సాక్షి,హైదరాబాద్: వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జరుపుకునే కైట్ ఫెస్టివల్‌ను చెరువుల వద్ద ప్రత్యేకంగా నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి.. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఆదేశాలు జారీ చేశారు.
గురువారం జూబ్లీహిల్స్ తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో హైడ్రా కమిషనర్ రంగనాథ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైడ్రా ఆధ్వర్యంలో జరుగుతున్న చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాలపై కమిషనర్ వివరాలు అందించారు. చెరువుల సంరక్షణ, పునరుద్ధరణలో ఇప్పటివరకు చేపట్టిన చర్యలు, భవిష్యత్ ప్రణాళికలను ముఖ్యమంత్రికి వివరిస్తూ, ప్రజలకు అందించే ప్రయోజనాలను వివరించారు.
అనంతరం,సంక్రాంతి పండుగను పురస్కరించుకుని చెరువుల వద్ద ప్రత్యేకంగా కైట్ ఫెస్టివల్ నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు టూరిజం శాఖతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. ప్రజలతో పాటు ఐటీ రంగ ప్రముఖులు, ఉద్యోగులు పాల్గొనేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
అలాగే, కూకట్‌పల్లి నల్లచెరువు వద్ద సినిమా ప్రముఖులతో, రాజేంద్రనగర్ బురుకుద్ఫిన్ చెరువు వద్ద క్రీడాకారులతో కలిసి కైట్ ఫెస్టివల్ జరపాలని ఆదేశించారు. ఈ ఉత్సవాన్ని జనవరి 11, 12, 13 తేదీలలో నిర్వహించాలని ముఖ్యమంత్రి స్పష్టంగా తెలిపారు. చెరువుల పునరుద్ధరణతో పాటు ప్రజలలో అవగాహన పెంచేందుకు, పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చేందుకు ఈ కైట్ ఫెస్టివల్ ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.


