Heavy Rains Continued For The Third Day In Himachal Pradesh, See Details Inside - Sakshi
Sakshi News home page

Himachal Pradesh Heavy Rains: ఉత్తరాది అతలాకుతలం.. మూడో రోజూ భారీ వర్షాలు, ప్రమాదస్థాయికి చేరుకున్న యమున

Jul 11 2023 4:51 AM | Updated on Jul 11 2023 9:54 AM

Heavy rains continued for the third day - Sakshi

న్యూఢిల్లీ/సిమ్లా/జైపూర్‌: ఉత్తరభారతంలో మూడో రోజూ వర్ష బీభత్సం కొనసాగింది. ఆకస్మిక వరదల్లో వాహనాలు, రహదారులు కొట్టుకుపోయాయి. పంటపొలాలు, నివాసప్రాంతాలు నీటమునిగాయి. వానల ప్రభావం హిమాచల్‌ ప్రదేశ్‌పైనే ఎక్కువగా పడింది. ఇళ్లు కూలి, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ఇప్పటి వరకు 18 మంది, పంజాబ్, హరియాణాల్లో 9 మంది, రాజస్తాన్‌లో ఏడుగురు, యూపీలో ముగ్గురు చనిపోయారు. దీంతో ఉత్తరాదిన వరదల్లో ఇప్పటిదాకా 37 మంది చనిపోయారు. హిమాచల్‌లోని వివిధ ప్రాంతాల్లో 200 మంది పర్యాటకులు చిక్కుబడిపోయారు.

ఢిల్లీలో యమునా నది ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తోంది. ఆదివారం రికార్డు స్థాయిలో కురిసిన వర్షంతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో మోకాలి లోతు నీరు నిలిచిపోయింది. ప్రధాని మోదీ సోమవారం సీనియర్‌ మంత్రులు, అధికారులతో కలిసి ఉత్తరాదిన భారీ వర్షాలతో ఉత్పన్నమైన పరిస్థితులపై చర్చించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు స్థానిక యంత్రాంగాలతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ, సహాయక కార్యక్రమాలను చేపట్టాలని ప్రధాని కోరారని పీఎంవో తెలిపింది.

ప్రధాని మోదీ హిమాచల్, ఉత్తరాఖండ్‌ సీఎంలతో మాట్లాడి, అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారని తెలిపింది. హిమాచల్‌ప్రదేశ్‌లో కుండపోతగా వానలు కురుస్తున్నాయి. కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో సోమవారం మరో నలుగురు చనిపోయారు.  సిమ్లా–కాల్కా హైవేలో కొంతభాగం కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సిమ్లా–కాల్కా మార్గంలో పట్టాలపై కొండచరియలు విరిగిపడటంతో మంగళవారం వరకు రైళ్ల రాకపోకలను ఆపేశారు.

రాష్ట్రంలో విద్యాసంస్థలకు మంగళవారం కూడా సెలవు ప్రకటించారు. వాతావరణ శాఖ రాగల 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. రాష్ట్రంలో వర్షాలు, వరదల కారణంగా 120 రోడ్లపై రాకపోకలు బందయ్యాయని, 484 నీటి సరఫరా పథకాలపై ప్రభావం పడిందని అధికారులు తెలిపారు. జూలై 1–9 తేదీల మధ్య సాధారణ వర్షపాతం 160.6 మిల్లీమీటర్లకు మించి 69 శాతం ఎక్కువగా 271.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.  

రాజ్‌పుర విద్యుత్‌ప్లాంట్‌లోకి చేరిన నీరు 
ఎగువనున్న హరియాణాలోని హత్నికుండ్‌ రిజర్వాయర్‌ నుంచి నీటిని విడుదల చేయడంతో ఢిల్లీలో యమునా నదిలో వరద పెరుగుతోంది. సోమవారం మధ్యాహా్ననికి ప్రమాద స్థాయి దాటి 205.33 మీటర్లకు చేరింది. మంగళవారం మధ్యాహా్ననికి 206.65 మీటర్లకు చేరి, క్రమేపీ తగ్గుముఖం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. నదిలో నీరు 206 మీటర్ల మార్కును దాటితే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని సీఎం కేజ్రీవాల్‌ చెప్పారు.

యమునా నదికి అత్యంత సమీపంలో సుమారు 41 వేల మంది నివసిస్తున్నట్లు అంచనా. గత ఏడాది సెపె్టంబర్‌లో రెండుసార్లు యమునా నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహించింది. పంజాబ్, హరియాణాల్లో వానల తీవ్రత సోమవారమూ కొనసాగింది. పంజాబ్‌ రాష్ట్రం పటియాలా జిల్లాలోని రాజ్‌పుర విద్యుత్‌ ప్లాంట్‌లోకి వరద చేరడంతో 700 మెగావాట్ల యూనిట్‌ను అధికారులు మూసివేశారు. సట్లెజ్‌ యయునా లింక్‌ కెనాల్‌ పొంగిపొర్లి రాజ్‌పురలోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలోకి నీరు చేరింది.

ఆస్పత్రుల్లోకి చేరిన వరద 
రాజస్తాన్‌లోని 14 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అజ్మీర్‌ రైల్వేస్టేషన్‌లో పట్టాలపైకి, జేఎల్‌ఎన్‌ ఆస్పత్రి వార్డుల్లోకి వరద నీరు ప్రవేశించింది. టోంక్‌లోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. భారీ వర్షాలతో ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్, బదౌన్‌ జిల్లాల్లో ఇళ్లు కూలిన ఘటనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. షహరాన్‌పూర్‌లో 15 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది. ఉత్తరాదిన మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement