
బనస్కాంత: గుజరాత్‌కు చెందిన 18 ఏళ్ల యువతి పరువు హత్యకు గురయ్యింది. అయితే ఈ దారుణానికి కొద్దిసేపటి ముందు ఆమె తన ప్రియునికి పంపిన సందేశం ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఇటీవలే నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, డాక్టర్ కావాలనుకున్న ఆమె పరువు హత్యకు దారుణంగా బలయ్యింది.
గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాకు చెందిన 18 ఏళ్ల యువతిని ఆమె తండ్రి, మేనమామ కలిసి దారుణంగా హత్య చేశారు. అప్పటికే లివ్-ఇన్ రిలేషన్‌లో ఉన్న ఆ యువతి తమ సంబంధం ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో జీవిస్తూ వస్తోంది. ఈ నేపధ్యంలోనే ఆమె తన ప్రియునికి ‘రండి.. వచ్చి నన్ను తీసుకెళ్లండి. లేకపోతే నా కుటుంబ సభ్యులు నా ఇష్టానికి వ్యతిరేకంగా మరో వివాహం చేస్తారు. అందుకు నిరాకరిస్తే, నన్ను చంపేస్తారు. నన్ను కాపాడండి’ అంటూ తన ప్రియునికి సందేశం పంపింది. ఇది జరిగిన కొద్ది సేపటికే ఆమె హత్యకు గురయ్యింది.
విషయం తెలుసుకున్న మృతురాలి ప్రియుడు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం మృతురాలి తండ్రి సెంధాభాయ్ పటేల్, మేన మామ శివరాంభాయ్ పటేల్ ఈ దారుణానికి పాల్పడ్డారు. పోలీసులు ఆ మేనమామను అరెస్టు చేయగా, మృతురాలి తండ్రి పరారీలో ఉన్నాడు. పోలీసుల దర్యాప్తులో ఆ యువతి శివరాంభాయ్ ఇంట్లో హత్యకు గురయ్యిందని, అక్కడే ఆమెకు నిద్రమాత్రలు కలిపిన పాలు ఇచ్చి, గొంతు కోసి చంపారని తేలింది. తరువాత నేరాన్ని కప్పిపుచ్చేందుకు అమెకు అంత్యక్రియలు నిర్వహించారని పోలీసులు తెలిపారు.
కాగా ఆమె తన ప్రియునికి చివరి సందేశం పంపినప్పుడు అతను జైలులో, వెంటనే స్పందించలేని స్థితిలో ఉన్నాడు. అయినా కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. అయితే విచారణ షెడ్యూల్ అయ్యే సమయానికి ఆ యువతి మరణించింది. జూన్ 25న కోర్టులో అతని పిటిషన్ విచారణకు ఉండగా, ముందురోజు అంటే జూన్ 24న రాత్రి ఆమె హత్యకు గురయ్యింది. ఆమె అంత్యక్రియలను కుటుంబ సభ్యులు ఆ మర్నాడు నిర్వహించారు. ఆ యువతి తిరిగి తన ప్రేమికునితో ఎక్కడ వెళ్లిపోతుందనే భయంతోనే ఆమె తండ్రి, మేనమామ ఈ హత్యచేశారని పోలీసులు తెలిపారు.