
దొడ్డబళ్లాపురం: వివాహిత అనుమానాద స్థితిలో మృతి చెందిన సంఘటన బెంగళూరు ఉత్తర తాలూకా అంచెపాళ్యలో చోటుచేసుకుంది. అంచెపాళ్యలలో అభిషేక్, స్పందన(24) దంపతులు నివాసం ఉంటున్నారు. కాలేజీకి వెళ్లే సమయంలో స్పందన అభిషేక్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. అయితే ఈ వివాహం అభిషేక్ కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. కట్నం కోసం స్పందనను వేధించేవారు. తల్లిదండ్రులకు ఫోన్ చేసి తన బాధలు చెప్పుకుని ఏడ్చేది.
ఇటీవల ఇరు వైపుల పెద్దలు మాట్లాడి రూ.5 లక్షలు ఇప్పించారు. గురువారం భీమన అమావాస్య నేపథ్యంలో భర్తకు పాదపూజ చేసిన స్పందన శుక్రవారం ఉదయం విగతజీవిగా మారింది. స్పందన మృతి చెందినట్లు తల్లితండ్రులకు ఫోన్ చేసి చెప్పడంతో వారు వచ్చి బోరున విలపించారు. అయితే స్పందనను అభిషేక్, అతని తల్లి లక్ష్మమ్మ హత్య చేశారని మృతురాలి తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాదనాయకనహళ్లి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.