ఎన్‌రోల్‌మెంట్‌లో దిగజారిపోయిన బడులు
చంద్రబాబు పాలనలో 17,99,876 మంది విద్యార్థులు చదువులకు దూరం
వైఎస్ జగన్ ప్రభుత్వంలో చివరి ఏడాది మొత్తం 87,41,885 మంది విద్యార్థులు
చంద్రబాబు హయాంలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆ సంఖ్య 69,42,009కు పడిపోయిన వైనం
2023–24లో ప్రభుత్వ పాఠశాలల్లో 41,75,600 మంది విద్యార్థులు
బాబు పాలన 2025–26లో అదే ప్రభుత్వ పాఠశాలల్లో 33,79,835కు తగ్గిన విద్యార్థులు
ఒక్క ప్రభుత్వ పాఠశాలల్లోనే 7,95,765 మంది తగ్గిపోయిన వైనం
రాష్ట్రంలో భారీగా పెరిగిన డ్రాప్ అవుట్స్.. జీఈఆర్ పతనం
ఓ కుక్కను కొట్టాలంటే పిచ్చిదని దానికి ముద్ర వేయాలి. అప్పుడు ఎవరూ ఏమీ అనరన్నది ఓ నానుడి. రాష్ట్రంలో సర్కారు బడుల విషయంలోనూ చంద్రబాబు ప్రభుత్వం సరిగ్గా ఆ సూత్రాన్నే వర్తింప చేస్తోంది. విద్యా రంగంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న గత ప్రభుత్వ సంస్కరణలను ఒక్కొక్కటిగా తొలగిస్తూ.. నిర్వీర్యం చేస్తూ.. ప్రభుత్వ స్కూళ్లంటే అయిష్టం ఏర్పడేలా చేస్తోంది. ఫలితంగా గత రెండేళ్లలోనే 17.99 లక్షల మంది విద్యార్థులు చదువులకు దూరమయ్యారు. విద్య, వైద్యం ప్రైవేట్ చేతుల్లో ఉండాలన్నదే తమ లక్ష్యం అంటూ ఆ దిశగా వడివడిగా అడుగులు ముందుకు వేస్తోంది. సర్కారు తీరుపై విద్యా రంగ నిపుణుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాఠశాలల పరిస్థితి దిగజారింది. ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలతో అడ్మిషన్లు తగ్గిపోవడంతో పాటు, బడి బయటి పిల్లలను సైతం పట్టించుకోక పోవడంతో డ్రాప్ అవుట్లు భారీగా పెరిగాయి. అదే క్రమంలో ప్రైవేటు స్కూళ్లల్లో అడ్మిషన్లు పెరగడం గమనార్హం. యూడైస్ (యునిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్) లెక్కల ప్రకారం గత ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంలో 87,41,885 మంది విద్యార్థులు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 69,42,009కి పడిపోయింది. ఈ లెక్కన ఏకంగా 17,99,876 మంది విద్యార్థులు చదువులకు దూరమయ్యారు.
ప్రభుత్వ పాఠశాలలను (ఎయిడెడ్ సహా) తీసుకుంటే జగన్ ప్రభుత్వంలో 41,75,608 విద్యార్థులు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 33,79,835కు పడిపోయింది. తద్వారా ఏకంగా 7,95,765 మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. మరోవైపు డ్రాప్ అవుట్‌ల సంఖ్య బాగా పెరిగిపోయింది. 2024 వరకు ప్రైవేటు స్కూళ్లల్లో కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే అత్యధికంగా విద్యార్థులుండగా, ఇప్పుడా పరిస్థితి తారుమారైంది. 2024–25, 2025–26 విద్యా సంవత్సరాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
‘పేదలకు ఉచిత విద్య అందించడం ప్రభుత్వ బాధ్యత కాదు.. ప్రభుత్వ బడుల్లో సదుపాయాలు ఉండవు.. వాటిని కల్పించే పరిస్థితి లేదు.. డబ్బున్న వారు ప్రైవేటు స్కూళ్లల్లో చదువుకోవచ్చు.. అక్కడ ఇంగ్లిష్ మీడియం ఉంటుంది.. అన్నీ బాగుంటాయి’ అని గత టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు బహిరంగంగా చెప్పిన మాటలను ఇప్పుడు అదే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆచరణలో పెట్టింది. 2024 జూన్‌లో రాష్ట్రంలో అధికారం చేపట్టిన ప్రభుత్వం పేద పిల్లలకు చదువులను దూరం చేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన విద్యా సంస్కరణలను ఒక్కొక్కటిగా రద్దు చేస్తూ.. ఇప్పుడు ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు ప్రైవేటుకు వెళ్లిపోయేలా చేసింది.
సర్కారు బడుల్లో తగ్గిపోయిన విద్యార్థులు
తల్లిదండ్రులకు ప్రభుత్వ బడులపై నమ్మకం పోయేలా ప్రస్తుత ప్రభుత్వం విధానాలను అనుసరించింది. అందుకు గత ప్రభుత్వంలో అమలు చేసిన విద్యా సంస్కరణలను అధికారంలోకి వచ్చిన 2024 జూన్ నుంచి ఒక్కొక్కటిగా రద్దు చేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో 1,000 సీబీఎస్‌ఈ స్కూళ్లను రద్దు చేశారు. పేద పిల్లలను ఇంగ్లిష్ భాషలో ప్రవీణులుగా తిర్చిదిద్దేందుకు ప్రవేశపెట్టిన టోఫెల్‌ను రద్దు చేశారు. ఐబీ సిలబస్‌ను ఆరంభంలోనే నిలిపివేశారు.
విద్యార్థులకు ట్యాబ్స్ ఇవ్వడాన్ని ఆపేశారు. మనబడి నాడు–నేడు పనులను ఒక్క అడుగు కూడా ముందుకు పడనీయలేదు. మధ్యాహ్న భోజనంలో నాణ్యతను పూర్తిగా గాలికి వదిలేశారు. రాష్ట్రంలో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం కింద రూ.15 వేలు చొప్పున ఇస్తామన్న హామీని సైతం అధికారం చేపట్టిన తొలి ఏడాది ఎగ్గొట్టారు. రెండో ఏడాది అరకొరగా ఇస్తూ.. ఇవ్వాల్సిన సొమ్ములో కోత పెట్టారు. దీంతో ప్రభుత్వ బడులపై నమ్మకం పోయింది.
2023–24 విద్యా సంవత్సరంలో 42 లక్షల మంది విద్యార్థులుండగా, 2024–25లో ఆ సంఖ్య 36 లక్షలకు తగ్గిపోయింది. ప్రస్తుత విద్యా సంవత్సరం(2025–26)లో ఈ సంఖ్య మరింత దిగజారి 33 లక్షలకు తగ్గిపోయింది. అదే క్రమంలో ప్రైవేటు స్కూళ్లల్లో విద్యార్థుల సంఖ్య 35.62 లక్షలకు పెరగడం గమనార్హం. అంటే ప్రభుత్వ స్కూళ్లల్లో కంటే ప్రైవేటులో దాదాపు 2.62 లక్షల మంది విద్యార్థులు అధికంగా చేరారు.

పెరిగిన డ్రాపౌట్లు.. పడిపోయిన జీఈఆర్
యూడైస్ ప్లస్ నివేదికలను చూస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ప్రభుత్వ విద్య ప్రమాదంలో పడినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో డ్రాప్ అవుట్లు పెరిగాయి. బడి బయట పిల్లలు ఎంత మంది ఉన్నారో గమనించి.. వారిని బడుల్లో చేర్చాలన్న లక్ష్యం పూర్తిగా నీరుగారింది. గత ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, వలంటీర్లతో కలిసి బడి బయటి పిల్లలను గుర్తించి, తప్పనిసరిగా స్థానిక పాఠశాలల్లో చేరి్పంచే ప్రక్రియ కొనసాగేది.
ఇప్పుడు వలంటీర్ వ్యవస్థను రద్దు చేయడం, సచివాలయాల సిబ్బందిని విధులకు దూరం చేయడంతో పిల్లల చేరికల బాధ్యతను పూర్తిగా ఉపాధ్యాయులకు అప్పగించారు. రెండు విద్యా సంవత్సరాల్లో ఈ విధులు ప్రభుత్వ ఉపాధ్యాయులే చేయాలని ఆదేశించారు. దీంతో ఉదయం పూట బడుల్లో బోధించిన టీచర్లు.. మధ్యాహ్నం బడి బయటి పిల్లల సర్వేకు వెళ్లడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో డ్రాప్ అవుట్లు భారీగా పెరిగిపోయాయి.
రాష్ట్రంలో ఉన్నత పాఠశాలల్లో 2024–25 విద్యా సంవత్సరంలో డ్రాప్ అవుట్లు 15.50 శాతం, యూపీ స్కూళ్లల్లో 3.70 శాతం, ప్రాథమిక పాఠశాలల్లో 1.4 శాతం పెరిగింది. ఇదే క్రమంలో జీఈఆర్ (గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో) నమోదు కూడా దిగజారినట్టు యూడైస్ ప్లస్ నివేదికలే చెబుతున్నాయి. విద్యా రంగంపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితోనే ఈ పరిస్థితి ఏర్పడిందని, ప్రస్తుత విద్యా సంవత్సరం (2025–26)లో ఈ పరిస్థితి మరింత దిగజారుతోందని విద్యా రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


