
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్రం ఆపరేషన్ మహాదేవ్‌తో పహల్గాం ఉగ్రవాదుల్ని హతమార్చింది. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ప్రతీకారంతో భారత్ ఆపరేషన్ మహాదేవ్ పేరుతో మిలటరీ ఆపరేషన్ చేపట్టింది.వాళ్లను హతమార్చింది. అయితే, తాజాగా భారత సైనికులు ఆపరేషన్ మహాదేవ్‌కు సంబంధించి పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడింది సులేమాన్, అఫ్గానీ, జిబ్రాన్ ముగ్గురూ పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా (LeT) సభ్యులు. ఉగ్రదాడి తర్వాత నిందితులు శ్రీనగర్‌లో తలదాచుకుంటున్నారు. ఈ క్రమంలో ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ మహాదేవ్‌లో భాగంగా నిందితుల కమ్యూనికేషన్ ట్రాక్ చేసింది.శ్రీనగర్ సమీపంలోని లిడ్వాస్ ప్రాంతంలో స్థావరాల్ని గుర్తించింది.
అయితే, ఉగ్రవాదులు ఆపత్కాలకంలో స్థావరాల నుంచి పారిపోయేందుకు ఎనిమిది కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సొరంగాన్ని భారత సైన్యం గుర్తించింది. ఆపరేషన్ మహాదేవ్ ప్రారంభం తర్వాత తప్పించుకునేందుకు వీలు లేకుండా ఉగ్రవాదులు ఏర్పాటు చేసుకున్న ఎనిమిది కిలోమీటర్ల మేర నీటితో నింపింది. ఆ తర్వాతే లిడ్వాస్ ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్న గుడారాలపై ఆకస్మికంగా బుల్లెట్ల వర్షం కురిపించింది. నిద్రపోతున్న పహల్గాం నిందితుల్ని మట్టుబెట్టింది.
అనంతరం వారివద్ద నుంచి ఆయుధాలు,బుల్లెట్లను స్వాధీనం చేసుకుంది. ఆ బుల్లెట్లను.. పహల్గాంలో దాడికి ఉపయోగించిన బుల్లెట్లతో సరిపోల్చారు. ఉగ్రవాదుల మృతదేహాల వద్ద దొరికిన బుల్లెట్లు.. పహల్గాంలో మారణహోమం సృష్టించిన బుల్లెట్లతో 100శాతం సరిపోల్చినట్లు భారత సైన్యం నిర్ధారించింది. ఆపరేషన్ మహాదేవ్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో మాట్లాడుతూ.. ‘ఈ ముగ్గురు ఉగ్రవాదులు పహల్గాం దాడికి బాధ్యులే అని శాస్త్రీయంగా నిర్ధారించాం. దేశం ముందు నిజాన్ని ఉంచేందుకు అన్ని ఆధారాలు సేకరించాం’అని స్పష్టం చేశారు.