ఇంతకీ...పౌరసత్వానికి గుర్తింపు కార్డు ఏది? | Indian Passport Not Conclusive Proof Of Citizenship | Sakshi
Sakshi News home page

ఇంతకీ...పౌరసత్వానికి గుర్తింపు కార్డు ఏది?

Jun 26 2026 2:08 AM | Updated on Jun 26 2026 2:08 AM

Indian Passport Not Conclusive Proof Of Citizenship

పాస్‌పోర్ట్‌ గుర్తింపు కాదంటున్న విదేశాంగ శాఖ

ఆధార్, ఓటర్‌ ఐడీకూడా కాదట!

బర్త్‌ సర్టిఫికెట్, నివాస ధ్రువీకరణ పత్రాలే పౌరసత్వాన్ని నిర్ధారిస్తాయన్న కేంద్రం 

ప్రభుత్వ వివరణ అసంబద్ధంగా ఉందంటూ వెల్లువెత్తుతున్న విమర్శలు 

పౌరసత్వానికి ప్రాతిపదిక కానప్పుడు పోలీస్‌ వెరిఫికేషన్‌ అంటూ అంతటి ప్రహసనం ఎందుకని నిలదీత 

ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విపక్ష ఎంపీలు

సాక్షి, న్యూఢిల్లీ: భారతప్రభుత్వం జారీచేసిన పాస్‌పోర్ట్‌ ఉన్నంతమాత్రాన భారతీయ పౌరులు కాబోరని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణతో దుమారం రేగుతోంది. పారసత్వానికి ప్రాతిపదిక కానప్పుడు పాస్‌పోర్ట్‌ జారీకి అంతటి సంక్లిష్టమైన ప్రక్రియ, పోలీస్‌ వెరిఫికేషన్‌ వంటి సుదీర్ఘ వడబోత ప్రక్రియలు ఎందుకు అని తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

14వ ‘పాస్‌పోర్ట్‌ సేవా దివస్‌ సందర్భంగా గురువారం కేంద్ర విదేశాంగ శాఖ ఇచ్చిన వివరణతో ఈ వివాదం మొదలైంది. ‘‘పాస్‌పోర్ట్‌ అనేది భారతీయ పౌరసత్వానికి ఏ రకంగానూ గుర్తింపు కాబోదు. కేవలం అంతర్జాతీయ ప్రయాణాలకు వీలు కల్పిస్తూ జారీచేసిన అనుమతి పత్రంగానే పాస్‌పోర్ట్‌ను చూడాలి’’అని కేంద్ర విదేశాంగ శాఖ పేర్కొంది. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వ వర్గాలు గురువారం దీనిపై స్పందించాయి. 

‘‘పౌరసత్వం నిర్ధారణకు పాస్‌పోర్ట్‌ను ప్రామాణికంగా తీసుకోకూడదు అనే నిర్ణయం నిన్న మొన్న తీసుకున్నది కాదు. మోదీ ప్రభుత్వ హయాంలో గత 12 ఏళ్లలో తీసుకున్నది అసలే కాదు. పాస్‌పోర్ట్‌ చట్టం, 1967లోని సెక్షన్‌ ప్రకారం పౌరులుకాని వ్యక్తులకూ పాస్‌పోర్ట్‌లు జారీ చేయవచ్చు. గతంలో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. ఏరకంగా చూసినా పాస్‌పోర్ట్‌ అనేది పౌరసత్వానికి ఒక రుజువుగా ప్రభుత్వం ఏనాడూ పరిగణించలేదు. 

ఇప్పటికే పాస్‌పోర్ట్‌ సంపాదించినంత మాత్రాన వాళ్లకు పౌరసత్వం వచ్చేసిందని భావించకూడదు. పాస్‌పోర్ట్‌ అనేది పౌరసత్వానికి రుజువు కాదు అని 2013లో బాంబే హైకోర్టు సైతం గతంలో పలు తీర్పుల్లో స్పష్టంచేసింది’’అని ప్రభుత్వ వర్గాలు వివరణ ఇచ్చాయి. ఈ వివరణపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ వివరణపై పలువురు ప్రతిపక్ష పార్టీ నేతలు తీవ్రంగా స్పందించారు. 

తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా ఈ మేరకు ‘ఎక్స్‌’లో ఒక పోస్ట్‌ చేశారు. ‘‘భారతీయ పౌరసత్వానికి ఇప్పుడు ఏకైక రుజువు హిందువుగా ఉండటం లేదా బీజేపీ ఓటర్‌ కావడం మాత్రమే కావచ్చు’’అని అన్నారు. రాజ్యసభ ఎంపీ కపిల్‌ సిబల్‌ సైతం ‘ఎక్స్‌’లో ఒక పోస్ట్‌ చేశారు. ‘‘మరి పౌరత్వానికి ఏ పత్రం రుజువు?’. బూత్‌ లెవల్‌ అధికారి(బీఎల్‌ఓ) నా పౌరసత్వంపై అనుమానాలు వ్యక్తం చేసి నా ఓటు హక్కును కాలరాస్తారేమో’’అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

 ప్రభుత్వ వివరణ అసంబద్ధంగా ఉందని బాలీవుడ్‌లో ప్రముఖ గేయ రచయిత జావేద్‌ అక్తర్‌ విమర్శించారు. ‘‘ప్రభుత్వం చెబుతున్నదంతా నిజమా? అంటే కొందరు వ్యక్తులకు వాళ్లు భారతీయులు అని పూర్తిగా నిర్ధారించుకోకుండానే విదేశాంగ శాఖ పాస్‌పోర్ట్‌లు జారీచేస్తోందా? ఇది నిజంగా అసంబద్ధమైన విషయం’’అని అన్నారు. ఆధార్, ఓటరు కార్డు, పాస్‌పోర్టు ఇవేవీ పౌరసత్వానికి గుర్తింపు కాకపోతే మరి అసలైన గుర్తింపు ఏమిటని నెటిజన్లు కేంద్రప్రభుత్వాన్ని నిలదీశారు. అన్నింటికీ ఆధార్‌ కార్డును ప్రామాణికం చేసినప్పుడు పౌరసత్వానికి ఎందుకు చేయడం లేదని వాళ్లు ప్రశ్నించారు.  

గతంలోనూ ప్రభుత్వ వివరణ 
జనన ధ్రువీకరణ, శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రాలను మాత్రమే పౌరసత్వాన్ని రుజువు చేసే అధికారిక పత్రాలుగా గుర్తిస్తామని గతేడాది కేంద్రం స్పష్టం చేసింది. జనన, మరణ ధ్రువీకరణ చట్టం– 1969 ప్రకారం నిర్ధేశిత అధికారులు మాత్రమే జనన ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేయాలి. ఒక వ్యక్తి నిర్దేశిత రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం పరిధిలో నివసించారని నివాస ధ్రువీకరణ పత్రాలు నిర్ధారిస్తాయి. ఇవి మాత్రమే వాళ్లు భారతీయ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారని రుజువు చేస్తాయి. ఈ పత్రాలు లేని వారు తమ పౌరసత్వ నిర్ధారణకు సంబంధిత మున్సిపల్‌ లేదా రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఆశ్రయించాల్సి ఉంటుంది కేంద్రం గతంలో స్పష్టంచేయడం తెల్సిందే.

 ‘‘కేంద్రం ప్రభుత్వం జారీ చేసే ఆధార్‌ కార్డు సైతం పౌరసత్వాన్ని నిర్ధారించే పత్రం కాదు. ఒక గుర్తింపు పత్రం మాత్రమే’’అని ఎన్నికల కమిషన్‌ నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌) సర్వే సంబంధ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టంచేయడం తెల్సిందే. 

2019 డిసెంబరు 20వ తేదీన కేంద్రప్రభుత్వ విభాగమైన ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(పీఐబీ).. నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌(ఎన్‌ఆర్‌సీ), సిటిజన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌ (సీఏఏ)లకు సంబంధించిన పౌరుల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తిచేస్తూ పలు ప్రశ్నలు, వాటికి సమాధానాలను ప్రచురించింది. వీటి ప్రకారం ‘‘పుట్టిన తేదీ, పుట్టిన ప్రాంతానికి సంబంధించిన ఏ పత్రాన్నైనా ఇచ్చి పౌరసత్వాన్ని రుజువు చేసుకోవచ్చు. అయితే ఏ ఏ పత్రాలను అనుమతిస్తారన్న విషయంపై ఆయా శాఖలు నిర్ణయం తీసుకుంటాయి. వ్యక్తుల పౌరసత్వం అనేది 2009 నాటి ‘ద సిటిజన్‌షిప్‌ రూల్స్‌’ప్రకారం నిర్ణయిస్తారు. ఈ నిబంధనలు పౌరసత్వ చట్టం, 1955 ఆధారంగా ఉంటాయి.

మరి ఈ ఐదింటి సంగతేంటి? 
అన్ని విద్యా, నివాస ధ్రువీకరణ పత్రా ల జిరాక్స్‌లను జతచేసి, తప్పుల్లేకుండా పాస్‌పోర్ట్‌ దరఖాస్తు ఫారాలను నింపి పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాల వద్ద సంక్లిష్టమైన, సుదీర్ఘ ప్రక్రియను పూర్తిచేసి పోలీస్‌ వెరిఫికేషన్‌ సైతం విజయవంతంగా అయిపోయాక సాధించిన పాస్‌పోర్ట్‌ అనేది పౌరసత్వ నిరూపణకు అక్కరకు రాదు అని ప్రభుత్వం ఇచ్చిన వివరణపై నెటిజన్లు ప్రభుత్వానికి పలు సూటి ప్రశ్నలు సంధించారు. ఇక్కడి నుంచి వెళ్లిన వ్యక్తులను విదేశీ పోలీసులు, అధికారులు ప్రశ్నించినప్పుడు అక్కరకొచ్చే ఏకైక ధ్రువీకరణ పాస్‌పోర్ట్‌. అలాంటి పాస్‌పోర్ట్‌ స్వదేశంలో ఎందుకు జాతీయతకు రుజువుగా పనికిరాదు? అని నిలదీశారు.

పౌరసమాజం సంధించిన ఐదుపశ్నలు 
1. విదేశీ పౌరసత్వం తీసుకుంటే భారత పాస్‌పోర్ట్‌ ఎందుకు వెనక్కి ఇచ్చేయాలి? 
పౌరసత్వ చట్టం, 1955 ప్రకారం భారతీయులు ద్వంద్వ పౌరసత్వం కల్గిఉండటానికి వీల్లేదు. భారతీయ పౌరులు విదేశీ పౌరసత్వం తీసుకుంటే భారత పాస్‌పోర్ట్‌ను వెంటనే ప్రభుత్వానికి ఇవ్వాలనే నిబంధన ఉంది. ఇవ్వకపోతే పాస్‌పోర్ట్‌ చట్టం,1967 ప్రకారం శిక్షిస్తారు. పాస్‌పోర్ట్‌ అనేది కేవలం ప్రయాణపత్రం అయినప్పుడు వెంటనే తిరిగి స్వాధీనంచేయాల్సిన అవసరం ఏంటి? పాస్‌పోర్ట్‌ అనేది స్వదేశస్తులకు మాత్రమే జారీచేస్తాం అని పాస్‌పోర్ట్‌ మాన్యువల్‌లో స్పష్టంగా రాసి ఉంటుంది. మరి అలాంటప్పుడు ఇది పౌరసత్వాన్ని ఎందుకు రుజువుచేయదు?

2.పోలీస్‌ వెరిఫికేషన్‌తో పనేంటి? 
కేవలం ప్రయాణాల కోసమే పాస్‌పోర్ట్‌ ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అలాంటప్పుడు ప్రయాణాలు చేసే వ్యక్తుల వ్యక్తిగత విషయాలు పోలీసులకు ఎందుకు? ఫలానా వాళ్లకు పాస్‌పోర్ట్‌ ఇవ్వొచ్చు అని పోలీసులు ఎలా నిర్ధారిస్తారు? వ్యక్తుల నేరచరిత్రకు, సాధారణ ప్రయాణాలకు ఏ రకంగా సంబంధం ఉంది? విదేశీయులకు పాస్‌పోర్ట్‌ జారీచేసినప్పుడు స్వదేశీయులకు పాస్‌పోర్ట్‌ జారీచేయడానికి ఎందుకంత కష్టతరమైన పోలీస్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియను అవలంభిస్తున్నారు? పదేపదే దరఖాస్తులు తిరస్కరిస్తూ పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిప్పుకోవాల్సిన అవసరమేంటి?

3. విదేశీయులకు భారత పాస్‌పోర్ట్‌ ఎందుకు? 
పాస్‌పోర్ట్‌ చట్టం, 1967లోని 20వ సెక్షన్‌ ప్రకారం ప్రత్యేక సందర్భాల్లో గతంలో భారతీయులుకాని వాళ్లకూ పాస్‌పోర్ట్‌లు జారీ అయినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇంత వరకు ఎంత మందికి అలా పాస్‌పోర్ట్‌లు జారీచేశారు? భారతీయులుకాని వాళ్లకు పాస్‌పోర్ట్‌లు ఇచ్చినప్పుడు ఏ ప్రాతిపదికన వాళ్లను అర్హులుగా నిర్ధారించారు? అని సీనియర్‌ పాత్రికేయుడు వీర్‌ సంఘ్వీ ప్రశ్నించారు.

4. పాస్‌పోర్ట్‌ మాది అని ప్రభుత్వం ఎందుకంటోంది? 
ఆధార్, పాన్‌కార్డ్‌ జారీ చేసినప్పుడు ఇవి మీవే అని ప్రభుత్వం చెబుతోంది. కేవలం పాస్‌పోర్ట్‌ మాత్రం మాది అని కేంద్రప్రభుత్వం చెప్పడంలో ఆంతర్యమేంటి? ఒకరి పేరిట జారీఅయిన పాస్‌పోర్ట్‌ ప్రత్యేక పరిస్థితుల్లో రద్దు అయినా, నిషేధానికి గురైనా, ఉపసంహరించుకున్నా అది పూర్తిగా ప్రభుత్వానికే చెందుతుంది అని నిబంధనల్లో రాశారు. పాస్‌పోర్ట్‌ అనేది కేవలం ప్రయాణపత్రం అయినప్పుడు దానికి ప్రభుత్వం ఎందుకంత ప్రాధాన్యత ఇస్తోంది? ఓవైపు భారత్‌కు ఈ పాస్‌పోర్ట్‌ అంతర్జాతీయంగా ప్రాతినిథ్యం వహిస్తుందంటూ మరోవైపు దీనిని కేవలం ప్రయాణ డాక్యుమెంట్‌గా పేర్కొనడం ఎందుకు?

5. మరి పౌరసత్వ రుజువేంటి? 
పౌరసత్వాన్ని ఆధార్‌తో రుజువుచేసుకోలేమని సుప్రీంకోర్టు చెబుతోంది. పాస్‌పోర్ట్‌ అందుకు అర్హమైంది కాదు అని ప్రభుత్వం అంటోంది. మరి ఏ పత్రంతో పౌరసత్వాన్ని నిరూపించుకోవాలి?

పౌరసత్వ చట్టం 1955ఏం చెబుతోంది? 
1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత పౌరసత్వ పరిధిని మరింత విస్తృతం చేస్తూ 1955లో ఒక చట్టం చేశారు. ఇది పౌరసత్వ చట్టం 1955గా అమల్లోకి వచ్చింది. భారత పౌరసత్వాన్ని పొందడానికి, రద్దు చేయడానికి షరతులను ఈ చట్టంలో ప్రస్తావించారు. ఐదు విధానాల ద్వారా భారత పౌరసత్వం ప్రసాదించడంపై చట్టంలో స్పష్టమైన వివరణ ఉంది. ‘‘పుట్టుకతో పౌరసత్వం పొందొచ్చు. వంశపారంపర్యంగా వస్తుంది. రిజిస్ట్రేషన్‌ ద్వారా సాధ్యమే. దీర్ఘకాలం ఇక్కడే ఉంటే దరఖాస్తు చేసుకుని తద్వారా (నేచురలైజేషన్‌) పొందవచ్చు. ఏదైనా భూభాగం కొత్తగా భారత్‌లో విలీనమైతే ఆ భూభాగంలోని వ్యక్తులకూ భారతపౌరసత్వం వస్తుంది’’అని చట్టం చెబుతోంది. 

భారత పౌరసత్వ చట్టంలోని సెక్షన్‌ 3 పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని గుర్తిస్తుంది. దీని ప్రకారం దేశంలో పుట్టిన వ్యక్తి చట్టబద్ధంగా భారతీయ పౌరుడిగా పరిగణిస్తారు. అయితే ఆ వ్యక్తి.. 1950 జనవరి 26వ తేదీ, 1986 జూలై ఒకటి తేదీల మధ్యలో జన్మించిన వారై ఉండాలి. లేదా 1987 జూలై 1 నుంచి పౌరసత్వ సవరణ చట్టం 2003 అమల్లోకి రాకముందు పుట్టిన వారు లేదా తల్లిదండ్రుల్లో ఒకరు భారతీయులై ఉండాలి. పౌరసత్వ సవరణ చట్టం 2003 అమల్లోకి వచ్చిన రోజున లేదా ఆ తర్వాత భారత్‌లో జన్మించిన వ్యక్తులు, తల్లిదండ్రులు ఇద్దరు లేదా ఒకరు భారతీయ పౌరులైనా అయి ఉండాలి. అయితే రెండో వారు అక్రమంగా వలస వచ్చినవారై ఉండకూడదు అని పౌరసత్వ చట్టం చెబుతోంది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement