తుది దశకుప్రతిష్టాత్మకఎకనమిక్ కారిడార్
695 కి.మీ., రూ.13 వేల కోట్ల వ్యయం
4 వరుసలతో సెమీయాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్ వే
మధ్యప్రదేశ్–మహారాష్ట్ర–తెలంగాణల మధ్య వాణిజ్య పురోగతికి దోహదం
తెలంగాణలోఎన్‌హెచ్–65,ఎన్‌హెచ్–161లతోఅనుసంధానం
ప్రస్తుత దూరం150 కి.మీ. మేర తగ్గి..ఏడు గంటల వరకు ప్రయాణ సమయం ఆదా
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్–ఇండోర్ ఎకనమిక్ కారిడార్ తుదిదశకు చేరుకుంది. వచ్చే సంవత్సరం ప్రథమార్ధంలో ప్రారంభానికి సిద్ధమవుతోంది. పారిశ్రామిక నగరమైన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ను హైదరాబాద్‌తో నేరుగా జోడించే బృహత్తర ప్రాజెక్టు ఇది. మహారాష్ట్రలోని కీలక నగరాలైన నాందెడ్, హింగోళి, అకోలాలను జోడిస్తూ ఇది ముందుకు సాగుతుంది. వెరసి ఇండోర్–నాందెడ్–హైదరాబాద్‌ల మధ్య వాణిజ్య సంబంధాలను దృఢపరిచేందుకు ఇది దోహదం చేస్తుంది.
ఈ ప్రాజెక్టు పూర్తయితే ఇండోర్–హైదరాబాద్ మధ్య ప్రస్తుతం ఉన్న 18 గంటల ప్రయాణం 11 గంటలకు తగ్గుతుంది. సాధారణ ప్రయాణాలకు ఈ రోడ్డు ఉపయోగపడుతున్నా, దీనిని వాణిజ్యపరంగా పురోగతి సాధించే ప్రధాన ఫ్రైట్ కారిడార్‌గా రూపొందిస్తున్నారు. ప్రస్తుతమున్న జాతీయ రహదారులను వెడల్పు చేయటం ద్వారా (బ్రౌన్ ఫీల్డ్) కొంత, కొత్తగా రోడ్డును నిర్మించటం ద్వారా (గ్రీన్‌ఫీల్డ్) కొంత అనుసంధానమవుతూ ఈ 695 కి.మీ. నాలుగు వరుసల సెమీ యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్ వే సిద్ధమవుతోంది.
ఈ నెలలోనే ఈ కొత్త ఎకనమిక్ కారిడార్ అందుబాటులోకి రావాల్సి ఉన్నా, కొన్ని భారీ సొరంగ మార్గాలు, వంతెనల నిర్మాణంలో అడ్డంకుల వల్ల కొంత జాప్యం అనివార్యమైంది. ఏప్రిల్ నాటికి దీనిని పూర్తి చేసి ప్రారంభించాలని ఎన్‌హెచ్‌ఏఐ కసరత్తు చేస్తోంది.
ఇండోర్‌ను లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దాలని....
ఇండోర్‌ను లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దాలని కేంద్రం గతంలోనే సంకల్పించింది. ఉత్తర భారత్‌లోని ప్రధాన నగరాలతో దీనికి మెరుగైన అనుసంధానం ఉన్నా, దక్షిణ భారత్‌తో కొంత ఇబ్బంది ఉంది. కొంతకాలంగా ఇండోర్‌లో సాఫ్ట్‌వేర్ రంగం బాగా పురోగమిస్తోంది. ఐటీ హబ్‌గా బెంగళూరుకు గట్టిపోటీనిస్తున్న హైదరాబాద్‌తో ఇండోర్‌ను అనుసంధానించాలని కేంద్రం నిర్ణయించింది.
పారిశ్రామికంగా ఉన్నత స్థితిలో ఉన్న ఇండోర్ కొన్ని రకాల వస్తువులను మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు సరఫరా చేస్తూ, కొన్ని వస్తువులను దిగుమతి చేసుకుంటోంది. రోడ్డు మార్గాన హైదరాబాద్‌కు చేరుకోవాలంటే దాదాపు 18 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతమున్న 347 బీజీ, 161, 65 నంబర్ జాతీయ రహదారుల మీదుగా రావాల్సి ఉంది.
ఈ రోడ్డు చాలా పట్టణాలతో అనుసంధానమై ఉన్నందున ప్రయాణ సమయం ఎక్కువగా ఉంటోంది. ఇప్పుడు ఆ జాతీయ రహదారులను జోడిస్తూనే కొన్ని పట్టణాలను పరిహరిస్తూ, మరికొన్నింటిని బైపాస్ చేస్తూ రోడ్డు ముందుకు సాగుతుంది. దాదాపు 150 కి.మీ. నిడివిని తగ్గిస్తూ నిర్మిస్తున్నారు.
తెలంగాణలో పూర్తిగా పాత రోడ్లతోనే...
ఇండోర్ నుంచి ఖాండ్వా, బుర్హాన్‌పూర్ (బైపాస్), ఇచ్చాపూర్, ముక్తాయ్‌నగర్, మహారాష్ట్రలోని జల్గావ్, అకోలా, వాషిం, హింగోళి, నాందేడ్ నుంచి మన రాష్ట్రంలోని బోధన్, ఎల్లారెడ్డి మీదుగా సంగారెడ్డికి చేరుకుంటుంది. అక్కడి నుంచి ఎన్‌హెచ్–65 మీదుగా హైదరాబాద్‌కు చేరుకుంటుంది. తెలంగాణ పరిధిలో దీని నిడివి 100 కిలోమీటర్లు. హైదరాబాద్ నుంచి అకోలా వరకు ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారుల మీదుగానే సాగుతుంది. దీనిని సెమీ యాక్సెస్ కంట్రోల్డ్ రోడ్డుగా నిర్మిస్తున్నందున... ఉన్న జాతీయ రహదారులను ఆ స్థాయికి అభివృద్ధి చేశారు.
అలా మార్చిన భాగంలోని సంగారెడ్డి సమీపంలోని కంది–రామ్‌సాన్‌పల్లి 40 కి.మీ. భాగాన్ని గతంలోనే ప్రధాని మోదీ జాతికి అంకితం చేసిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా–మహారాష్ట్రలోని అకోలా మధ్య 242 కి.మీ. నిడివితో పూర్తి కొత్త రోడ్డును నిర్మించారు. ఈ భాగంలో బెహ్రూఘాట్ వద్ద 576 మీటర్ల సొరంగం, బైగ్రామ్ వద్ద 480 మీటర్లు, చోరల్‌ఘాట్ వద్ద 550 మీటర్ల సొరంగాలను నిర్మించారు.
ఇండోర్–దేవాస్ మధ్య ఆరు వరుసల నాలుగు భారీ వంతెనలు నిర్మిస్తున్నారు. ఈ పనులు తుది దశకు చేరుకున్నాయి. నర్మదానది, ఇతర కాలువలు, పైప్‌లైన్ల మీదుగా వంతెనలు, అండర్‌పాస్‌లు దాదాపు 28 నిర్మించారు. వీటి వల్లనే పనులు ఆలస్యమయ్యాయి.


