
15 ఏళ్ల జార్ఖండ్ బాలిక ఆదర్శం
ఖుంటి: ఆ గ్రామాన్ని కలిపే రహదారిపై వంతెన వర్షాలకు దెబ్బతింది. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కర్ర నిచ్చెనను ప్రమాదకరమంటూ అధికారులు తీసేశారు. అయినా ఆ బాలిక అధైర్యపడలేదు. చదువుకోవాలనే తపన ముందు అడ్డంకులన్నీ ఓడిపోయాయి. స్కూలు బ్యాగును నెత్తిపై పెట్టుకుని ఈదుకుంటూ నదిని దాటి తడిచి నీళ్లు కారుతున్న దుస్తులతోనే స్కూలుకు వెళుతోంది.
ఆ గ్రామంలోని మిగతా పిల్లలందరిదీ ఇదే పరిస్థితి. జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. రాంచీ–ఖుంటి–సిండెగా రహదారిలో పెలోల్ గ్రామాన్ని కలుపుతూ బనాయ్ నదిపై ప్రభుత్వం 2007లో రూ.1.30 కోట్లతో వంతెన నిర్మించింది. చుట్టుపక్కల 12 గ్రామాల ప్రజలకు ఆ వంతెనే ఆధారం. జూన్ 19వ తేదీన సంభవించిన వరద తీవ్రతకు వంతెన పిల్లర్ ఒకటి దెబ్బతింది. దీంతో, వెదురుకర్రలతో తాత్కాలికంగా వంతెనను ఏర్పాటు చేసుకుని గ్రామస్తులంతా పెలోల్ చేరుకుంటున్నారు. కానీ, ప్రమాదకరంగా ఉందంటూ అధికారులు ఆ నిచ్చెనను తొలగించారు.
కానీ, పెలోల్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న అంగర్బరీ గ్రామానికి చెందిన సునీత హొరొ(పేరు మార్చారు) మాత్రం ఏమాత్రం భయపడలేదు. నెత్తిపై స్కూల్ బ్యాగు పెట్టుకుని నదిలో ఈదుతూ ఆవలి ఒడ్డుకు చేరుకుంటోంది. తడిచిన దుస్తులకు బదులుగా బ్యాగులో అదనంగా సిద్ధంగా ఉంచుకున్న డ్రెస్‌ను వేసుకుని స్కూలుకు వెళ్లేంది. ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడూ ఇదే పరిస్థితి. దీంతో, వారంలో ఒకటీ రెండు సార్లు మాత్రమే స్కూలుకు వెళ్తున్నామని తెలిపింది. సునీత వచ్చే ఏడాది బోర్డు పరీక్షలు రాయాల్సి ఉంది. ‘స్కూలుకెళ్లాంటే నదిలో కొంత భాగాన్ని ఈదటమే తప్ప మరో మార్గంలేదు.
ఈదేటప్పుడు స్కూలు బ్యాగు నెత్తిపై పెట్టుకుంటా. కానీ, నా డ్రెస్ పూర్తిగా తడిచిపోతుంది. అందుకే, వచ్చేటప్పుడే ఎక్స్ ట్రా తెచ్చుకుంటా’అని ఆమె తెలిపింది. బోర్డు పరీక్షలకు ప్రిపరేరయ్యే తన స్నేహితులదీ ఇదే పరిస్థితని వివరించింది. సాధారణంగా ఐదంటే ఐదే నిమిషాలు పట్టే ప్రయాణానికి ఇప్పుడు 12 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తోందని, 40 నిమిషాల సమయం తీసుకుంటోందని విద్యార్థులు అంటున్నారు. రాంచీ నుంచి సిండెగా మీదుగా ఒడిశా వెళ్లే భారీ వాహనాలు, బస్సులు సైతం వంతెన దెబ్బతినడంతో ప్రత్యామ్నాయం మార్గంలో వెళ్తున్నాయి. వంతెన వద్ద డైవర్షన్ రోడ్డు నిర్మించే పనిలో ఉన్నామని ఖుంటి సబ్ డివిజనల్ అధికారి దీపేశ్ కుమారి తెలిపారు. అయితే, ఆగకుండా కురుస్తున్న వానలతో పనులకు అవరోధం కలుగుతోందని చెప్పారు. జార్ఖండ్ సీఎంహేమంత్ సోరెన్‌వంతెన దెబ్బతినడంపై దర్యాప్తునకు ఆదేశించారు.