సాగుకు ఊతం.. రైతుకు భరోసా  | India Agriculture GVA Doubles to Rs 48. 7 Lakh Crore in a Decade | Sakshi
Sakshi News home page

సాగుకు ఊతం.. రైతుకు భరోసా 

Jun 6 2026 5:10 AM | Updated on Jun 6 2026 5:10 AM

India Agriculture GVA Doubles to Rs 48. 7 Lakh Crore in a Decade

పన్నెండేళ్లలో వ్యవసాయంలో సమూల మార్పులు 

35.77 కోట్ల టన్నులకు చేరిన ఆహారధాన్యాల దిగుబడి 

ఐదింతలు పెరిగిన వ్యవసాయ శాఖ బడ్జెట్‌ 

పీఎం కిసాన్, ఫసల్‌ బీమాతో అన్నదాతకు వెన్నుదన్ను 

భారీ మద్దతు ధరలు.. రికార్డు స్థాయిలో పంటల సేకరణ 

ప్రత్యేక నివేదికలో వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం  

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో గడచిన పుష్కర కాలంలో దేశ వ్యవసాయ రంగం రూపురేఖలు మారిపోయాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేవలం రాయితీలు, సంక్షేమ పథకాలకే పరిమితం కాకుండా.. సాగును లాభసాటిగా మార్చే దిశగా కేంద్ర విధానాలు అమలయ్యాయని పేర్కొంది. బడ్జెట్‌ కేటాయింపుల పెంపు నుంచి మొదలుపెట్టి కనీస మద్దతు ధరల (ఎంఎస్‌పీ) సవరణ, మౌలిక వసతుల కల్పన, డిజిటల్‌ టెక్నాలజీ జోడింపు వరకు ప్రతి అడుగూ ఉత్పాదకతను పెంచేలా పడ్డాయని.... ఫలితంగా ఆహారధాన్యాల ఉత్పత్తిలో దేశం రికార్డులు సృష్టిస్తోందని కేంద్రం తెలిపింది. 2014 నుంచి 2026 వరకు వ్యవసాయం, అనుబంధ రంగాల్లో వచ్చిన మార్పులు, సాధించిన ప్రగతిపై కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సమగ్ర నివేదిక విడుదల చేసింది. 

రెట్టింపైన వ్యవసాయ ఆదాయం  
గత పన్నెండేళ్లలో సాగు రంగానికి నిరంతర విధానపరమైన మద్దతు లభించింది. దీంతో మొత్తం స్థూల విలువ ఆధారిత (జీవీఏ)లో ఈ రంగం వాటా 18 శాతానికి చేరింది. 2014–15లో రూ.20.9 లక్షల కోట్లుగా ఉన్న వ్యవసాయ జీవీఏ.. 2023–24 నాటికి ఏకంగా రూ.48.7 లక్షల కోట్లకు పెరిగింది. పంటల విభాగం జీవీఏ సైతం రూ.12.92 లక్షల కోట్ల నుంచి రూ.26.52 లక్షల కోట్లకు చేరింది. 2013–14లో కేవలం రూ.27,663 కోట్లుగా ఉన్న వ్యవసాయ శాఖ బడ్జెట్‌ 2026–27 నాటికి రూ.1.40 లక్షల కోట్లకు చేరడం ఈ రంగం ప్రాధాన్యతను స్పష్టం చేస్తోంది. 

సిరులు పండిస్తున్న నేల
ఆహారధాన్యాల ఉత్పత్తిలో దేశం సరికొత్త రికార్డులు నమోదు చేసింది. 2013–14లో 26.50 కోట్ల టన్నుల ఆహారధాన్యాలు ఉత్పత్తి కాగా, 2024–25 నాటికి ఈ రికార్డు 35.77 కోట్ల టన్నులకు చేరింది. వరి ఉత్పత్తి 42 శాతం పెరిగి 15.01 కోట్ల టన్నులకు చేరుకోగా, ప్రపంచంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా భారత్‌ నిలిచింది. గోధుమలు 11.79 కోట్ల టన్నులు, మొక్కజొన్న 4.34 కోట్ల టన్నులు, నూనెగింజలు 4.29 కోట్ల టన్నుల మేర ఉత్పత్తి సాధించాయి. ఉద్యానవన రంగం సైతం 36.90 కోట్ల టన్నుల ఉత్పత్తితో వ్యవసాయ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. 

గిట్టుబాటుకు గ్యారెంటీ
పంటల ఉత్పత్తి వ్యయంపై కనీసం 50 శాతం అదనంగా ఉండేలా ఎంఎస్‌పీని నిర్ణయిస్తూ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2014–2026 మధ్య కాలంలో వ్యవసాయ ఉత్పత్తుల ప్రభుత్వ సేకరణ 76 శాతం పెరిగి 122.92 కోట్ల టన్నులకు చేరింది. ఈ పుష్కర కాలంలో రైతులకు దక్కిన ఎంఎస్‌పీ విలువ రూ.26.32 లక్షల కోట్లు. 2014–15తో పోలిస్తే 2026–27 సీజన్‌కు రాగుల మద్దతు ధర అత్యధికంగా 236 శాతం పెరిగింది. వరి (సాధారణ రకం) మద్దతు ధర రూ.1,360 నుంచి రూ.2,441కి చేరింది. పత్తి రూ.3,750 నుంచి రూ.8,267కి చేరగా.. పప్పుదినుసులు, నూనె గింజల ధరల్లోనూ భారీ పెరుగుదల నమోదైంది.

పెరిగిన రుణ లభ్యత 
రైతులకు సకాలంలో రుణాలు అందించేందుకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల (కేసీసీ) ఖాతాలను 7.81 కోట్లకు పెంచారు. వ్యవసాయ రంగానికి సంస్థాగత రుణాలు 2013–14లో రూ.7.30 లక్షల కోట్లు ఉండగా, 2024–25 నాటికి ఈ మొత్తం రూ.28.67 లక్షల కోట్లకు చేరింది. ఫార్మ్‌ గేట్‌ వద్ద మౌలిక వసతుల కల్పనకు ఏఐఎఫ్‌ (వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి) కింద రూ.84,202 కోట్ల రుణాలను మంజూరు చేశారు. ఈ–నామ్‌ వేదికగా 1,656 మార్కెట్లను అనుసంధానించారు. మట్టి నాణ్యతను ధ్రువీకరించేందుకు ఇప్పటివరకు 26 కోట్ల సాయిల్‌ హెల్త్‌ కార్డులను జారీ చేశారు. పీఎం కుసుమ్‌ ద్వారా 21.77 లక్షల మంది రైతులకు సౌర పంపుసెట్లను అందించారు.

లాభసాటిగా అనుబంధ రంగాలు  
సాంకేతికత జోడింపుతో వ్యవసాయం ఆధునికతను సంతరించుకుంటోంది. డిజిటల్‌ అగ్రికల్చర్‌ మిషన్‌ కింద 7.63 కోట్ల మంది రైతులకు ప్రత్యేక ఐడీలు సృష్టించారు. 23.5 కోట్ల పంట భూములను డిజిటైజ్‌ చేశారు. నమో డ్రోన్‌ దీదీ కింద వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు. వ్యవసాయంతో పాటు పాడి, మత్స్య రంగాలు రైతులకు అదనపు ఆదాయ వనరుగా మారాయి. పాల ఉత్పత్తి 2024–25 నాటికి 247.87 మిలియన్‌ టన్నులకు చేరింది. మత్స్య సంపద ఉత్పత్తి 19.78 మిలియన్‌ టన్నులకు చేరుకుంది. వ్యవసాయ, ప్రొసెస్డ్‌ ఉత్పత్తుల ఎగుమతులు భారీగా పెరిగి 51.1 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు కేంద్ర ప్రభుత్వ నివేదిక పేర్కొంది.  

పెట్టుబడికి సాయం.. పంటకు రక్షణ.. 
రైతులకు పెట్టుబడి సాయం కింద పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం ద్వారా ఏటా రూ.6,000 చొప్పున అందిస్తున్నారు. ఇప్పటివరకు 22 విడతల్లో 9.44 కోట్ల కుటుంబాలకు రూ.4.28 లక్షల కోట్లను నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి రైతులను ఆదుకునేందుకు పీఎం ఫసల్‌ బీమా యోజన అండగా నిలుస్తోంది. ఏటా 4 కోట్ల మంది రైతులు పంటల బీమా చేయించుకుంటున్నారు. 2016 నుంచి డిసెంబర్‌ 2025 వరకు 24.31 కోట్ల మంది రైతులకు రూ.1.96 లక్షల కోట్ల మేర పరిహారం మంజూరైంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement