వివిధ రంగాల్లోకి కృత్రిమ మేధ (ఏఐ) చొచ్చుకొస్తున్న వేళ... సురక్షితంగా, బాధ్యతాయుతంగా దాన్ని వినియోగించేందుకు వీలుగా భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఇటీవల ‘భారత ఏఐ గవర్నన్స్ గైడ్‌లైన్స్’ను ప్రకటించింది. ఇంతకీ ప్రభుత్వం ప్రకటించిన ఈ మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయి? ఇప్పుడున్న చట్టాల పరిధిలోనే ఏఐతో వచ్చే ఇక్కట్లను సైతం ఎదుర్కోవాలని చూస్తున్న ఈ మార్గదర్శకాల వల్ల ప్రయోజనం ఉంటుందా? ఏఐని మరీ పంజరంలో చిలకగా చేయకూడదన్న మాట నిజమే కానీ, డేటా ప్రైవసీ సహా అనేక
అంశాలపై ఆందోళన తీరేదెలా?
ఇప్పుడేం జరిగింది?
శరవేగంతో దూసుకొస్తున్న ఏఐ టెక్నాలజీల విష యంలో ప్రపంచ దేశాలన్నీ హడావిడిగా చట్టాలు చేసేస్తుంటే, మన దేశంలో ప్రత్యేకమైన చట్టమంటూ ఇంకా ఏమీ లేదు. సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను పెంపొందించాలనుకుంటున్న ప్రభుత్వం ఈ పరిస్థి తుల్లో ఆచరణాత్మక దృక్పథంతో ఒక అడుగు వేసింది. ప్రభుత్వం నియమించిన కమిటీ ‘ఇండియా ఏఐ గవర్నన్స్ గైడ్‌లైన్స్’ నివేదికను తయారుచేసి, అందించింది. ఏఐపై నియంత్రణ కన్నా సమన్వయా నికి ప్రాధాన్యమివ్వడం 66 పేజీల ఈ బ్లూ ప్రింట్ ప్రత్యేకత.
ఏఐతో ఒనగూడే లాభాలనూ, ఎదురయ్యే కష్టనష్టాలనూ సమతూకం చేస్తూ దేశ పరిస్థితులకు తగ్గట్టు ఇందులో మార్గదర్శకాలను సిద్ధం చేశారు. ఏఐపై అతిగా కట్టుదిట్టాలు పెట్టి, సృజనశీలురనూ, మదుపరులనూ ఇరుకునపెట్టరాదనే భావనతో ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. నిజానికి, గతంలోనే ఓ సబ్ కమిటీ ఒక ముసాయిదా సిద్ధం చేసింది. అయితే, ఆ తర్వాత సదరు సబ్ కమిటీతో సంబంధం లేకుండా మొన్న జూలైలో మంత్రిత్వ శాఖ వేసిన కమిటీ తాజా మార్గదర్శకాలు సిద్ధం చేసింది.
ఈ పత్రం ఏం చెబుతోంది?
ఇవాళ ప్రపంచంలోనే ఛాట్ జీపీటీ లాంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్‌ఎల్‌ఎంలు)ను అమెరికా తర్వాత అత్యధికంగా వాడుతున్న దేశం మనదే. ఏఐలో ప్రపంచ ఆధిపత్యం సంపాదించాలని అమె రికా, చైనాలు తహతహలాడుతుంటే, భారత్ మాత్రం సమూల మార్పు తెచ్చే ఈ టెక్నాలజీలను ప్రజల జీవితాలను మార్చేందుకు ఎలా వాడాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ‘ఏఐ గవ ర్నెన్స్ గూపు’ను ఏర్పాటు చేయాలన్నది ఈ మార్గ దర్శకాల్లో ఓ సూచన.
ఆ గ్రూపునకు అండగా ‘టెక్నాలజీ అండ్ పాలసీ ఎక్స్‌పర్ట్ కమిటీ’, అలాగే ‘ఏఐ సేఫ్టీ ఇన్‌స్టిట్యూట్’ ఉంటాయి. అయితే, ప్రభుత్వ అధికారులు ఏఐ సిస్టమ్స్‌ను వాడినప్పుడు ఏం చేయాలన్న దానిపై ఇప్పటికీ ఏకాభిప్రాయం లేదు. ప్రభుత్వం సంగతి అటుంచితే, ప్రైవేట్ రంగం భారతీయ చట్టాలన్నిటినీ పాటిస్తూ, స్వచ్ఛందంగా నియమాలు పెట్టుకొని, పారదర్శకంగా వ్యవహరించాలనీ, బాధితుల సమస్యను పరిష్కరించే వ్యవ స్థలు ఏర్పాటు చేసుకోవాలనీ మార్గదర్శకాలు సూచించాయి. ఏఐతో చేసిన కంటెంట్ విషయంలో యూట్యూబ్, ఇన్‌స్టా లాంటివి ఇకపై ఆ మాట స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. ఐటీ రూల్స్‌లో ఇప్పటికే ఈ సవరణ ముసాయిదా తెచ్చారు.
రానున్న రోజుల్లో ఏం జరగనుంది?
ఏఐ నియంత్రణకు సంబంధించి ఇప్పటికే వరుసగా ప్రపంచ సదస్సులు జరుగుతున్నాయి. బ్లెట్‌చెలీ పార్క్ (బ్రిటన్), సియోల్, ప్యారిస్‌లలో జరిగిన గత సదస్సుల అనంతరం రానున్న నాలుగో సదస్సు వచ్చే ఏడాది ఢిల్లీలో జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ మార్గదర్శకాల రూపకల్పన కీలకమైంది. ఏఐని నియంత్రించడం కష్టమైపోతోందని ప్రపంచ దేశా లన్నీ కిందా మీదా అవుతున్న పరిస్థితుల్లో మన దేశం ఇలా ఆగి, ఆలోచించే వైఖరిని అవలంబించడం మంచిదే. అర్థం చేసుకోదగినదే. భవిష్యత్తులో అవస రాన్ని బట్టి ఏఐపై నియంత్రణ, లేదా చట్టాన్ని చేస్తా మంటూ ప్రభుత్వ ఐటీ కార్యదర్శి సైతం చెప్పడాన్ని ఆ కోణం నుంచి చూడాలి.
అయితే, ఏఐ సృష్టి వీడి యోలతో తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేస్తూ రాజకీయ నేతల మొదలు రంగుల లోకపు తారల దాకా అందరినీ బాధితుల్ని చేస్తున్న డీప్ ఫేక్ మహ మ్మారిపై చర్యలు తక్షణావసరం. ఈ విషయంలో విధాన నిర్ణేతలపై ఇప్పటికే చాలా ఒత్తిడి వస్తోందని మర్చిపోలేం. ఏఐపై అతిగా రూల్స్ పెట్టిన యూరో పియన్ యూనియన్, మార్కెట్ శక్తులకే అంతా వది లేసి స్వచ్ఛంద నియమాలతో ఈ రంగం పెంపొందా లని భావిస్తున్న అమెరికా... ఈ రెంటితో పోలిస్తే, భారత మధ్యేమార్గ ధోరణి ప్రశంసనీయమే కానీ ఫలితాలిస్తుందా అన్నది చూడాలి.


