
చెన్నై: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు స్థానిక భాషల్లోనే సైన్స్ అంశాలతో పాటు కెరీర్ గైడెన్స్‌పై అవగాహన పెంచేందుకు ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఐఐటీ మద్రాస్ ‘సైన్స్ పాపులరజైషన్’ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటికే ఈ ప్రోగ్రామ్ కింద ఏడు రాష్ట్రాల్లో 9193 గ్రామీణ ప్రభుత్వ స్కూళ్లలో 3లక్షల20వేల702 పుస్తకాలను పంపిణీ చేసింది.
2026 వరకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్, వెస్ట్‌బెంగాల్‌లోని మొత్తం 50 వేల స్కూళ్లలో ఈ ప్రోగ్రామ్ కింద విద్యార్థులకు అవగాహన కల్పించడాన్ని ఐఐటీ మద్రాస్ లక్ష్యంగా పెట్టుకుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్(ఎస్‌టీఈఎమ్)లలో కెరీర్‌ను ఎంచుకోవడం పట్ల విద్యార్థులను సన్నద్ధులను చేయడమే ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం.
ఈ ప్రోగ్రామ్ పట్ల ఆసక్తి ఉన్న స్కూళ్లు, విద్యార్థులు బయోటెక్.ఐఐటీఎమ్.ఏసీ.ఇన్ వెబ్‌సైట్లో నమోదు చేసుకోవాలని ప్రోగ్రామ్ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న ఐఐటీ మద్రాస్‌లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ప్రొఫెసర్ శ్రీనివాస్ చక్రవర్తి కోరారు. ఈయన ఇప్పటివరకు 70 సైన్స్ పుస్తకాలను ప్రభుత్వ హై స్కూళ్లలో చదివే విద్యార్థులకు అర్ధమయ్యేలా తెలుగులోకి అనువదించి ప్రచురించారు.
‘సైన్స్ పాపులరైజేషన్’ ప్రోగ్రామ్ కింద ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు క్లిష్టతరమైన సైన్స్ పరిశోధనలకు సంబంధించిన విషయాలను వారికి అర్ధమయ్యే భాషలో చేరవేస్తున్నామని చక్రవర్తి తెలిపారు. ప్రోగ్రామ్‌కు అవసరమయ్యే వనరులను సమకూర్చడంలో ఐఐటీ పూర్వ విద్యార్థులు, అకడమిక్‌గా సైన్స్ నేపథ్యం ఉన్న ఇతర వ్యక్తులు కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు.