
పశ్చిమబెంగాల్ కోర్టు చారిత్రక తీర్పు
కోల్‌కతా: డిజిటల్ అరెస్ట్ సైబర్ మోసం కేసులో దేశంలోనే మొట్టమొదటిసారిగా పశ్చిమబెంగాల్ కోర్టు 9 మందికి యావజ్జీవ శిక్షలు విధిస్తూ తీర్పు వెలువరించింది. పెరిగిపోతున్న సైబర్ నేరాల కట్టడికి దేశం సాగిస్తున్న పోరులో నడియా జిల్లా కల్యాణి కోర్టు తీర్పు మైలురాయిగా నిలిచిపోనుంది. ఘటన జరిగిన ఎనిమిది నెలల్లోనే విచారణ పూర్తి చేసి, అదనపు సెషన్స్ జడ్జి తీర్పు వెలువరించడం మరో విశేషం.
దోషుల్లో మహారాష్ట్రకు చెందిన నలుగురు, హరియాణా వాసులు ముగ్గురు, గుజరాత్‌కు చెందిన ఇద్దరు ఉన్నారు. పార్థ కుమార్ ముఖర్జీ అనే రిటైర్డు సైంటిస్ట్ నుంచి సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ బూచి చూపి ఏకంగా కోటి రూపాయలు గుంజారు. ముంబై పోలీస్ అధికారినంటూ ఈ ముఠాలోని వ్యక్తి ముఖర్జీకి వాట్సాప్ కాల్ చేసి ఆర్థిక నేరాలకు పాల్పడినందున డిజిటల్ అరెస్ట్ తప్పదంటూ బెదిరించాడు. దీంతో, ఆయన ఈ ముఠా సభ్యులకు చెందిన పలు బ్యాంకు అక్కౌంట్లకు రూ.కోటి ట్రాన్స్‌ఫర్ చేశారు. మోసపోయినట్లు గుర్తించిన ముఖర్జీ 2024 అక్టోబర్‌లో ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన రాణాఘాట్ సైబర్ క్రైం స్టేషన్ పోలీసులు నిందితులను గుర్తించి నాలుగున్నర నెలల్లో అంటే 2025 ఫిబ్రవరి 24వ తేదీతో విచారణ ముగించారు. మొత్తం విచారణ ప్రక్రియ 8 నెలల్లోనే పూర్తవడం విశేషమని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బివాస్ చటర్జీ చెప్పారు. ఈ ముఠా భారత సిమ్ కార్డులతో కంబోడియా నుంచి బాధితుడికి ఫోన్లు చేసి బెదిరించారన్నారు. ఇలా వీరు 100 మందిని మోసగించారని తెలిపారు. మహారాష్ట్ర, హరియాణా, గుజరాత్, రాజస్తాన్‌లకు చెందిన 13 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు 9 మందిపై ఫోర్జరీ, కుట్ర తదితర నేరారోపణలు చేశారన్నారు.