహుశా ఆయన(మోదీ) పొరపాటున ఆ ప్రకటన ఇచ్చి ఉంటారేమో. దివాళా బదులు దివాళి అని చెప్పాల్సింది. ప్రస్తుత పరిస్థితులకు దివాళా అన్నదే సరిగ్గా సరిపోతుంది. జీఎస్టీ సంస్కరణలను ప్రధాని పండగతో పోల్చారు. కానీ, అది ప్రజల జీవన శైలిని ఏ మాత్రం మార్చలేకపోయింది. సామాన్యుడు ఇంకా కష్టాలను ఎదుర్కుంటూనే ఉన్నాడు. తప్పుడు వాగ్థానాలతో ఇంకా మభ్య పెట్టాలనే ఆయన చూస్తున్నారు అని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ పేర్కొన్నారు. బీజేపీ పార్టీని అధికారం కోల్పోయినప్పడే ప్రజలకు నిజమైన దీపావళి అని మరో నేత అజోయ్ కుమార్ చెప్పారు. ధనికులకు, వ్యాపారవేత్తల గురించే మోదీ ఆలోచిస్తున్నారు తప్ప.. మధ్య తరగతిఽపేదల గురించి మోదీ ఏ మాత్రం ఆలోచించట్లేదని అజోయ్ అన్నారు. కాగా, జీఎస్టీ కింద 27 వస్తువులపై పన్ను తగ్గిస్తూ.. జీఎస్టీ మండలి తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాని స్వాగతించిన విషయం తెలిసిందే. చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం జీఎస్టీ మండలి తీసుకున్న నిర్ణయం వల్ల దేశ ప్రజలకు 15 రోజుల ముందుగానే దీపావళి వచ్చిందని గుజరాత్ పర్యనటలో ఆయన పేర్కొన్నారు. అయితే దీనిని దివాళీ గిఫ్ట్‌గా దేశ ప్రజలు స్వీకరించడం లేదని శివసేన పేర్కొంది. మోదీ ప్రభుత్వ పాలన పట్ల దేశ ప్రజలు సంతోషంగా లేరని, అనేక మార్పులు రావాల్సిన అవసరం ఉందని శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే అభిప్రాయపడ్డారు. -
'అసెంబ్లీలో చర్చించాకే రాష్ట్రపతికి వద్దకు వస్తుంది'
న్యూఢిల్లీ:రాష్ట్ర విభజన బిల్లును అసెంబ్లీలో చర్చించాకే రాష్ట్రపతి వద్దకు వస్తుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ తెలిపారు. తెలంగాణ బిల్లు అంశంపై శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన అసెంబ్లీలో చర్చించిన తరువాత రాష్ట్రపతికి చేరుతుందన్నారు. తెలంగాణ ఏర్పాటుపై సీడబ్యూసీలో నిర్ణయం చేశామన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర విభజన పై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదన్నారు. విభజన బిల్లు రాష్ట్రపతి అభిప్రాయం తరువాత పార్లమెంట్లో ప్రవేశపెడతామన్నారు. -
'విభజనను సీఎం అడ్డుకోలేరు'
ఇప్పటికే ప్రారంభమైన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అడ్డుకోలేరని ఏఐసీసీ అధికార ప్రతినిధి సందీప్‌దీక్షిత్ వ్యాఖ్యానించారు. పై-లీన్ తుఫానును అడ్డుకోలేకపోయినా, విభజన తుపానును మాత్రం కచ్చితంగా అడ్డుకుంటానన్న కిరణ్ ప్రకటనను ప్రస్తావించగా ఆయన పై విధంగా స్పందించారు. సీఎం వ్యాఖ్యలను కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్ వద్ద ప్రస్తావించినపుడు ఆయన నవ్వేశారు. పార్టీ అధిష్టానం తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా బద్ధులమై ఉంటామని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులంతా అంగీకరించిన తర్వాతే విభజనకు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం జరిగిందని.. ఈ నిర్ణయంపై పార్టీ వెనక్కు వెళ్లే ప్రసక్తే లేదని దిగ్విజయ్ తేల్చిచెప్పారు. సోమవారం సందీప్‌దీక్షిత్ ఏఐసీసీ కార్యాలయంలో, దిగ్విజయ్‌సింగ్ తన నివాసంలో వేర్వేరుగా విలేకరులతో మట్లాడారు. రాష్ట్ర విభజన ప్రక్రియను ఏ రాష్ట్ర ముఖ్యమంత్రీ ఆపలేరని సందీప్ పేర్కొన్నారు. ‘‘తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది.. విభజన విధివిధానాలను కేంద్ర మంత్రుల బృందం పరిశీలిస్తోంది. రాజ్యాంగం ప్రకారం ఒక రాష్ట్రాన్ని విభిజంచి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అంశం పూర్తిగా పార్లమెంటు అధికార పరిధిలో ఉంటుంది.. దానిని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా అడ్డుకోగలుగుతారు?’’ అని ఆయన ప్రశ్నించారు. రాజీనామాలతో పరిష్కారం కాదు: దిగ్విజయ్ సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని దిగ్విజయ్‌సింగ్ సూచించారు. ‘‘రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకునే ముందు అధిష్టానంపై తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని సీమాంధ్ర నేతలు చెప్పారు. ఇప్పుడు హైకమాండ్ నిర్ణయం చేసింది. ఈ నిర్ణయంపై పార్టీ వెనక్కి వెళ్లదు. అందరూ దానికి కట్టుబడి ఉండాల్సిందే’’ అని ఆయన స్పష్టంచేశారు. రాజీనామాలతో సమస్యలు పరిష్కారం కావన్నారు. ఏవైనా ప్రతిపాదనలు ఉంటే కేంద్రం ఏర్పాటు చేసిన మంత్రుల బృందానికి ఇవ్వాలని సూచించారు. ‘‘సీమాంధ్ర నేతల ఇబ్బందికర పరిస్థితి మాకు తెలుసు. ఒకసారి నిర్ణయం చేశాక పరిష్కారాలను చూపాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై ఉంది. అంతా కలిసి పనిచేస్తేనే సీమాంధ్ర, తెలంగాణ, హైదరాబాద్ ప్రజలకు సరైన పరిష్కారం లభిస్తుంది’’ అని దిగ్విజయ్ వ్యాఖ్యానించారు. ‘అసెంబ్లీ తీర్మానం’పై షిండేని అడిగి చెప్తా... ‘అసెంబ్లీకి తెలంగాణ తీర్మానం వెళుతుందా? లేక బిల్లు వెళుతుందా?’ స్పష్టత ఇవ్వాలని విలేకరులు కోరగా.. ‘‘ఈ విషయం ఇంకా తేలాల్సి ఉంది. రాష్ట్ర విభజన బిల్లుకు ముందే తెలంగాణ తీర్మానం రాష్ట్రపతి ద్వారా శాసనసభ పరిశీలనకు వెళ్తుందని కేంద్ర హోంశాఖ తొలుత నాకు తెలియజేసింది. కానీ తర్వాత కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే మరో రకంగా ప్రకటన చేశారు. మంత్రుల బృందం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది. హోంమంత్రి షిండేను కలిసి, తెలంగాణ ప్రక్రియ అమలు విధానంలో ఏమైనా మార్పులు జరిగాయేమో తెలుసుకున్నాక దానిపై స్పష్టత ఇస్తా’’ అని దిగ్విజయ్ బదులిచ్చారు. విభజన అనివార్యమని తేలినందున సీమాంధ్ర అభివృద్ధికి మంచి ప్యాకేజీ ప్రకటించాలని, ఐఐటీ, ఐఐఎం వంటి ఉన్నత విద్యాసంస్థలను ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి పనబాక లక్ష్మి చేసిన సూచనను మంచి ప్రతిపాదనగా దిగ్విజయ్ అభివర్ణించారు. వాటిని పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర మంత్రుల బృందాన్ని కోరారు. -
హామీతో వెనక్కి తగ్గిన సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా వారం రోజులుగా పార్లమెంటులో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు చేస్తున్న ఆందోళనకు తెరపడింది. అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను, సూచనలను పరిగణనలోకి తీసుకొంటామని, సీమాంధ్ర నేతలతో సంప్రదింపులు జరుపుతామని ఇచ్చిన హామీతో తమ పార్టీ ఎంపీలు ఆందోళనను విరమించారని ఏఐసీసీ అధికార ప్రతినిధి, లోక్‌సభ చీఫ్ విప్ సందీప్ దీక్షిత్ పార్లమెంటు ఆవరణలో విలేకరులతో చెప్పారు. సభా కార్యక్రమాలకు అవరోధం కలిగించకుండా పార్లమెంటు ఆవరణలో వారు నిరసన తెలుపుతున్నారని.. అందువల్ల వారిని అభినందిస్తున్నానని వ్యాఖ్యానించారు. అయితే, మంగళవారం లోక్‌సభ, రాజ్యసభల్లో టీడీపీ ఎంపీలు ‘ఆంధ్రప్రదేశ్‌ను రక్షించండి’ అనే నినాదాలు ముద్రించిన చొక్కాలు ధరించి ఆందోళనను కొనసాగించగా.. కాంగ్రెస్ సీమాంధ్ర ఎంపీలు మాత్రం సభల్లోకి రాకుండా పార్లమెంటు ఆవరణలో నిరసన తెలిపారు. కాగా.. టీడీపీ సభ్యులు లోక్‌సభలో ఆందోళన కొనసాగించడంపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్ తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశారు. ఎంతో ముఖ్యమైన ఆహార భద్రత బిల్లుపై చర్చించాల్సిన సమయంలో సభకు అడ్డుతగులుతున్న టీడీపీ సభ్యులపై చర్య తీసుకోవాల్సిందిగా స్పీకర్ మీరాకుమార్ను కోరతామన్నారు. కమల్ నాథ్ మాటలపై రగడ.. గొడవ చేస్తే సభను నడపబోమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్ నాథ్ మంగళవారం లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ‘ఆయన బెదిరిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు’ అని బీజేపీ సభ్యుడు యశ్వంత్ సిన్హా ఆక్షేపించారు. దీంతో కమల్‌నాథ్ వెనక్కి తగ్గారు. జోషీ అంటే తనకు గౌరవమని, తన వ్యాఖ్యలతో ఆయన మనసు గాయపడి ఉంటే వాటిని వెనక్కి తీసుకుంటానని అన్నారు. మరోపక్క.. సుష్మా స్వరాజ్ స్పందిస్తూ, ‘కమల్ నాథ్ వినయం అలవర్చుకోవాలి. ఏం చెబుతున్నామో ముఖ్యం కాదు, ఎలా చెబుతున్నామో ముఖ్యం’ అని చెప్పారు.