
ఉగ్రవాదులకు మద్దతిస్తున్నందుకు మళ్లీ గ్రే లిస్టులో చేర్చాల్సిందే
ఎఫ్‌ఏటీఎఫ్‌పై ఒత్తిడి పెంచాలని భారత్ కీలక నిర్ణయం
పాక్‌కు 20 బిలియన్ డాలర్ల రుణం ఇవ్వొద్దని ప్రపంచ బ్యాంక్‌కు విజ్ఞప్తి
న్యూఢిల్లీ: ఉగ్రవాద ఉత్పత్తి కర్మాగారంగా మారిపోయిన పాకిస్తాన్ మెడలు వంచాలంటే ఆ దేశానికి అప్పు పుట్టకుండా చేయాలని, ఆర్థికంగా అన్ని వైపులా దిగ్బంధించాలని భారత ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ భారత్‌పైకి ఉసిగొల్పుతున్న దాయాది దేశం ఆర్థికంగా మరింత చితికిపోయేలా చేయడానికి వ్యూహాలు రచిస్తోంది.
పాకిస్తాన్‌ను మళ్లీ గ్రే లిస్టులో చేర్చాలని, కొత్తగా ఎలాంటి రుణాలు ఇవ్వకూడదని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) తోపాటు ప్రపంచ బ్యాంక్‌పై ఒత్తిడి పెంచబోతున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
మనీ లాండరింగ్ నిరోధక చర్యలు చేపట్టడంలో విఫలం కావడంతోపాటు ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు అందజేస్తున్న పాకిస్తాన్‌పై కఠినంగా వ్యవహరించాలని కోరనున్నట్లు తెలిపాయి. పాక్‌ను ఎఫ్‌ఏటీఎఫ్ గ్రే లిస్టులో చేరిస్తే ప్రపంచ దేశాలతోపాటు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు లభించే అవకాశం ఉండదు. 2018 జూన్‌లో పాక్‌ను ఈ జాబితాలో చేర్చారు. అమెరికా ప్రభుత్వ ఒత్తిడితో 2022 సెప్టెంబర్‌లో తొలగించారు.
ఇటీవల అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) పాకిస్తాన్‌కు ఒక బిలియన్ డాలర్ల బెయిల్ ఔట్ ప్యాకేజీ ఇచ్చిన సంగతి తెలిసిందే. భారత్ గట్టిగా వ్యతిరేకించినా సరే లెక్కచేయకుండా ఈ ప్యాకేజీ అందజేసింది. దీనివెనుక అమెరికాతోపాటు కొన్ని అరబ్ దేశాల ఒత్తిడి పని చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో భారత్ తన అసంతృప్తిని ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్‌కు తెలియజేసింది.
అంతేకాకుండా ఈ అంశాన్ని జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ ఆర్థిక శాఖ మంత్రుల దృష్టికి తీసుకెళ్లింది. పాకిస్తాన్ ఆర్థికంగా ఎప్పుడో దివాలా తీసింది. విదేశీ రుణాలు, బెయిల్‌ఔట్ ప్యాకేజీలతోనే బతుకు బండి లాగిస్తోంది. పాకిస్తాన్‌కు వచ్చే నెలలో 20 బిలియన్ డాలర్ల రుణం మంజూరు చేసేందుకు ప్రపంచ బ్యాంకు ఇప్పటికే అంగీకరించినట్లు సమాచారం. ఈ రుణాన్ని నిలిపివేసేలా ప్రపంచ బ్యాంక్‌ను విజ్ఞప్తి చేయాలని భారత్ నిర్ణయించింది.