మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులు, జర్నలిస్టులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేలా ఈజేహెచ్‌ఎస్ (ఎంప్లాయీస్, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్) వెల్‌నెస్ సెంటర్లలో సేవలను విస్తరించాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. శుక్రవారం అధికారులతో సమీక్ష సందర్భంగా.. వెల్‌నెస్ సెంటర్లలో కార్డియాలజీ, నెఫ్రాలజీ తదితర స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చే అంశంపై చర్చించారు. హైదరాబాద్ లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్‌కుమార్, డీఎంఈ నరేంద్ర కుమార్, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈజేహెచ్‌ఎస్ పరిధిలోని జర్నలిస్టులు, ప్రభుత్వ ఉద్యోగులకు వైద్య సేవలు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 12 వెల్‌నెస్ సెంటర్లను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నిర్వహిస్తోంది. సేవల విస్తరణ ప్రణాళికలో భాగంగా.. ఖైరతాబాద్, కూకట్‌పల్లి వెల్‌నెస్ సెంటర్ల నిర్వహణ బాధ్యతలను నిమ్స్‌కు, మిగిలిన 10 వెల్‌నెస్ సెంటర్ల నిర్వహణ బాధ్యతలను మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం మెడిసిన్, డెంటల్, ఫిజియోథెరపీ వంటి సేవలను వెల్‌నెస్ సెంటర్లు అందిస్తున్నాయి. కొన్నిచోట్ల గైనకాలజీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్ సేవలు అందుతున్నాయి. ఇకపై జనరల్ సర్జరీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, పీడియాట్రిక్స్, న్యూరాలజీ, డెర్మటాలజీ వంటి స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను కూడా వెల్‌నెస్ సెంటర్లలో దశలవారీగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను మంత్రి ఆదేశించారు.


