‘ఇరాన్ వైపు అమెరికా బలగాలు.. ఇక యుద్ధమే తరువాయి.. ట్రంప్ ఆదేశాలు ఇచ్చిన మరుక్షణమే ఇరాన్‌పై అమెరికా విజృంబించడం ఖాయం..’ ఇవే మనకు గత కొన్ని రోజులుగా కనిపిస్తున్న వార్తలు. అమెరికా వెనక్కి తగ్గిందనేది కాసేపు.. అంతలోనే ఇరాన్ కాళ్ల బేరానికి వచ్చిందనేది మరొకవైపు. ఏది ఏమైనా తమది వెనక్కి తగ్గే మనస్తత్వం కాదని అంటోంది ఇరాన్. అవసరమైతే ఎందాకైనా పోరాడతామని స్సష్టం చేసింది. తమకు యుద్ధాలు కొత్త కాదని, వాటికి భయపడటం అనేది తమ రక్తంలోనే లేదని భారత్‌లోని ఇరాన్ కాన్సుల్ జనరల్ సయ్యద రెజా మొసాయెబ్ మోత్లాఘ్ స్పష్టం చేశారు.
ముంబైలో ఇరాన్ కాన్సులేట్ ప్రతినిధిగా పనిచేస్తున్న ఆయన.. ఇరాన్ నైజం ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందో వివరించే యత్నం చేశారు. ఇటీవల ఇజ్రాయిల్‌తో 12 రోజుల పాటు జరిగిన యుద్ధాన్ని, అంతకుముందు తాము ఎదుర్కొన్న యుద్ధ పరిస్థితులను వివరించారు. ఎన్డీటీవీతో మాట్లాడిన ఆయన.. ఏ సమయంలోనూ తాము ధైర్యం కోల్పోలేదన్నారు. తాము ఎవరో భయపెడితే భయపడిపోయే తత్వం కాదన్నారు.
ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ కూడా దేనికి భయపడరన్నారు. ఖమేనీ బంకర్‌లో దాక్కున్నారని వస్తున్న వార్తలను ఖండించారు. బంకర్‌లో దాక్కొనేంత పిరికి నేత ఖమేనీ కాదన్నారు. దేనికైనా తమ దేశం సిద్ధంగా ఉంటుందన్నారు. ఇక భారత్‌తో సంబంధాల గురించి మాట్లాడుతూ.. ఆంక్షల బెదిరింపులు ఉన్నప్పటికీ భారత్‌తో సంబంధాలు యధావిధిగా కొనసాగించేందుకు యత్నిస్తున్నామన్నారు.


