కేంద్ర ప్రభుత్వం వివరణ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లోనే వంటగ్యాస్(ఎల్పీజీ) ధరలు ∙తక్కువగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి అభివృద్ధి చెందిన దేశాలతోపాటు పొరుగు దేశాల కంటే మన దగ్గరే గ్యాస్ సిలిండర్ ధర చాలా చౌకగా ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో గ్యాస్ ధరలు ఫిబ్రవరి నుండి జూన్ నాటికి సుమారు 46 శాతం పెరిగాయి. దీంతో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ సరఫరా వ్యయం రూ.1,600 దాటింది. అయినప్పటికీ అంతర్జాతీయ ధరల భారాన్ని సామాన్య వినియోగదారులపై మోపకుండా తామే భరిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ కోసం సాధారణ వినియోగదారుడు రూ.942 చెల్లిస్తుండగా, ప్రభుత్వం ప్రతి సిలిండర్‌పై దాదాపు రూ.700 నష్టాన్ని భరిస్తున్నట్లు పేర్కొంది.
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నష్టాలు గతేడాది రూ.60,000 కోట్లకు చేరగా, రూ.30,000 కోట్ల పరిహారం చెల్లించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదించినట్లు వెల్లడించింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన(పీఎంయూవై) కింద దేశంలో 10.58 కోట్లకు పైగా వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఉజ్వల లబ్ధిదారులకు ఏడాదికి మొదటి నాలుగు సిలిండర్లపై ఒక్కో సిలిండర్‌కు రూ.300 చొప్పున (ఏడాదికి రూ.1,200) చెల్లిస్తోంది. దీనివల్ల ఉజ్వల వినియోగదారులకు సిలిండర్ కేవలం రూ.642కే లభిస్తోంది. ఇది అంతర్జాతీయ మార్కెట్ ధర కంటే దాదాపు 60 శాతం తక్కువ అని కేంద్రం పేర్కొంది. దేశీయంగా గ్యాస్ ఉత్పత్తిని 32 టీఎంటీల నుండి 52 టీఎంటీలకు 60 శాతం పైగా) పెంచింది. అల్జీరియా వంటి ప్రత్యామ్నాయ దేశాల నుండి ఎల్పీజీని దిగుమతి చేసుకుని దేశంలో ఎక్కడా వంటగ్యాస్ కొరత రాకుండా చర్యలు తీసుకున్నట్లు కేంద్రం గుర్తుచేసింది.


