‘హోమియో వైద్యులు.. అల్లోపతి మందులు’.. ‘మహా’లో కొత్త వివాదం | Homeopathic Doctors can now Prescribe Allopathic Medicines | Sakshi
Sakshi News home page

‘హోమియో వైద్యులు.. అల్లోపతి మందులు’.. ‘మహా’లో కొత్త వివాదం

Jul 9 2025 12:26 PM | Updated on Jul 9 2025 12:33 PM

Homeopathic Doctors can now Prescribe Allopathic Medicines

ముంబై: మహారాష్ట్రలో బాషా వివాదాలు నడుస్తున్న ప్రస్తుత తరుణంలో తెరపైకి మరో వివాదం వచ్చింది.  అదే ‘హోమియో వైద్యులు.. అల్లోపతి మందులు’. రాష్ట్రంలోని హోమియోపతి వైద్యులు ఆరు నెలల కోర్సు పూర్తి చేసిన  అనంతరం వారు అల్లోపతి మందులను సూచించేందుకు అనుమతినిస్తూ, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వివాదానికి దారితీసింది.

ఈ నిర్ణయాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ)తోపాటు పలువురు వైద్యులు వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా రోగుల భద్రత, వైద్య ప్రమాణాలకు ముప్పు వాటిల్లుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం 2014లో హోమియోపతి ప్రాక్టీషనర్లు కొన్ని షరతులతో ఆధునిక మందులను సూచించడానికి అనుమతించేలా చట్టంలో పలు సవరణలు చేసింది.

దీని ప్రకారం, ఫార్మకాలజీలో ఆరు నెలల కోర్సు పూర్తి చేసిన హోమియోపతి వైద్యులు, అల్లోపతి మందులను సూచించడానికి అర్హులు అవుతారు. మహారాష్ట్ర మెడికల్ కౌన్సిల్ (ఎంఎంసీ)ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఐఎంఏ ఈ నిర్ణయాన్ని బాంబే హైకోర్టులో సవాలు చేసింది. హోమియోపతి వైద్యులకు అల్లోపతి మందులను సూచించే అధికారం ఇవ్వడం రోగుల భద్రతకు ముప్పుగా మారుతుందని ఐఎంఏ పేర్కొంది.

ఆరు నెలల కోర్సుతో హోమియో వైద్యులు ఆధునిక వైద్యం నేర్చుకోవడం సాధ్యం కాదని, వైద్య ప్రమాణాలు దిగజారే అవకాశం ఉందని కొందరు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఒక రకమైన క్రాస్ ప్రాక్టీస్ అని, ఫలితంగా వైద్య రంగంలో గందరగోళం ఏర్పడవచ్చని వారు అంటున్నారు. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. ఆధునిక ఫార్మకాలజీలో సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసిన హోమియోపతి వైద్యులకు మాత్రమే అల్లోపతి మందులను సూచించే అధికారం ఉంటుందని ఎఫ్‌డీఏ పేర్కొంది. ప్రస్తుతం ఈ వివాదం ఇంకా కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement