
పీఎస్ఎల్వీ.. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇది నాలుగు అంచెల రాకెట్. ఈ రాకెట్‌లో తొలి, మూడో దశల్లో ఘన ఇంధనం వాడతారు. ఇక రెండు, నాలుగో దశల్లో ద్రవ ఇంధనం వినియోగిస్తారు. 101వ ఉపగ్రహం ‘రీశాట్-1బి’ని రోదసికి పంపేందుకు నేటి ‘శతాధిక’ ప్రయోగంతో కలిపి పీఎస్ఎల్వీతో ఇస్రో 63 ప్రయోగాలు నిర్వహించింది. వీటిలో ఈ రాకెట్ విఫలమైన సందర్భాలు మూడు. 2017 తర్వాత రాకెట్లో లోపం కనిపించడం ఇదే తొలిసారి.
నిజానికి మూడో దశలో రాకెట్ ఫెయిల్ కావడం అరుదు. 114 సెకండ్లపాటు సాగే ఈ మూడో దశలో హెచ్టీపీబీ (హైడ్రాక్సిల్-టర్మినేటెడ్ పాలీబ్యూటడీన్) ఘన ఇంధన మోటార్ వాడతారు. ఈ ఇంధనం ఆదర్శ స్థితిలో 240 కిలో న్యూటన్ల చోదకశక్తి ఇస్తుంది. తాజా ప్రయోగ వైఫల్య కారణాలను నిగ్గుతేల్చేందుకు ఇస్రో నుంచి ఒకటి, ప్రభుత్వం నుంచి మరొకటి వంతున రెండు కమిటీలు రంగంలోకి దిగాయి. రాకెట్ వేగం, ఎత్తు, ఇంజిన్ల పనితీరు అంశాలపై అవి అధ్యయనం చేస్తాయి. మోటారులో ఇంధన ప్రవాహం సరిగా లేదా? నాజిల్ సమస్యలు తలెత్తాయా? మోటారు డిజైన్/తయారీపరమైన లోపాలున్నాయా? ఇలా పలు కోణాల్లో విశ్లేషణ కొనసాగనుంది. కచ్చితమైన కారణం ఇంకా తెలియనప్పటికీ... రాకెట్ మూడో దశలో మోటార్ కేస్ లోపలి చాంబర్ ప్రెజర్లో అకస్మాత్తుగా పీడనం తగ్గడానికి ఫ్లెక్స్ నాజిల్ నియంత్రణ వ్యవస్థలో తలెత్తిన లోపమే కారణమని ఇస్రో ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది.
రాకెట్ వేగం, చోదక దిశలను నిర్దేశించేది ఈ కీలక భాగమే. ‘కంబశ్చన్ చాంబర్’లో ఇంధనం దహనమై విపరీత పీడనంతో వేడి వాయువులు నాజిల్ గుండా వెలుపలికి తన్నుకొస్తేనే రాకెట్ ప్రయాణం ముందుకు (పైకి) సాగుతుంది. ఈ ‘చర్యకు ప్రతిచర్య’ అనే మౌలిక సూత్రం ఆధారంగానే రాకెట్ పనిచేస్తుంది. రబ్బరు లాంటి స్థితిస్థాపక గుణం (లేయర్డ్ ఎలాస్టోమెరిక్) గల పదార్థాల పొరలతో ఫ్లెక్సిబుల్ నాజిల్స్ తయారవుతాయి. హైడ్రాలిక్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చి తద్వారా వాల్వులను కదిలిస్తూ ద్రవ/వాయు ప్రవాహాలను నియంత్రించేందుకు సాధారణంగా హైడ్రాలిక్ యాక్చువేటర్లను వినియోగిస్తుంటారు. వీటి పనితీరు సంక్లిష్టంగా ఉంటుంది. అందుకే పీఎస్ఎల్వీ రాకెట్ మూడో దశ మోటారులో హైడ్రాలిక్ యాక్చువేటర్లు కాకుండా… పరిమిత కోణాల్లోనే అయినప్పటికీ అన్ని దిశల్లో కదులుతూ కచ్చితమైన చోదకశక్తిని అందించేందుకు ఫ్లెక్సిబుల్ బేరింగ్ గల ఫ్లెక్స్ నాజిల్స్ ఉపయోగిస్తున్నారు.

ఈ వ్యవస్థలో ఉత్పన్నమైన సమస్య వల్లనే తాజా ప్రయోగం విఫలమైనట్టు అనుమానిస్తున్నారు. నాజిల్ యాక్చువేటర్లు, ఫ్లెక్సిబుల్ జాయింట్, కంట్రోల్ సిగ్నల్స్... వీటిలో ఏదో ఒక సమస్య ఏర్పడి చాంబర్ ప్రెజర్లో పీడనం తగ్గి, మరింత ఎత్తుకు ప్రయాణించడానికి చాలినంత చోదకశక్తి లభించక రాకెట్ గతి తప్పడం ఆరంభించింది. దాన్ని అలాగే వదిలేస్తే జనావాసాలపై కూలి ప్రాణ-ఆస్తి నష్టం సంభవించే అవకాశముంది. అందుకే భద్రతా నిబంధనల ప్రకారం ఇస్రో దాన్ని ‘మిడ్ ఎయిర్-అబార్ట్’ చేసింది. అంటే... రాకెట్లో పేలోడ్ (ఉపగ్రహం) ఉన్న చివరిదైన నాలుగో దశను వేరే దారి లేక ఇస్రో కూల్చివేయాల్సి వచ్చింది.
-జమ్ముల శ్రీకాంత్..