హైదరాబాద్‌ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు.. | Indigo Jeddah Hyderabad Flight Receives Hoax Bomb Threat | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు..

Nov 1 2025 8:24 PM | Updated on Nov 1 2025 8:24 PM

Indigo Jeddah Hyderabad Flight Receives Hoax Bomb Threat

హైదరాబాద్‌: సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.. విమానాన్ని దారి మళ్లించారు. హైదరాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ చేయకుండా ముంబైకి తీసుకువెళ్లి సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఎయిర్‌పోర్ట్‌ అధికారులకు శనివారం ఉదయం 5:30 గంటల సమయంలో ఒక మెయిల్ వచ్చింది. జెడ్డా నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానంలో మానవ బాంబు ఉన్నట్లు ఆ మెయిల్‌లో రాసి ఉంది.

1984లో మద్రాస్(చెన్నై) ఎయిర్‌పోర్టులో జరిగిన బాంబు దాడి తరహాలో ఈ దాడి జరుగుతుందని, ఎల్‌టీటీఈ, ఐఎస్ఐ ఈ దాడికి ప్రణాళిక వేశాయని ఆ మెయిల్‌లో పేర్కొన్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన విమానాశ్రయ అధికారులు పైలట్‌కు సమాచారం అందించారు. విమానాన్ని ముంబైలో ల్యాండ్ చేయాలని సూచించారు.

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో భద్రతా తనిఖీలు నిర్వహించామని.. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని ఇండిగో ప్రకటించింది. విమానం ఉదయం 9:10కి హైదరాబాద్‌లో ల్యాండ్ కావాల్సి ఉండగా.. బాంబు బెదిరింపు కారణంగా ముంబైకి మళ్లించారు. తనిఖీలు అనంతరం విమానం తిరిగి ముంబై నుంచి సాయంత్రం 4 గంటల సమయంలో హైదరాబాద్‌కు చేరుకుంది.

కాగా, 1984 ఆగస్టు 2న రాత్రి 10:10 గంటలకు మద్రాస్ (ఇప్పటి చెన్నై) మీనం బక్కం అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన బాంబు దాడి భారత్‌లో జరిగిన ఘోరమైన ఉగ్రదాడుల్లో ఒకటి. రెండు గోధుమ రంగు సూట్‌కేసుల్లో బాంబులు పెట్టి, వాటిని కస్టమ్స్ బాగేజ్ హాల్‌లో ఉంచారు. ఈ బాంబు పేలుళ్లలో  33 మంది మరణించారు. వారిలో 23 మంది శ్రీలంక పౌరులు ఉన్నారు. 27 మంది గాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement