వరుస ఎదురుదెబ్బలు.. మావోయిస్టుల‌ కీల‌క నిర్ణ‌యం | Madvi Hidma Removed from Maoist Central Committee | Sakshi
Sakshi News home page

వరుస ఎదురుదెబ్బలు.. మావోయిస్టు పార్టీ కీల‌క నిర్ణ‌యం

Jan 31 2025 4:42 PM | Updated on Jan 31 2025 4:59 PM

Madvi Hidma Removed from Maoist Central Committee

మావోయిస్టు కేంద్ర కమిటీ నుంచి హిడ్మా తొలగింపు

చలపతి ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టు పార్టీ నిర్ణయం

సాక్షి, అమరావతి: దండకారణ్యంలో వరుసగా తగులుతున్న ఎదురుదెబ్బలు మావోయిస్టు పార్టీపై పెను ప్రభావం చూపుతున్నాయి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నుంచి మద్వీ హిడ్మాను ఆ పార్టీ అగ్రనాయకత్వం తొలగించింది. దండకారణ్యంలో కేంద్ర బలగాలను ఎదుర్కోవడంలో వైఫల్యం చెందారనే కారణంతోనే హిడ్మాను తొలగించినట్టు తెలుస్తోంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఆంధ్ర–ఒడిశా సరిహద్దు(ఏవోబీ) స్పెషల్‌ జోనల్‌ కమిటీ కార్యదర్శి రామచంద్రారెడ్డి అలియాస్‌ చలపతితోపాటు 16 మంది మావోయిస్టులు ఇటీవల హతమైన నేపథ్యంలో హిడ్మాను తొలగించడం గమనార్హం.

వాస్తవానికి చలపతి నాయకత్వంలోనే హిడ్మా మావోయిస్టు పార్టీలో కీలక నేతగా ఎదిగారు. ప్రధానంగా మిలటరీ ఆపరేషన్ల ప్రణాళిక, నిర్వహణ చలపతి నుంచే ఆయన నేర్చుకున్నారు. వారిద్దరిదీ గురుశిష్యుల బంధంగా చెబుతారు. 2017లో చత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో భద్రతా బలగాలపై దాడికి హిడ్మానే నేతృత్వం వహించారు. దాంతో ఆయనకు పదోన్నతి కల్పిస్తూ కేంద్ర కమిటీ సభ్యునిగా నియమించారు. 2022 తరువాత ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల నుంచి మావోయిస్టు అగ్రనేతలు చత్తీస్‌ఘడ్‌ సరిహద్దులకు తరలిపోయారు. అప్పటి నుంచే చలపతి, హిడ్మా మధ్య విభేదాలు ఏర్పడినట్టు తెలుస్తోంది. చలపతి దీర్ఘకాలంగా అనారోగ్యంతో ఉండటంతో ఒడిశాలోని మావోయిస్టు పార్టీ వ్యూహాలను హిడ్మానే పర్యవేక్షిస్తున్నారు.

మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడి అరెస్ట్‌ 
ఎటపాక: చత్తీస్‌గఢ్‌కు చెందిన మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడిని అల్లూరి జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలను ఎస్పీ అమిత్‌ బర్దర్‌ గురువారం ఎటపాకలో మీడియాకు వెల్లడించారు. మావోయిస్టు కార్యకలాపాలను అరికట్టడంలో భాగంగా కొన్ని రోజులుగా సీఆర్పీఎఫ్‌ బలగాలతో కలిసి పోలీసులు ఎటపాక మండలం విస్సాపురం పంచాయతీ చెరువుగుంపు అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ చేస్తున్నారు. ఆ సమయంలో మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు సోడి పొజ్జి అలియాస్‌ లలిత్‌ను పోలీసులు పట్టుకున్నారు. పొజ్జి ఛత్తీస్‌గఢ్‌లోని గొండిగూడకు చెందిన వ్యక్తి అని ఎస్పీ చెప్పారు. 

చ‌ద‌వండి: ఓవర్‌ యాక్షన్‌ ఫలితం.. చిక్కుల్లో ఖాకీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement