
పహల్గాం ఘటనపై బీజేపీ ఎంపీ వాచాలత
భివానీ: పహల్గాం ఉగ్ర దాడిపై బీజేపీ నేతల నోటిదురుసు తగ్గడం లేదు. మంత్రుల స్థాయి నేతలే మతిలేని వ్యాఖ్యలు చేసి కోర్టులతో మొట్టికాయలు తింటున్నా కనువిప్పు కలగడం లేదు. పహల్గాం దాడిలో మహిళల కళ్లముందే వారి భర్తలను ముష్కరులు కర్కశంగా కాల్చి చంపడం తెలిసిందే. అలా సర్వం కోల్పోయి వితంతువులుగా మిగదిలిన వారినుద్దేశించి హరియాణాకు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు రాంచందర్ జంగ్రా శనివారం దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. ‘‘భర్తలను చంపొద్దని ఉగ్రవాదులను వేడుకునే బదులు వారిపై తిరగబడాల్సింది.
కానీ వారిలో యోధుల స్ఫూర్తి లోపించింది. ఉగ్రవాదులకు చేతులు జోడించారు. పర్యాటకులంతా అగి్నవీర్‌ల వారిని ప్రతిఘటిస్తే ప్రాణనష్టం బాగా తగ్గేది’’ అన్నారు. రాణీ అహల్యాబాయి మాదిరిగా మన సోదరీమణుల్లో సాహస స్ఫూర్తిని పెంపొందించాల్సిన అవసరముందంటూ హితోక్తులు పలికారు. జంగ్రా వాచాలతపై రాజకీయ దుమారం రేగుతోంది. ఆయన వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరమంటూ కాంగ్రెస్ నేతలు దీపీందర్‌సింగ్ హుడా, సుప్రియా శ్రీనేత్, సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ తదితరులు మండిపడ్డారు.