రైలుకు వేలాడుతూ స్టంట్లు, కట్‌ చేస్తే.. | Man Lost an Leg and arm While Performing Stunt | Sakshi
Sakshi News home page

రైలుకు వేలాడుతూ స్టంట్లు వైరల్‌, కట్‌ చేస్తే.. కంగుతిన్న పోలీసులు

Jul 27 2024 8:37 AM | Updated on Jul 27 2024 8:49 AM

Man Lost an Leg and arm While Performing Stunt

సరదా మాటున విషాదం నెలకొంటున్న ఘటనలు తరచూ చూస్తున్నాం. అయినా సోయి లేని పనులు చేస్తున్నారు కొందరు. అలా ఓ కుర్రాడు రైలుకు వేలాడుతూ స్టంట్లు చేశాడు. ఆ వీడియో కాస్త వైరల్‌ అయ్యి పోలీసుల దాకా వెళ్లింది. అతన్ని వెతుక్కుంటూ ఆ కుర్రాడి ఇంటికి వెళ్లిన పోలీసులు.. చివరకు అక్కడి దృశ్యం చూసి కంగుతిన్నారు.  

ముంబైలోని సెవ్రీ రైల్వే స్టేషన్‌కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దానిలో ఓ కుర్రాడు ముంబై లోకల్ ట్రైన్‌ డోర్‌ దగ్గర వేలాడుతూ విన్యాసాలు చేస్తూ కనిపించాడు. ఈ వీడియో వైరల్ అయిన నేపధ్యంలో రైల్వే పోలీసులు ఈ  ఉదంతంపై దర్యాప్తు చేపట్టారు.  ఆ కుర్రాడి ఆచూకీ తెలుసుకున్నారు. అయితే ఆ కుర్రాడిని ఒక చేయి, ఒక కాలు కోల్పోయిన స్థితిలో చూసి షాకయ్యారు.  

మీడియాకు అందిన సమాచారం ప్రకారం వాడాలాలోని ఆంటోప్ హిల్‌లో నివసిస్తున్న ఫర్హత్ అజా షేక్ అనే కుర్రాడిని లోకల్‌ రైలులో స్టంట్‌ చేసిన వ్యక్తిగా ఆర్‌పీఎఫ్‌ పోలీసులు కనుగొన్నారు. స్టంట్‌ చేస్తుండగా ఆ కుర్రాడు ఒక కాలు, ఒక చేయిని కోల్పోయినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ కుర్రాడి స్టంట్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన దరిమిలా రైల్వే పోలీసులు జూలై 14న కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆ కుర్రాడు ముంబైలోని ఆంటోప్ హిల్‌లో  ఉంటున్నాడని పోలీసులు తెలుసుకున్నారు. అనంతరం వారు అతని ఇంటికి వెళ్లారు. అక్కడ ఆ కుర్రాడు చేయి, కాలు కోల్పోయి కనిపించడంతో కంగుతిన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement