టెహ్రాన్/న్యూఢిల్లీ: ఇరాన్‌లో పరిస్థితులు రోజురోజుకీ దిగజారుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం టెహ్రాన్‌లోని భారతీయులకు అలర్ట్ జారీ చేసింది. ‘‘ఇరాన్‌లో పరిస్థితులు మరింతగా దిగజారుతున్నాయి. భారతీయులు వెంటనే ఇరాన్‌ను వీడాలి. సురక్షిత దేశాలకు వెళ్లాలి. ఇరాన్‌లోని భారతీయ విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారులు వీలైనంత తర్వగా ఆ దేశం నుంచి బయట పడాలి’’ అని భారత విదేశాంగ శాఖ బుధవారం ఓ ప్రకటనను విడుదల చేసింది.
ఈ నెల 5న జారీ చేసిన అలర్ట్ తో పోలిస్తే.. పరిస్థితులు మరింతగా దిగజారుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది. నిరసనలు జరుగుతున్న ప్రదేశాలు, రద్దీ ప్రాంతాలకు వీలైనంత దూరంగా ఉండాలని సూచించింది. నిత్యం టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులతో టచ్‌లో ఉండాలని ఆదేశించింది. స్థానిక మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ తెలుసుకోవాలని పేర్కొంది.
మరోవైపు టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చితో బుధవారం సాయంత్రం ఫోన్‌లో చర్చలు జరిపింది. కాగా.. ఇరాన్ అల్లర్లలో మరణాల సంఖ్య 12 వేలకు పెరిగినట్లు ‘ద గార్డియన్’ పత్రిక వెల్లడించింది. నిరసనకారులతోపాటు.. భద్రతాబలగాలు కూడా మృతిచెందినట్లు వివరించింది. బుధవారం సాయంత్రం 300 మృతదేహాలను టెహ్రాన్ వర్సిటీ ప్రాంగణంలో సామూహికంగా ఖననం చేస్తున్న దృశ్యాలను ప్రచురించింది. అయితే.. అమెరికాకు చెందిన మానవ హక్కుల సంస్థ మాత్రం ఇప్పటి వరకు 2,550 మరణాలు నమోదైనట్లు తెలిపింది. వీరిలో 2,403 మంది నిరసనకారులు కాగా.. మిగతా 147 మంది ఐఆర్‌జీసీ, పోలీసు బలగాలకు చెందినవారని వివరించింది.



