రాజస్తాన్‌ సీఎం గెహ్లోత్‌ కుమారుడికి ఈడీ సమన్లు  

FEMA case ED summons Rajasthan CM Ashok Gehlot son - Sakshi

రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు సహా పలువురి నివాసాల్లో సోదాలు 

పరీక్ష పేపర్‌ లీకేజీ కేసులో దర్యాప్తు చేస్తున్న ఈడీ  

కేంద్రం గూండాగిరీకి పాల్పడుతోందన్న సీఎం అశోక్‌ గెహ్లోత్‌

జైపూర్‌: రాజస్తాన్‌లో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పరీక్ష పేపర్‌ లీకేజీ కేసులో మనీల్యండరింగ్‌ ఆరోపణలపై రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు, పాఠశాల విద్యాశాఖ మాజీ మంత్రి గోవింద్‌ సింగ్‌ దోతాస్రా ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దాడులు జరిపింది. అదేవిధంగా, విదేశీ కరెన్సీ నిబంధనల ఉల్లంఘన కేసులో సీఎం అశోక్‌ గెహ్లోత్‌ కుమారుడు వైభవ్‌కు సమన్లు జారీ చేసింది. శుక్రవారం ఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని ఆయన్ను కోరింది. సీఆర్‌పీఎఫ్‌ బలగాల బందోబస్తు నడుమ గురువారం ఈడీ అధికారుల బృందం జైపూర్, సికార్‌లలోని గోవింద్‌ సింగ్‌ ఇళ్లలో సోదాలు చేపట్టారు. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఈయన సికార్‌ జిల్లాలోని లచ్చమన్‌గఢ్‌ నుంచి పోటీలో ఉన్నారు.

అదేవిధంగా, దౌసా జిల్లాలోని మహువా సీటుకు పోటీలో ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థి ఓం ప్రకాశ్‌ హుడ్లా, మరికొందరి ఇళ్లలో కూడా సోదాలు చేపట్టినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. 2022 డిసెంబర్‌లో రాజస్తాన్‌ పబ్లిక్‌ సరీ్వస్‌ కమిషన్‌ నిర్వహించిన సీనియర్‌ టీచర్‌ గ్రేడ్‌–2 పరీక్షలో జనరల్‌ నాలెడ్జి ప్రశ్నపత్రం లీకైంది. అప్పటి విద్యాశాఖ మంత్రి గోవింద్‌సింగ్‌ తదితరులు కలిసి ఒక్కో అభ్యర్థి నుంచి రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేసి, ఈ దందాకు పాల్పడినట్లు ఈడీ ఆరోపిస్తోంది.  

వైభవ్‌పై ఆరోపణలేంటీ? 
సీఎం గెహ్లోత్‌ కుమారుడు వైభవ్‌ విదేశీ మాదక ద్రవ్య మారి్పడి చట్టం కేసును ఎదుర్కొంటున్నారు. 2011 నుంచి ఈ కేసుకు సంబంధించిన పత్రాలను సమకూర్చుకోవాల్సి ఉన్నందున వైభవ్‌ శుక్రవారం విచారణకు హాజరుకాకపోవచ్చని ఈడీ అంటోంది. విచారణ వాయిదా కోరవచ్చని భావిస్తోంది. రాజస్తాన్‌కు చెందిన ట్రిటాన్‌ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్, వార్ధా ఎంటర్‌ ప్రైజెస్‌ సంస్థల ప్రమోటర్లకు చెందిన జైపూర్, ఉదయ్‌పూర్, ఢిల్లీల్లోని పలు ప్రాంతాల్లో ఆగస్ట్‌లో ఈడీ సోదాలు జరిపింది. వీరికి వైభవ్‌ గెహ్లోత్‌తో సంబంధాలున్నట్లు ఈడీ అనుమానిస్తోంది. దాడుల్లో రూ.1.2 కోట్ల లెక్కల్లో చూపని నగదును గుర్తించింది.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top