కొవ్వొత్తుల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి! | Sakshi
Sakshi News home page

Maharashtra: కొవ్వొత్తుల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి!

Published Sat, Dec 9 2023 9:51 AM

Fire in Candle Making Factory six Killed - Sakshi

మహారాష్ట్రలోని పూణె జిల్లాలోని పింప్రి చించ్వాడ్‌లో గల ఒక కొవ్వొత్తుల తయారీ కర్మాగారంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. 10  మంది గాయపడ్డారు. ఈ సమాచారాన్ని ఓ అధికారి మీడియాకు తెలియజేశారు. 

పింప్రి-చించ్వాడ్‌ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శేఖర్ సింగ్ ఈ ఉదంతం గురించి మీడియాతో మాట్లాడుతూ తల్వాడేలో గల ​​కొవ్వొత్తుల ఫ్యాక్టరీలో మంటలు సంభవించినట్లు అగ్నిమాపక శాఖకు సమాచారం అందింది. ఈ కర్మాగారంలో.. పుట్టినరోజు వేడుకల్లో ఉపయోగించే కొవ్వొత్తులను తయారు చేస్తుంటారని ఆయన తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారని, ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు.

పింప్రి చించ్వాడ్‌ మున్సిపల్ కార్పొరేషన్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. యూనిట్ యజమాని సంఘటన గురించి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారని, ఆ తర్వాత వారు సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపు చేసి, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారన్నారు. ప్రమాదంలో ఆరు మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయని, వాటిని గుర్తించడం కష్టంగా మారిందన్నారు. ప్రమాదంలో మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయని ఆయన చెప్పారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామన్నారు. 

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశాలు జారీచేశారు. అగ్నిప్రమాదానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లా మేజిస్ట్రేట్ రాజేష్ దేశ్‌ముఖ్ ససూన్ జనరల్ ఆసుపత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు.
ఇది కూడా చదవండి: ఏమీ చేయకుండా నెలకు రూ. 9 లక్షలు.. ఫలించిన కుర్రాడి ఐడియా!

 
Advertisement
 
Advertisement