
విలువ రూ.1,50,5900 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో 18% వృద్ధి నమోదు
ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం దిశగా మరో ముందడుగు
వివరాలు వెల్లడించిన కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ
సాక్షి, న్యూఢిల్లీ: భారత రక్షణ తయారీ రంగం చరిత్ర సృష్టించింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో దేశీయ రక్షణ ఉత్పత్తి విలువ అక్షరాలా రూ.1,50,590 కోట్లకు చేరింది. ఇది 2023–24లో నమోదైన రూ.1.27 లక్షల కోట్లతో పోలిస్తే 18 శాతం అధికం. 2019–20లో ఉన్న రూ.79,071 కోట్లతో పోలిస్తే ఇది 90 శాతం పెరుగుదల. ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. రక్షణ ఉత్పత్తి విభాగం, డీపీఎస్‌యూలు, పబ్లిక్ సెక్టర్ తయారీ సంస్థలు, ప్రైవేట్ పరిశ్రమల కృషి ఫలితమే ఈ విజయమని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రశంసించారు. దేశ రక్షణ పారిశ్రామిక వేదిక బలపడుతున్నదనడానికి ఇది ఒక స్పష్టమైన సూచిక అని కేంద్రమంత్రి అభిప్రాయపడ్డారు.
పబ్లిక్–ప్రైవేట్ రంగాల వాటా
దేశీయ రక్షణ మొత్తం ఉత్పత్తిలో ప్రభుత్వ రంగ సంస్థల వాటా 77% ఉండగా, ప్రైవేట్ రంగం వాటా 23%గా ఉంది. ఇది గత ఏడాది 21% నుంచి పెరుగుదల నమోదైంది. కాగా పబ్లిక్ సెక్టర్ ఉత్పత్తి 16%, ప్రైవేట్ రంగ ఉత్పత్తి 28% పెరిగింది. దీర్ఘకాలిక విధాన సంస్కరణలు, వ్యాపార సౌలభ్యం, స్వదేశీ ఉత్పత్తి (ఇండిజినైజేషన్)పై దృషిŠట్ సారించడం దేశీయ రక్షణ ఉతత్తి పెరగడానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. మరోవైపు 2024–25లో రక్షణ ఎగుమతులు రూ.23,622 కోట్లకు చేరాయి. ఇది 2023–24లో నమోదైన రూ.21,083 కోట్లతో పోలిస్తే రూ.2,539 కోట్లు (12.04%) ఎక్కువ. ప్రభుత్వ ప్రోత్సాహం, ప్రైవేట్ రంగం పెరుగుతున్న భాగస్వామ్యం, ఎగుమతి అవకాశాల విస్తరణతో రాబోయే ఏళ్లలో రక్షణ తయారీ రంగం మరింత వేగంగా ముందుకు సాగే అవకాశముందని కేంద్ర రక్షణ శాఖ అంచనా వేస్తోంది.