
గాజా: ఇజ్రాయెల్ గాజాపై నిరంతర దాడులు కొనసాగిస్తోంది. తాజాగా గాజా నగరంలోని అల్-షిఫా ఆసుపత్రి సమీపంలో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఐదుగురు అల్ జజీరా జర్నలిస్టులు మృతిచెందారు. మృతులలో అల్ జజీరా కరస్పాండెంట్లు అనాస్ అల్ షరీఫ్, మొహమ్మద్ క్రీఖే, కెమెరామెన్ ఇబ్రహీం జహెర్, మోమెన్ అలీవా, మొహమ్మద్ నౌఫాల్ ఉన్నారని సమాచారం.
అల్ షిఫా ఆస్పత్రి ప్రధాన ద్వారం వెలుపల ప్రెస్ కోసం ఏర్పాటుచేసిన టెంట్‌ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ జరిపిన దాడిలో మొత్తం ఏడుగురు మరణించగా వారిలో ఐదుగురు జర్నలిస్టులు ఉన్నారు. దాడి జరిగిన కొద్దిసేపటికే ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్రకటనలో తాము ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు తెలపడంతో పాటు మృతులలోని ఒక రిపోర్టర్‌ను ఉగ్రవాదిగా పేర్కొంది. హమాస్‌లోని ఉగ్రవాద విభాగానికి హెడ్‌గా పనిచేశాడని తెలిపింది. జర్నలిస్టు అల్-షరీఫ్(28) తన మరణానికి ముందు.. గాజా నగరంలో ఇజ్రాయెల్ బాంబు దాడులను తీవ్రతరం చేసినట్లు ‘ఎక్స్’ పోస్టులో తెలియజేశాడు.
గాజాలో 22 నెలలుగా జరుగుతున్న యుద్ధంలో జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని పలు దాడులు జరిగాయి. ఈ దాడుల్లో దాదాపు 200 మంది మీడియా సిబ్బంది మరణించారని పలు మీడియా నివేదికలు చెబుతున్నాయి. కాగా గాజా నగరంలో జర్నలిస్టులను ఉంటున్న టెంట్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో అల్ జజీరా జర్నలిస్ట్ అనాస్ అల్ షరీఫ్ తన నలుగురు సహచరులతో పాటు మరణించారని ఖతార్‌కు చెందిన ప్రసార సంస్థ తెలిపింది.