Lok Sabha Election 2024: మహిళా ఎంపీలు 9 మందే! | Sakshi
Sakshi News home page

Lok Sabha Election 2024: మహిళా ఎంపీలు 9 మందే!

Published Sat, May 25 2024 4:12 AM

Lok Sabha Election 2024: 9 women MPs entered Lok Sabha from Delhi

ఢిల్లీ పేలవ రికార్డు 

మహిళలను లోక్‌సభకు పంపే విషయంలో ఢిల్లీ పేలవమైన రికార్డు మూటగట్టుకుంది. స్వాతం్రత్యానంతరం ఇప్పటిదాకా నగరం నుంచి ఎంపీలుగా ఎన్నికైన మహిళలు కేవలం తొమ్మిది మంది మాత్రమే! రాజధాని నుంచి లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన తొలి మహిళగా ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు సుచేతా కృపలానీ నిలిచారు. 

ఆమె 1952లో తొలి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1957లో కూడా గెలిచారు. 1963లో ఆమె యూపీ సీఎం అయ్యారు. మళ్లీ తొమ్మిదేళ్లకు 1971లో సుభద్రా జోషీ, ముకుల్‌ బెనర్జీ ఢిల్లీ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. సుభద్ర లోక్‌సభ ఎంపీ అయిన తొలి పంజాబీ మహిళ కూడా. ఆమె 1962లో యూపీలోని బలరాంపూర్‌లో దివంగత ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయిని ఓడించడం విశేషం. 

తర్వాత 1980లో సుందర్‌వతీ నావల్‌ ప్రభాకర్‌ చాందినీచౌక్‌ లోక్‌సభ స్థానం నుంచి గెలిచారు. అనంతరం 1996, 1998 ఎన్నికల్లో మీరాకుమార్, సుష్మా స్వరాజ్‌ ఎంపీలయ్యారు. లోక్‌సభ తొలి మహిళా స్పీకర్‌గా మీరాకుమార్‌ నిలవగా, ఢిల్లీ నుంచి తొలి కాంగ్రెసేతర మహిళా ఎంపీగా సుష్మా స్వరాజ్‌ రికార్డులెక్కారు. 1999లో బీజేపీకి చెందిన అనితా ఆర్య కరోల్‌ బాగ్‌ నుంచి గెలుపొందారు. 2004, 2009ల్లో కాంగ్రెస్‌కు చెందిన కృష్ణ తీర్థ్‌ ఢిల్లీ నుంచి ఎంపీ అయ్యారు. 2014, 2019ల్లో మీనాక్షి లేఖి బీజేపీ నుంచి న్యూఢిల్లీ స్థానంలో నెగ్గారు. 

బీజేపీ నుంచి బరిలో ఇద్దరు 
ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఢిల్లీ నుంచి లోక్‌సభ బరిలో దిగినా ఓటమి చవిచూశారు. ఈసారి బీజేపీ సుష్మా స్వరాజ్‌ కూతురు బాసురి (న్యూఢిల్లీ), కమల్‌జీత్‌ షెరావత్‌ (వెస్ట్‌ ఢిల్లీ) రూపంలో ఇద్దరు మహిళలకు ఢిల్లీలో టికెట్లిచ్చింది. కాంగ్రెస్‌ మాత్రం ఒక్క మహిళకు కూడా ఢిల్లీలో అవకాశమివ్వలేదు.     

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  
 

Advertisement
 
Advertisement
 
Advertisement