భారత్‌కు జావెలిన్‌ క్షిపణి వ్యవస్థ  | India Purchases Javelin Missile System From US In 93 Million Dollers Defense Deal | Sakshi
Sakshi News home page

భారత్‌కు జావెలిన్‌ క్షిపణి వ్యవస్థ 

Nov 21 2025 4:37 AM | Updated on Nov 21 2025 4:37 AM

India Purchases Javelin Missile System From US In 93 Million Dollers Defense Deal

అమెరికాతో రూ.826 కోట్ల విలువైన రక్షణ ఒప్పందం ఖరారు 

జావెలిన్‌ రాకతో భూతల రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం 

న్యూయార్క్‌/వాషింగ్టన్‌: భారత భూతల రక్షణ వ్యవస్థను మరింత పటిష్టంచేసే రక్షణ ఒప్పందం కార్యరూపం దాల్చింది. భారత్‌కు రూ.826 కోట్ల విలువైన ఆయుధాలను విక్రయించేందుకు అమెరికా గురువారం అంగీకారం తెలిపింది. ఇటీవల యుద్ధంలో రష్యా యుద్ధ ట్యాంక్‌లను తుత్తునియలు చేసిన జావెలిన్‌ క్షిపణి వ్యవస్థలను సైతం ఒప్పందంలోభాగంగా భారత్‌కు అమెరికా విక్రయించనుంది. 

రష్యా నుంచి ముడిచమురును కొంటున్నందుకు ఆగ్రహించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌పై 50 శాతం దిగుమతి టారిఫ్‌లను పెంచాక ఆ దేశంతో మోదీ సర్కార్‌ కుదుర్చుకున్న తొలి రక్షణరంగ ఉత్పత్తుల కొనుగోలు ఒప్పందం ఇదేకావడం విశేషం. దిగుమతి సుంకాల సుత్తితో మోదాక మోదీ సర్కార్‌ గుర్రుగా ఉండటంతో వేడెక్కిన ఇరుదేశాల సంబంధాలను శాంతపరిచేందుకే అమెరికా ఈ ఒప్పందాలు చేసుకుందని తెలుస్తోంది. 

తాజా ఒప్పందంపై అమెరికా స్పందించింది. ప్రధానమైన రక్షణరంగ భాగస్వామి దేశంలో భద్రతను పెంచేందుకే ఈ కొనుగోలు ఒప్పందం ఎంతో దోహదపడుతుంది. ఇండో–పసిఫిక్, దక్షిణాసియా ప్రాంతాల్లో రాజకీయ సుస్థిరత, శాంతికి ఈ ఆయుధ కొనుగోలు ఒప్పందం తన వంతు సాయంచేస్తుంది’’ అని అమెరికా పేర్కొంది.

 రూ. 418 కోట్ల విలువైన ఎం982ఏ1 రకం 216 ఎక్సాక్యాలిబర్‌ ప్రొజెక్టయిల్స్, సంబంధిత ఉపకరణాలతోపాటు రూ. 408 కోట్ల విలువైన ఎఫ్‌జీఎం–148 రకం 25 జావెలిన్‌ క్షిపణి వ్యవస్థలు, వాటికి అనుబంధంగా కమాండ్‌ లాంచ్‌ యూనిట్లు, 100 వరకు మందుగుండును భారత్‌కు విక్రయించేందుకు తమ విదేశాంగ శాఖ అనుమతి ఇచ్చిందని అమెరికా డిఫెన్స్‌ సెక్యూరిటీ సహకార ఏజెన్సీ బుధవారం ప్రకటించింది. ప్రభుత్వం తరఫున సాంకేతిక సహకారం, సమాచారం, రిపేర్లు, సేవలను సైతం ఈ ఒప్పందంలో భాగంగా అందివ్వనున్నారు.  

ఏమిటీ జావెలిన్‌ క్షిపణి లాంచర్‌? 
జావెలిన్‌ ఎఫ్‌జీఎం–148 యాంటీ ట్యాంక్‌ క్షిపణి వ్యవస్థను అమెరికా దాదాపు మూడు దశాబ్దాలుగా వినియోగిస్తోంది. సైనికుడు భుజంపై పెట్టుకుని మాటువేసి ప్రయోగించే ఈ జావెలిన్‌ మిస్సైల్‌తో శత్రుదేశాల యుద్ధట్యాంక్‌లను అవలీలగా పేల్చేయవచ్చు. జావెలిన్‌ క్షిపణిని ప్రయోగించిన సైనికుడి జాడను కనిపెట్టడం చాలా కష్టం. దీంతో శత్రుయుద్ధట్యాంక్‌లను వేగంగా తుదముట్టించవచ్చు. జావెలిన్‌ లాంచర్‌ను సైనికుడు సులభంగా ఎక్కడికైనా మోసుకెళ్లవచ్చు. భూతల సమరంలో పైచేయి సాధించేందుకు భారతీయ సైన్యానికి ఇవి ఎంతగానో ఉపయుక్తంకానున్నాయి. 

4 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం అత్యంత కచి్చతత్వంతో పేల్చవచ్చు. దీనిలోని బాంబు బరువు 8 కేజీల పైమాటే. పొడవుగా రెండు కొనల్లో మందుగుండుతో దీనిని డిజైన్‌చేశారు. శత్రు యుద్ధ ట్యాంక్‌ను తాకగానే ఒకసారి పేలిపోయి దాని పైపొర, కవచాన్ని ఛిద్రం చేస్తోంది. వెనువెంటనే మరోసారి పేలి మొత్తం యుద్ధట్యాంక్‌నే ఛిన్నాభిన్నం చేస్తుంది. రష్యాకు చెందిన వందలాది ట్యాంక్‌లను ఉక్రెయిన్‌ సైనికులు ఈ జావెలిన్‌తోనే నాశనంచేశారు. జావెలిన్‌ భయానికి రష్యా ట్యాంక్‌లతో దాడులను తగ్గించుకుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement