కర్ణాటక అసెంబ్లీని మళ్లీ కుదిపేసిన హనీట్రాప్‌ | Karnataka BJP MLAs Tears Muslim Quota Bill Copies, Throw At Speaker Viral | Sakshi
Sakshi News home page

కర్ణాటక అసెంబ్లీని మళ్లీ కుదిపేసిన హనీట్రాప్‌

Published Fri, Mar 21 2025 12:27 PM | Last Updated on Fri, Mar 21 2025 1:26 PM

Karnataka BJP MLAs Tears Muslim Quota Bill Copies, Throw At Speaker Viral

బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపిన హనీ ట్రాప్‌(Honey Trap) వ్యవహారం.. ఇవాళ మళ్లీ అసెంబ్లీని కుదిపేసింది. ఈ అంశంపై శాసనసభలో చర్చించాల్సిందేనని బీజేపీ పట్టుబట్టింది. అయితే ఆ నిరసనలను పట్టించుకోకుండా ముస్లిం కోటా బిల్లును స్పీకర్‌ పాస్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో  సభ ఒక్కసారిగా అలజడి రేగింది. 

ఆగ్రహంతో స్పీకర్‌ వెల్‌లోకి దూసుకెళ్లిన బీజేపీ సభ్యులు తమ చేతుల్లోని ముస్లిం కోటా బిల్లు(Muslim Quota Bill) ప్రతులను చించి స్పీకర్‌ ముఖంపైకి విసిరి కొట్టారు. ప్రతిగా.. కాంగ్రెస్‌ సభ్యులు బుక్‌లు, పేపర్లను ప్రతిపక్ష సభ్యులపైకి విసిరారు. ఈ గందరగోళం నడుమ సభను స్పీకర్‌ కాసేపు వాయిదా వేశారు.

పబ్లిక్‌ కాంట్రాక్ట్‌లలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం చట్టం తెచ్చింది. అయితే ఇది రాజ్యాంగ విరుద్ధమంటున్న బీజేపీ.. కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్ణయంపై కోర్టుకు వెళ్తామని చెబుతోంది. మరోవైపు సభలో ఇవాళ జరిగిన పరిణామాలపై బీజేపీ ఎమ్మెల్యే భరత్‌శెట్టి స్పందించారు. ‘‘హనీ ట్రాప్‌ వ్యవహారంపై చర్చించకుండా.. ముస్లిం కోటా బిల్లును ప్రవేశపెట్టడంపైన సీఎం సిద్ధరామయ్య దృష్టి పెట్టారు. అందుకే మేం నిరసన తెలిపాం. అంతేగానీ మేము ఎవరికీ హాని తలపెట్టలేదు’’ అని అన్నారాయన.

ఎవరినీ రక్షించే ఉద్దేశం లేదు: సీఎం సిద్దు
ఇంకోవైపు ముస్లిం కోటా నిర్ణయాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం సమర్థించుకుంది. సామాజిక న్యాయం, మైనారిటీలకు ఆర్థిక సాధికారకత కోసం రిజర్వేషన్లు తీసుకొచ్చామని సిద్ధరామయ్య ప్రభుత్వం చెబుతోంది. హనీట్రాప్‌లో ఎవరి ప్రమేయం ఉన్నట్లు తేలినా చర్యలు తీసుకుంటామన్న సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah).. ఇందులో నుంచి ఎవరినీ రక్షించే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని వ్యాఖ్యానించారు. ఉన్నత స్థాయి కమిటీతో విచారణ చేస్తామని హోంమంత్రి జి పరమేశ్వర హామీ ఇచ్చినప్పటికీ బీజేపీ అనవసర రాద్ధాంతం సృష్టిస్తోందని మండిపడ్డారు.

ఇదిలా ఉంటే.. మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా 48 మంది రాజకీయ నేతలు హనీట్రాప్‌ బాధితులుగా ఉన్నారంటూ కర్ణాటక మంత్రి రాజన్న అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటన తీవ్ర చర్చనీయాశంమైన సంగతి తెలిసిందే. ఇందులో అధికార, విపక్ష సభ్యులతో పాటు జాతీయ స్థాయిలోని నాయకులు కూడా ఉన్నారంటూ బాంబ్‌ పేల్చారాయన. అయితే ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపిస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. బీజేపీ మాత్రం ఈ వలపు వల వెనుక కాంగ్రెస్‌ ప్రభుత్వ హస్తమే ఉందని, కాబట్టి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్‌ చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement