సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం పరిపాలనలో కీలక మార్పులు చేసింది. ఐఏఎస్ అధికారుల బదిలీలు, కొత్త నియామకాలు, అలాగే జీఎహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్లను నియమిస్తూ నోటిఫికేషన్ విడుదలైంది.
గురువారం ప్రభుత్వం విడుదల చేసిన నోటిషికేషన్‌లో జయేష్ రంజన్‌ను స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమిస్తూ, మెట్రోపాలిటన్ ఏరియా & అర్బన్ డెవలప్‌మెంట్ బాధ్యతలు అప్పగించారు. ఆయనకు యూత్ అడ్వాన్స్‌మెంట్, టూరిజం అండ్ కల్చర్, స్పోర్ట్స్, అలాగే ఆర్కియాలజీ డైరెక్టర్ పదవుల అదనపు బాధ్యతలు కొనసాగుతాయి.
అదే సమయంలో, జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా ఏర్పాటు చేసిన జోన్లకు కమిషనర్లను నియమించారు. సిరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, రాజేంద్రనగర్, సికింద్రాబాద్, శంషాబాద్, ఎల్.బి.నగర్, మల్కాజ్‌గిరి, ఉప్పల్ జోన్లకు కొత్త ఐఏఎస్ అధికారులు, అదనపు కలెక్టర్లు నియమితులయ్యారు. వీరిలో భోర్కాడే హేమంత్ సహదేవరావు, అపూర్వ్ చౌహాన్, సందీప్ కుమార్ ఝా, ప్రియాంకా అలా, అనురాగ్ జయంతి, సచిత్ గంగ్వార్, రాధికా గుప్తా వంటి అధికారులు ఉన్నారు.
ఇక, రాజన్న సిరిసిల్ల కలెక్టర్ హరితను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీగా బదిలీ చేశారు. ఆమె స్థానంలో గరిమా అగర్వాల్ తాత్కాలికంగా కలెక్టర్ బాధ్యతలు చేపడతారు. అదేవిధంగా, ఈ.వి. నరసింహా రెడ్డిను మూసి రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు. అదనంగా, పలు కీలక విభాగాల్లో తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించింది. భవేష్ మిశ్రాకు ఇండస్ట్రీ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ సెల్ అదనపు సీఈవో బాధ్యతలు అప్పగించగా, నిర్మల కన్తి వెస్లీను డైరెక్టర్, ఎంప్లాయ్‌మెంట్ అండ ట్రైనింగ్ ఎఫ్‌ఏసీఎస్‌గా నియమించారు.


