
రూ. 30 వేల కోట్ల ప్రాజెక్టుకు రక్షణ శాఖ పచ్చజెండా
డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన స్వదేశీ క్షిపణి వ్యవస్థ
పాక్, చైనా డ్రోన్ల పాలిట సింహస్వప్నం
సాక్షి, న్యూఢిల్లీ: భారత వాయు రక్షణ సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో పెంచేందుకు రక్షణ శాఖ మరో కీలక ముందడుగు వేసింది. పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో శత్రువుల కుట్రలను తిప్పికొట్టేందుకు దేశీయంగా అభివృద్ధి చేసిన ‘అనంత శస్త్ర’క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేయాలని భారత సైన్యం నిర్ణయించింది. సుమారు రూ.30 వేల కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లను సైన్యం జారీ చేసింది.
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థను గతంలో ‘క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్’(క్యూఆర్‌ఎస్‌ఏఎం)గా పిలిచేవారు. మొత్తం ఐదు నుంచి ఆరు రెజిమెంట్లకు సరిపడా ‘అనంత శస్త్ర’వ్యవస్థను సమకూర్చుకోనున్నారు. మే నెలలో ‘ఆపరేషన్ సిందూర్’పేరిట పాకిస్తాన్ డ్రోన్ల కుట్రను భగ్నం చేయడంలో ఈ క్షిపణి వ్యవస్థ కీలక పాత్ర పోషించింది.
‘అనంత శస్త్ర’అత్యంత అధునాతన, హై–మొబైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దీని ప్రత్యేకతలు ఇవే..
→ కదులుతూనే శత్రు లక్ష్యాలను గుర్తించి, ట్రాక్ చేయగలదు.
→ చాలా తక్కువ సమయంలో ఆగి, వెంటనే క్షిపణులను ప్రయోగించగలదు.
→ దీని పరిధి సుమారు 30 కిలోమీటర్లు. రేయింబవళ్లూ పనిచేస్తుంది.
→ ఎంఆర్–ఎస్‌ఏఎం ఆకాశ్ వంటి వ్యవస్థలతో కలిసి పనిచేస్తూ వాయు రక్షణ కవచాన్ని మరింత పటిష్టం చేస్తుంది.
‘ఆపరేషన్ సిందూర్’ తర్వాతే ఆమోదం
‘ఆపరేషన్ సిందూర్’సమయంలో పాకిస్తాన్‌కు చెందిన అనేక డ్రోన్లను భారత సైన్యం ఎల్–70, జేయూ–23 ఎయిర్ డిఫెన్స్ గన్‌లతో కూల్చివేసింది. అదే సమయంలో
ఆకాశ్, ఎంఆర్–ఎస్‌ఏఎం వాయుసేనకు చెందిన స్పైడర్, సుదర్శన్ ఎస్–400 వ్యవస్థలు కూడా కీలక భూమిక పోషించాయి. ఈ ఆపరేషన్ విజయవంతం అయిన తర్వాతే ‘అనంత శస్త్ర’కొనుగోలుకు రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) పచ్చజెండా ఊపింది.
ఈ కొత్త వ్యవస్థతో పాటు సైన్యానికి అత్యాధునిక రాడార్లు, షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, జామర్లు, లేజర్ ఆధారిత ఆయుధాలు కూడా అందనున్నాయి. ముఖ్యంగా పాక్ సైన్యం వాడే తుర్కియే, చైనా డ్రోన్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇవి దోహదపడతాయి. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నేతృత్వంలో రక్షణ రంగంలో స్వదేశీకరణ శరవేగంగా ముందుకు సాగుతోంది. భవిష్యత్తులో ‘జోరావర్’తేలికపాటి ట్యాంకులు, మరిన్ని స్వదేశీ వాయు రక్షణ వ్యవస్థలు సైన్యంలో చేరనున్నాయి.