షేక్ హసీనాకు విధించిన మరణదండన తీర్పుపై ఇండియా ఏ వైఖరి అనుసరించినా చిక్కే! భారత్ ఒకవేళ బంగ్లాదేశ్ ఆంతరంగిక రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే, నిజంగా చేసుకున్నా లేదా చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చినా అక్కడి తాత్కాలిక ప్రభుత్వ ప్రాపగాండాకు గొప్ప వరంలా అందివస్తుంది. ద్వైపాక్షిక సంబంధాలలో మరింత విషం నింపినట్లు అవుతుంది.
బంగ్లాదేశ్ చరిత్ర మరో మలుపు తిరుగు తోంది. ఉద్వాసనకు గురైన బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆమె దేశంలోని అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ సోమ వారం నాడు మరణ దండన విధించింది. హసీనాపై విచారణ రాజకీయ దురుద్దేశా లతోనే సాగిందని ఆమె మద్దతుదారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఆమెకు మరణ దండన విధించడంతో అదొక భద్రతా, దౌత్యపరమైన విస్ఫో టనంగా పరిణమించింది. భారత్‌తో సహా పాశ్చాత్య దేశాలు ఈ ప్రాంతంలో సుస్థిరతను కోరుకుంటున్నాయి. కానీ ట్రైబ్యునల్ తీర్పుపై ఏ వైఖరి అనుసరించినా చిక్కులు తెచ్చిపెట్టేదిగానే ఉంది.
రెండు వర్గాలుగా బంగ్లాదేశీయులు
బంగ్లాదేశ్‌తో వచ్చిన చిక్కేమిటంటే, ప్రజానీకం రెండు శిబిరా లుగా చీలిపోయి ఉంటున్నారు. ఒక వర్గం ఉదారవాద ఇస్లాంకు అనుకూలం. ఉపఖండం స్వాతంత్య్రాన్ని గడించుకోక ముందు నుంచీ ఈ వర్గంవారు దక్షిణాసియాలోని మిగిలిన దేశాలతో సత్సంబంధాలను కోరుకుంటూ, ప్రజా కృషక్ పార్టీ వంటి పార్టీల వైపు మొగ్గు చూపుతూ వచ్చారు. వారు 1947 తర్వాత, అవామీ లీగ్, వామపక్షాలకు మద్దతు ఇస్తున్నారు. రెండవ వర్గం ఇస్లామిక్ దేశంగా మారాలని కోరుకుంటోంది.
వీరు గతంలో ముస్లిం లీగ్‌కు మద్దతు ఇచ్చారు. తర్వాత, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ)కి, జనరల్ హుస్సేన్ ఎర్షాద్‌కు చెందిన ‘జాతీయ పార్టీ’ వంటి కొన్ని పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. మూడవ వర్గం కూడా ఒకటుంది. అది షరియాను కోరుతూ, ఇస్లాం మతాచారాలను తు.చ. తప్పకుండా పాటించాలని డిమాండ్ చేస్తోంది. అది జమాత్–ఇస్లామీ బంగ్లాదేశ్ మద్దతుదారు. అయితే, బంగ్లాదేశ్‌లో అత్యధిక ప్రజానీకం ఈ సైద్ధాంతిక ఘర్షణల్లో తటస్థంగానే ఉంటూ, ప్రభుత్వ మార్పునకు వీలు కల్పిస్తూంటారు.
ఇండియాపై తక్షణ ప్రభావం
భౌగోళిక అంశాలు, ప్రజా వర్గాల కారణంగా బంగ్లాదేశ్ ప్రభావం మనపై ఉంటుందని మొదట అర్థం చేసుకోవాలి. భారత్– బంగ్లాదేశ్ సరిహద్దు నిడివి ఎక్కువ. బంగ్లా వైపు నుంచి ఉగ్ర వాదులు సులభంగా భారత్‌లోకి ప్రవేశించడం, ఇక్కడి నేరస్థులకు ఆయుధాలు చేరవేయడం కొన్ని దశాబ్దాలుగా సాగుతోంది. అలాగే పోరాటాలకు దిగేవారు, శరణార్థులు భారత్ లోనికి ప్రవేశించేందుకు ఢాకాలోని అస్థిర పరిస్థితులు పురికొల్పవచ్చు.
రెండు-పాకిస్తాన్‌తో ముడిపడిన కుట్రదారులు, బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న పాత్రధారుల మధ్య జరిగిన సమావేశాలకూ, ఢిల్లీ ఎర్రకోట ఘటన దర్యాప్తులో నిగ్గుదేలుతున్న అంశాలకూ మధ్య నున్న సంబంధం ఒక ఆందోళనకర ధోరణిని సూచిస్తోంది. ఉగ్ర వాదులు, వారిని పోషిస్తున్న వ్యవస్థల సంబంధీకులు బంగ్లాదేశ్‌ను కేవలం దేశీయ రంగస్థలంగా చూడటం లేదు. భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకునేందుకు ఉపయోగపడే రహస్య స్థావరంగా చూస్తున్నారు. దాంతో ఢాకాలో అస్థిరత న్యూఢిల్లీకి ప్రత్యక్ష జాతీయ భద్రతా సమస్యగా పరిణమిస్తోంది.
మూడు– రాజకీయ దృక్కోణం దౌత్యపరమైన ఒత్తిడిని సృష్టి స్తోంది. భారతదేశం ఒకవేళ ఢాకా ఆంతరంగిక రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే, నిజంగా జోక్యం చేసుకున్నా లేదా జోక్యం చేసు కున్నట్లు ఆరోపణలు వచ్చినా అక్కడి తాత్కాలిక ప్రభుత్వ ప్రాపగాండాకు గొప్ప వరంలా అందివస్తుంది. ద్వైపాక్షిక సంబంధాలలో మరింత విషం నింపినట్లు అవుతుంది. సరిహద్దు నిర్వహణ, కౌంటర్ టెర్రరిజంపై సహకారాన్ని బలహీనపరుస్తుంది. నీతి నియమాల సూత్రాలు, వివేకం– రెండింటిలో దేనితో నడుద్దామనుకున్నా భారతదేశానికున్న అవకాశాలు సవాళ్ళతో నిండినవే!
ఏం చేయగలం?
ప్రాంతీయ పెత్తందారుగా వ్యవహరిస్తోందని ఢాకా భాష్యం చెప్పడానికి వీలున్న చర్యల జోలికి పోకుండానే, తన జాతీయ భద్ర తను, పౌరులను భారత్ పరిరక్షించుకోవాల్సి ఉంది. సరిహద్దులో చొరబాట్లు లేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలను భారత్ వేగ వంతం చేయాలి. సరిహద్దుకు ఆనుకుని ఉన్న జిల్లాలలో మానవతా చర్యలను చేపట్టేందుకు సమాయత్తమవ్వాలి. అత్యవసర మందు లను, గుడారాలను, జన ప్రవాహాన్ని తట్టుకుని చట్టాన్ని అమలు చేయగల విభాగాలను సిద్ధం చేసి పెట్టుకోవాలి. దాతలను రంగంలోకి దింపడానికి సిద్ధమై, ఐరాస సంస్థలతో సమన్వయంతో పని చేయాలి.
సైనిక దళాలను మోహరిస్తే, పరిస్థితి చేయి దాటే ప్రమాదం ఉంది. ఆత్మరక్షణ, పౌర రక్షణ ఏర్పాట్లు చేసుకోవ డంలో తప్పు లేదు. అవి అత్యవసరం కూడా! సరిహద్దుకు ఆవల నున్న ఉగ్రవాద తండాల కదలికలపై సాంకేతిక, కార్యనిర్వహణా పరమైన, జ్యుడీషియల్ మార్గాల ద్వారా ఒక కన్ను వేసి ఉంచి, ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పంచుకోవడాన్ని న్యూఢిల్లీ తీవ్రం చేయాలి. అవి నిక్కచ్చిగా కౌంటర్ టెర్రరిజం చర్యలవుతాయి కానీ, రాజకీయ జోక్యం కిందకు రావు.
సుస్థిరతను అందించగల సామర్థ్యమున్న బంగ్లాదేశీ మధ్య వర్తితో ప్రైవేటుగా చర్చలు జరిపేందుకు సిద్ధమై ఉండాలి. అది రాజ కీయంగా అసౌకర్యమైనదే. కానీ, రాజకీయ సంబంధాలు అట్టడు గుకు చేరిన సమయంలో కూడా (సరిహద్దుల నిర్వహణ, కౌంటర్ టెర్రరిజం, విద్యుత్తు, వర్తక వాణిజ్యాల వంటి) అంశాల ఆధారిత చర్చలు కొనసాగాలి. దక్షిణాసియా అస్థిరత సరిహద్దులను దాటి ఎలాంటి పర్యవసానాలకు కారణం కాగలదో అమెరికా, ఐరోపా దేశాలకు, ‘క్వాడ్’ భాగస్వాములకు న్యూఢిల్లీ నివేదించాలి. ఉద్రిక్తత లను సడలింపజేసేందుకు అంతర్జాతీయంగా ఒత్తిడి తేవడం, పౌరుల హక్కులను గౌరవించేలా మాట తీసుకోవడం మంచిది.
ఢాకాలో రాజకీయ ఏకాభిప్రాయ సాధనకు ఎంతో కొంత ప్రయత్నించినా కూడా అది హింసను నిరోధించగల ఉత్తమ కవచంగా పనిచేస్తుంది. గౌరవప్రదమైన ప్రాంతీయ ప్రముఖులు, బహుళ పక్షీయ మధ్యవర్తులతో సమ్మిళిత రాజకీయ మధ్యవర్తిత్వాన్ని ప్రోత్స హించేందుకు భారత్ ప్రయత్నించవచ్చు. తద్వారా, ఎన్నికల నిర్వహణకు, చట్టబద్ధ పాలనకు అనువైన పరిస్థితులు ఏర్పడేటట్లు చేసినట్లు అవుతుంది. అవి కొరవడితే, అణచివేతలు, తిరుగుబాటు కార్యకలాపాలు పునరావృతమవుతూనే ఉంటాయి.

-జయంత రాయ్ చౌధురీ
వ్యాసకర్త పీటీఐ తూర్పు ప్రాంత విభాగ మాజీ అధిపతి


