
న్యూఢిల్లీ: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలయ్యింది. పార్టీలలో ఉత్సాహం పెరిగింది. టిక్కెట్ల ఆశావహులు వివిధ పార్టీలలో చేరుతున్నారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ గాయని మైథిలి ఠాకూర్ బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జ్ వినోద్ తావ్డే, కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్‌లను కలుసుకున్నారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఆమె త్వరలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో దర్భంగా నుండి బీజేపీ టికెట్‌పై పోటీ చేయవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.
వినోద్ తావ్డే తన ‘ఎక్స్’ హ్యాండిల్‌లో మైథిలి ఠాకూర్‌తో సమావేశం అయిన ఫొటోలను షేర్ చేశారు. 1995లో లాలూ ప్రసాద్ యాదవ్ పదవీకాలంలో బీహార్‌ను విడిచిపెట్టిన మైథిలి ఠాకూర్ కుటుంబం రాష్ట్ర పురోగతిని చూసిన తర్వాత తిరిగి ఇక్కడికి రావాలని కోరుకుంటున్నట్లు తావ్డే ఆ పోస్ట్‌లో తెలిపారు. కాగా మైథిలి ఠాకూర్ తన ‘ఎక్స్’ హ్యాండిల్‌లో ‘బీహార్ అభివృద్ధి కోసం కలలుకనే వ్యక్తులను కలుసుకున్నాను. వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు.
जो लोग बिहार के लिए बड़े सपने देखते हैं, उनके साथ हर बातचीत मुझे दूरदृष्टि और सेवा की शक्ति की याद दिलाती है। हृदय से सम्मानित और आभारी हूँ। 🙏✨
श्री नित्यानंद राय जी एवं श्री विनोद श्रीधर तावड़े जी 🙏 https://t.co/o6PBAVJaEJ— Maithili Thakur (@maithilithakur) October 5, 2025
మైథిలి ఠాకూర్ బీహార్‌లోని మధుబనిలోని బెనిపట్టికి చెందినవారు. ఆమెను ఎన్నికల సంఘం బీహార్ 'స్టేట్ ఐకాన్'గా కూడా నియమించింది. భారతీయ శాస్త్రీయ, జానపద సంగీతంలో శిక్షణ పొందిన ఆమె, బీహార్ జానపద సంగీతానికి చేసిన కృషికి గాను 2021లో సంగీత నాటక అకాడమీ నుండి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్‌ను అందుకున్నారు. ఆమె తన ఇద్దరు సోదరులతో పాటు, తాత, తండ్రి నుండి జానపద, హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం, హార్మోనియం, తబలాలో శిక్షణ పొందారు.
రాబోయే ఎన్నికలు ప్రధానంగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని పాలక జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ), రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ)కి చెందిన తేజస్వి యాదవ్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ మధ్య పోటాపోటీగా ఉంటాయని భావిస్తున్నారు. ప్రస్తుతం 243 మంది సభ్యులున్న అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 22తో ముగియనుంది.