సైన్స్ అంశాల రచయిత దినేశ్ శర్మ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) లాంటి పరిణామాలతో శాస్త్ర, సాంకేతిక ప్రపంచం శరవేగంగా మారుతోంది. ఈ మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు భారతదేశం తనదైన మార్గాన్ని నిర్దేశించుకునే పనిలో ఉంది. స్వాతంత్ర్యానంతర కాలంలో శాస్త్ర, సాంకేతిక రంగం సహా వివిధ రంగాల్లో సంస్థాగత నిర్మాణం చేపట్టడంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన భారత్ ఆ చరిత్ర, అనుభవం ఆసరాగా చేసుకొని వర్తమానానికి తగ్గట్టు నేర్చుకోవాల్సినది ఎంతో ఉంది అని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. సోమవారం ముగిసిన హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌లో భాగంగా ‘సైన్స్ అండ్ ది సిటీ’ అన్న అంశంపై జరిగిన చర్చాగోష్ఠిలో భాగంగా వక్తలు ఈ అభిప్రాయాన్ని బలంగా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో 'స్పేస్: ది ఇండియా స్టోరీ' పుస్తక రచయిత, సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దినేష్ సి శర్మ మాట్లాడుతూ, ''భారతదేశంలో శాస్త్ర విజ్ఞాన పథకాలను ఆరంభించినవారికి మొదటి నుంచి ఒక స్పష్టమైన దృష్టి, అలాగే ఎంచుకున్న మార్గం ఉన్నాయి. ఫలితంగా అణుశక్తి, అంతరిక్ష పరిశోధన సంస్థల వంటి వాటి అభివృద్ధి జరిగింది. విదేశీ మారక ద్రవ్యం కొరత పీడిస్తూ, అలాగే భారతదేశం వారసత్వంగా పొందిన ప్రభుత్వ యంత్రాంగ జాప్యం అనే భారం వేధిస్తున్నప్పటికీ ఈ సంస్థలు ఎంతో శ్రమించి, పురోగామి పథంలో సాగాయి'' అని చెప్పారు.
''భారతదేశం వద్ద కనీసం రాకెట్ కానీ, ఉపగ్రహం కానీ లేనప్పుడే విక్రమ్ సారాభాయ్ ప్రారంభించిన ప్రాజెక్ట్ ఆధారిత విధానం, అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞాన అనువర్తనాలను అభివృద్ధి చేయడంపై ఆయన చూపిన ప్రాధాన్యం... ఫలితంగా భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) విలక్షణమైన పని సంస్కృతితో వృద్ధి చెందింది'' అని దినేశ్ శర్మ వ్యాఖ్యానించారు. అంతరిక్ష పరిశోధనా కార్యక్రమాన్ని అభివృద్ధి చేయడానికి తన మనసులో ఉన్న ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు వీలుగా విక్రమ్ సారాభాయ్ పలువురు శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల బృందాలను తీర్చిదిద్దారని శర్మ వివరించారు.
ఈ చర్చాగోష్ఠిలో ‘హోమి జె. భాభా: ఎ లైఫ్’ రచయిత భక్తియార్ కె. దాదాభాయ్ మాట్లాడుతూ, హోమీ భాభా బహుముఖ ప్రజ్ఞాశాలి అని పేర్కొన్నారు. సంగీత ప్రేమికుడు, నిష్ణాతుడైన చిత్రకారుడు, శాస్త్రవేత్త, పలు శాస్త్ర విజ్ఞాన సంస్థల రూపకర్త అని తెలిపారు. ఆయన ఒక దార్శనికుడు, అదే సమయంలో కార్యసాధకుడు అని వివరించారు. శాస్త్రీయ పరిశోధనా సంస్థల ప్రస్థానంపై ఆసక్తికరంగా సాగిన ఈ చర్చాగోష్ఠిని వినేందుకు పెద్ద సంఖ్యలో జనం హాజరుకావడం విశేషం.


