గత 146 ఏళ్లలో భారత్‌లో అత్యంత దయనీయ స్థితి! | India Currently Experiencing Driest June-146 years-Rainfall-Below 42 Percent | Sakshi
Sakshi News home page

గత 146 ఏళ్లలో భారత్‌లో అత్యంత దయనీయ స్థితి!

Jun 30 2026 4:21 AM | Updated on Jun 30 2026 4:31 AM

India Currently Experiencing Driest June-146 years-Rainfall-Below 42 Percent

భారతదేశ వ్యాప్తంగా జూన్‌ నెలలో వర్షపాతం సాధారణం కంటే 42 శాతం తక్కువగా నమోదైంది. గత 146 ఏళ్లలో అత్యంత పొడి వాతావరణాన్ని జూన్‌ నెల ఎదుర్కోవడం గమనార్హం. గత దశాబ్దన్నర కాలంలో వేసవి రుతు పవనాలకు ఇది అత్యంత బలహీనమైన ఆరంభం. దీని ఫలితంగా దేశంలోని 76 శాతం ప్రాంతాల్లో వర్షపాతం ‘లోటు’, లేదా ‘తీవ్ర లోటు’గా ఉంది. జూలై కూడా సాధారణం కంటే పొడిగా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

సాగునీరు, తాగునీటి కోసం పర్యవేక్షించే దేశంలోని 166 ప్రధాన జలాశయాలు జూన్‌ 25 నాటికి మొత్తం నిల్వ సామర్థ్యంలో 26 శాతాన్ని కలిగి ఉన్నాయి. నీటి మట్టాలు ఇందిరా సాగర్‌లో 14 శాతానికి, నాగార్జున సాగర్‌లో 5 శాతానికి, తెహ్రీలో 2 శాతానికి పడిపోయాయి. పసిఫిక్‌లో పెరుగుతున్న సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల(ఎల్‌నినో అనే పరిస్థితి) కారణంగా ఆ నెలలో రుతుపవన వర్షపాతం మళ్లీ పుంజుకున్నప్పటికీ జూలై నెలలో చాలావరకు వర్షపాతం సాధారణం కంటే తక్కువగానే ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

ఉత్తర ఆఫ్రికా నుండి వేడి గాలిని రప్పించే స్థిరమైన అధిక పీడన వ్యవస్థ కారణంగా ఏర్పడిన వడగాడ్పులు మానవ ప్రేరిత వాతావరణ మార్పుల వల్ల మరింత తీవ్రమయ్యాయని వరల్డ్‌ వెదర్‌ అట్రిబ్యూషన్‌ అనే బహుళ దేశాల పరిశోధక బృందం శుక్రవారం తెలిపింది. ఐరోపా వేసవి వాతావరణంపై ఎల్‌ నినో ప్రభావం పరిమితంగానే ఉన్నప్పటికీ ఈ ఏడాది భారత రుతుపవనాలపై ఇది ప్రధాన ప్రభావం చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement