రానున్న మూడు నెలలకు ఐఎండీ అంచనా
న్యూఢిల్లీ: డిసెంబర్ 2025– 2026 ఫిబ్రవరి వరకు మూడు నెలల సీజన్‌లో చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నట్లు భారత వాతావరణ విభాగం(ఐఎండీ) సోమవారం తెలిపింది. మధ్య భారత, వాయవ్య ప్రాంతాలు, దక్షిణాదిన సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. పశ్చిమ హిమాలయ ప్రాంతం, ఈశాన్య రాష్ట్రాలు, తూర్పు, పశ్చిమ భారతంలో మాత్రం సాధారణం కంటే ఎక్కువగానే ఉష్ణోగ్రతలు ఉండొచ్చని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర వెల్లడించారు.
రాజస్తాన్, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, హరియాణా, పంజాబ్‌తోపాటు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో శీతల గాలుల ప్రభావం ఈసారి నాలుగైదు రోజులపాటు అదనంగా ఉంటుందని అంచనా వేశారు. సాధారణంగా డిసెంబర్– ఫిబ్రవరి మధ్య కాలంలో ఈ ప్రాంతాల్లో ఆరు రోజులపాటు శీతల గాలులు వీస్తాయని మహాపాత్ర తెలిపారు. ఈ సీజన్‌లో దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో సాధారణం, అంతకంటే తక్కువగానే ఉష్ణోగ్రతలుంటాయని పేర్కొన్నారు. నవంబర్8–18వ తేదీల మధ్య మొదటిసారి శీతల గాలుల ప్రభావం రాజస్తాన్, హరియాణా, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించిందన్నారు. అదేవిధంగా, ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు మధ్య, వాయవ్య ప్రాంతాల్లో శీతలగాలుల ప్రభావం ఉండొచ్చని వివరించారు.


