
పహల్గాం దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టిన భారత సైన్యం పాకిస్థాన్‌కు గట్టి దెబ్బే కొట్టింది. మెరుపుదాడులతో శత్రు సేనల స్థావరాలు తీవ్రంగా ధ్వంసం కాగా, ఉగ్రవాదులు నామరూపాల్లేకుండా పోయారు. అయితే.. ఆపరేషన్‌పై తాజాగా ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ తాజాగా కీలక విషయాలను వెల్లడించారు.
బెంగళూరులో శనివారం జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ మాట్లాడుతూ... పక్కా ప్రణాళికతో ఆపరేషన్ సిందూర్‌ను నిర్వహించాం. అది చాలా హై-టెక్ యుద్ధం. కేవలం 80-90 గంటల్లోనే మా లక్ష్యాల్లో చాలావరకు సాధించాం. యుద్ధం ఇలాగే కొనసాగితే.. భారీ మూల్యం తప్పదని వారికి (పాక్) అర్థమైంది. అందుకే కాళ్ల బేరానికి వచ్చారు. చర్చలు జరుపుదామని పాక్ నుంచి సందేశం వచ్చింది. అప్పుడు మేం దానికి అంగీకరించాం అని ఏపీ సింగ్ తెలిపారు.
సిందూర్ సమయంలో పాక్‌కు చెందిన ఐదు ఫైటర్ జెట్‌లను, ఓ భారీ ఎయిక్రాఫ్ట్ మన సైన్యం కూల్చేసింది. మన సైన్యం దాడి చేసిన పాక్ ప్రధాన ఎయిర్‌ఫీల్డ్‌లలో షహబాజ్ జకోబాబాద్ స్థావరం ఒకటి. అక్కడ ఎఫ్-16 హ్యాంగర్ ఉంది. మన సైన్యం దాడితో అది సగానికి పైగా దెబ్బతింది. అక్కడ కొన్ని యుద్ధ విమానాలు ఉన్నాయని, అవి తీవ్రంగా దెబ్బతిన్నాయని మేం అంచనాకు వచ్చాం. ఆపరేషన్ సమయంలో మన గగనతల రక్షణ వ్యవస్థ, ఎస్-400 క్షిపణి వ్యవస్థ సమర్థంగా పనిచేశాయి’’ అని వివరించారాయన.
పుల్వామా దాడికి ప్రతీకారంగా 2019లో భారత్ బాలాకోట్ వైమానిక దాడులు జరిపింది. ఆ సమయంలో ఉగ్రల్ని మట్టు పెట్టగలిగాం. అయితే అప్పుడు శత్రు దేశానికి జరిగిన నష్టం గురించి ప్రజలకు వివరించలేకపోయాం. అది భారత వైమానిక దళాన్ని ఓ ఆత్మలా వెంటాడింది. అయితే ఆపరేషన్ సిందూర్‌తో స్పష్టమైన సమాచారం ప్రజలకు చేరవేయగలిగాం. తద్వారా లోపాలను సవరించుకోగలిగాం. అలా బాలాకోట్ ఆత్మ శాంతించింది అని అన్నారాయన. ఇదిలా ఉంటే.. ఆపరేషన్ సిందూర్‌లో పాక్ వాయుసేన సామర్థ్యానికి జరిగిన నష్టంపై భారత్ ప్రకటన చేయడం ఇదే తొలిసారి.
బాలాకోట్ వైమానిక దాడులు.. ముఖ్యాంశాలు
2019 ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 46 మంది CRPF సిబ్బంది మరణించారు. దీనికి ప్రతీకారంగా.. అదే నెల 26వ తేదీన వేకువ జామున 3.30గం. ప్రాంతంలో భారత వైమానిక దళం (Indian Air Force) పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో బాలాకోట్ ప్రాంతంలో ఉగ్రవాద శిబిరాలపై దాడులు జరిపింది.
భారత్ జరిపిన దాడి వివరాలు:
- భారత వైమానిక దళం 12 మిరాజ్ 2000 జెట్‌లతో దాడి చేసింది
- ఇజ్రాయెల్ తయారు చేసిన స్పైస్ 2000 బాంబులు ఉపయోగించారు
భారత వాదన:
- జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి అనేకమంది ఉగ్రవాదులను హతమార్చారు
- ఆ సంఖ్య 300 దాకా ఉంది
పాకిస్తాన్ వాదన
- బాంబులు జనావాసాలు లేని ప్రాంతాల్లో పడ్డాయి.
- ఎలాంటి నష్టం జరగలేదు
- ప్రతిదాడిలో అభినందన్ వర్థమాన్ అనే భారత పైలట్‌ను బందీగా పట్టుకుని, మార్చి 1న విడుదల చేశారు
బాలాకోట్ స్ట్రయిక్స్.. 1971 తర్వాత భారత-పాకిస్తాన్ మధ్య జరిగిన మొదటి వైమానిక దాడులు. నియంత్రణ రేఖను దాటి ఇరు దేశాల విమానాలు దాడులు చేయడం ఇదే మొదటిసారి. అణు శక్తులుగా ఉన్న ఈ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి, అయితే అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి వల్ల యుద్ధం జరగలేదు.