పథనంతిట్ట: శబరిమలలో మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది. వారం క్రితం మాదిరిగా.. శబరిమల సన్నిధానంలో ఇసుకేస్తే రాలనంతగా అయ్యప్ప భక్తులు కనిపిస్తున్నారు. దీంతో.. అయ్యప్ప స్వామి దర్శనానికి 4-5 గంటల సమయం పడుతోంది. మండల పూజ సీజన్‌లో భాగంగా ఈ నెల 16న శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు తెరుచుకోగా.. తొలి నాలుగు రోజుల్లో రికార్డు స్థాయిలో భక్తులు దర్శనానికి తరలివచ్చారు. వారం రోజుల్లో ఆరున్నర లక్షల మంది అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. కోళిక్కోడ్‌కు చెందిన ఓ వృద్ధురాలు రద్దీ కారణంగా శరణ్‌గుత్తి వద్ద మృతిచెందడంతో.. కేరళ హైకోర్టు కల్పించుకుంది. రోజువారీ స్పాట్ బుకింగ్‌లను ఐదు వేలకు పరిమితం చేసింది.
భక్తుల దర్శనానికి ఇబ్బందులు కలుగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ) కోర్టుకు చెప్పడంతో.. శనివారం నాటి విచారణ సందర్భంగా స్పాట్ బుకింగ్‌లపై విధించిన ఆంక్షలను తొలగించింది. దీంతో.. ఆదివారం నుంచి స్పాట్ బుకింగ్‌లు పెరిగాయి. నిజానికి రోజుకు 70 వేల మంది భక్తులు దర్శించుకునేలా ఆన్‌లైన్ స్లాట్లు విడుదలవ్వగా.. మండల సీజన్‌తో పాటు.. మకరవిళక్కు వరకు కూడా స్లాట్లు బుక్ అయిపోయాయి. దీంతో.. స్పాట్ బుకింగ్‌కు డిమాండ్ పెరిగింది. ఈ కారణంగా బుధవారం ఉదయం నుంచి శబరిమలలో భక్తుల రద్దీ పెరిగింది.
పంపాబేస్ నుంచే భక్తులు కిక్కిరిసిపోయి కనిపిస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో పంపా వద్ద రద్దీ సాధారణంగా కనిపించినా.. 4 గంటల నుంచి పెరుగుతూ వచ్చింది. దీని ప్రభావం మధ్యాహ్నానికి నీలిమల, శరణ్‌గుత్తి ప్రాంతాల్లో కనిపించింది. నిటారు కొండపై భక్తులు గంటల కొద్దీ వేచిచూసిన దృశ్యాలను ‘సాక్షి డిజిటల్’ యూట్యూబ్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా ప్రచురించింది. నడపండాల్ క్యూలైన్లలో కూడా భక్తులు వందల సంఖ్యలో వేచిచూసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. భక్తులు శరణ్‌గుత్తి నుంచి సన్నిధానం చేరుకోవడానికి నాలుగు గంటల సమయం పడుతోంది. నడపండాల్ నుంచి 18 మెట్లను ఎక్కడానికి మరో అరగంట.. అక్కడి నుంచి ఫ్లైఓవర్ మీదుగా అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ఇంకో అరగంట పడుతోందని శబరిమల యాత్రకు వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన భక్తులు ‘సాక్షి’కి వివరించారు.


