76,18,192 మంది వాడుతున్న పాస్‌వర్డ్ ఇదే..
ప్రమాదంలో కోట్లాదిమంది ఆన్‌లైన్ ఖాతాలు
కంపేరిటెక్ తాజా నివేదికలో ఆసక్తికర అంశాలు
123456..ఫ్యాన్సీ నంబరు కదా.. ఇది చూడగానే పెదవిపై ఓ చిరునవ్వు.. అంతేనా.. చాలామంది కళ్లు కాస్త పెద్దవిగా కూడా అయి ఉంటాయి. ఎందుకంటే లక్షలాది మంది ఈ నంబరును ఆన్‌లైన్ ఖాతాలకు పాస్‌వర్డ్‌గా పెట్టుకున్నారు కాబట్టి. ఈ జాబితాలో మీరూ ఉంటే కచ్చితంగా పాస్‌వర్డ్ మార్చుకోవాల్సిందే. యూకేకు చెందిన సాఫ్ట్‌వేర్ కంపెనీ ‘కంపేరిటెక్’ఓ ఆసక్తికర నివేదికను రూపొందించింది.
2025లో డేటా బ్రీచ్ ఫోరమ్స్‌లో లీక్ అయిన 200 కోట్లకుపైగా రియల్ అకౌంట్ పాస్‌వర్డ్స్‌ను కంపేరిటెక్ సేకరించింది. ఆ డేటా ఆధారంగా అత్యధికంగా ఉపయోగించిన పాస్‌వర్డ్స్ జాబితాను విడుదల చేసింది. 123456 పాస్‌వర్డ్‌ను ఏకంగా 76,18,192 మంది తమ ఆన్‌లైన్ ఖాతాలకు ఉపయోగిస్తున్నారు. 12345678ను 36.7 లక్షలు, 123456789ను 28.6 లక్షల మంది వినియోగిస్తున్నారు. ఆ తర్వాతి స్థానాల్లోadmin, 1234 పాస్‌వర్డ్స్ ఉన్నాయి. అత్యధికంగా వినియోగించిన టాప్–100 పాస్‌వర్డ్స్‌లో 53వ స్థానాన్ని India@123 ఆక్రమించింది.

డేటా బ్రీచ్ ఫోరమ్స్
యూజర్ల సమాచారాన్ని తస్కరించిన ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు తరచూ డార్క్ వెబ్‌లో కనిపిస్తాయి. ఇవి సైబర్ నేరస్తులు దొంగిలించిన డేటాను పంచుకోవడానికి, కొనుగోలు, విక్రయించడానికి మార్కెట్ ప్లేస్‌లు, చర్చా కేంద్రాలుగా పనిచేస్తాయి. దొంగిలించిన సమాచారంతో సిద్ధంగా ఉన్న మార్కెట్‌ను రహస్యంగా అందించడం ద్వారా చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఈ వేదికలు సులభతరం చేస్తాయి. ప్యారిస్‌లోని లూవ్ (Louvre) మ్యూజియంలో సెక్యూరిటీ సిస్టమ్‌కు Louvre అనే పదం పాస్‌వర్డ్‌గా ఉంది. ఇంత సులభంగా ఉండడం వల్లే దోపిడీ నిమిషాల్లో పూర్తయ్యింది. సుమారు రూ.900 కోట్ల విలువైన ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లిపోయారు.
కనీసం 12 అక్షరాలు..
పాస్‌వర్డ్ కనీసం 12 అక్షరాలు ఉండాలని మైక్రోసాఫ్ట్ చెబుతోంది. సులభంగా గుర్తించే అవకాశం ఇవ్వకుండా చిన్న, పెద్ద అక్షరాలు, సంఖ్యలు, చిహ్నాల కలయికతో రూపొందించుకోవాలి. కుటుంబ సభ్యులు, వ్యక్తులు, ఉత్పత్తి పేరును పాస్‌వర్డ్‌గా ఉపయోగించకపోవడం మంచిది. తద్వారా మరొకరి చేతుల్లోకి పాస్‌వర్డ్ వెళ్లే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి.
⇒ 65.8% పాస్‌వర్డ్స్ 12 అక్షరాల కంటే తక్కువ ఉన్నాయి
⇒ 3.2% ఖాతాలకు 16 లేదా అంతకంటే ఎక్కువ అక్షరాలను ఉపయోగించారు
బాధితులు కావొద్దు
ఇంటికి తాళం వేసినప్పుడు ఒకటికి రెండుసార్లు లాగి సరిగ్గా పడిందా లేదా అని చూస్తుంటాం. అలాంటిది మన కష్టార్జితం అంతా దాచుకున్న బ్యాంకు ఖాతాలు లేదా పేమెంట్ యాప్స్, జీ–మెయిల్ అకౌంట్స్ వంటి ముఖ్యమైన సాధనాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఆన్‌లైన్ పాస్‌వర్డ్‌ను మరొకరు సులభంగా ఊహించగలిగితే, దానిని ఎట్టిపరిస్థితుల్లోనూ వినియోగించకూడదు. ఒకే పాస్‌వర్డ్‌ను ఉపయోగించే వ్యక్తులు ఎక్కువమంది ఉంటే అటువంటి ఖాతాలను హ్యాకర్లు సులభంగా ఛేదించడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఏఐ సాధనాలను సైబర్ నేరస్తులు ఆయుధంగా చేసుకుంటున్న ప్రస్తుత తరుణంలో నెటిజన్లు జాగ్రత్త పడకపోతే బాధితులుగా మిగిలిపోయినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఊహించడం కష్టంగా, దొంగిలించేందుకు వీలులేని క్లిష్టమైన పాస్‌వర్డ్‌ను పెట్టుకోండి అంటూ బ్యాంక్స్, ఆన్‌లైన్ సేవల కంపెనీలు తరచూ చెప్పేది ఇందుకే.
సులభంగా ఊహించేలా..
⇒ చాలా పాస్‌వర్డ్స్‌ను ఆరోహణ లేదా అవరోహణ సంఖ్యలతో.. అంటే వరుస క్రమంలో 12345 లేదా 54321 మాదిరిగా సులభంగా ఊహించేలా ఉంటున్నాయి.
⇒ టాప్–1,000లో నాలుగింట ఒక వంతు పాస్‌వర్డ్స్ పూర్తిగా సంఖ్యలతోనే పెట్టుకున్నారు.
⇒ 123 అంకెలతో 38.6%, 321తో 2%, abc పాస్‌వర్డ్‌తో 3.1% ఖాతాలు ఉన్నాయి.
⇒ 18వ స్థానంలో 111111, 35వ స్థానంలో నిలిచింది.
⇒ 3.9% , password, 2.7% admin, 1% welcome అనే పదాలను కలిగి ఉన్నాయి.


