నిరసనకు రైతుల బ్రేక్‌! అసలేం జరిగిందంటే.. | Sakshi
Sakshi News home page

నిరసనకు రైతుల విరామం! అసలేం జరిగిందో పది పాయింట్లలో..

Published Thu, Feb 22 2024 7:45 AM

Farmers put Delhi Chalo march on hold Key Updates - Sakshi

కనీస మద్ధతు ధరతో సహా 23 డిమాండ్లతో మళ్లీ ఆందోళన ప్రారంభించిన రైతన్నల్ని పోలీసులు అడ్డుకునే క్రమంలో బుధవారం ఢిల్లీ సరిహద్దు అట్టుడికి పోయింది. భాష్పవాయివు ప్రయోగంతో పాటు ఓ యువరైతు మరణించాడన్న ప్రచారంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ తరుణంలో తమది రైతుపక్ష ప్రభుత్వమని, మరోసారి చర్చలకు సిద్ధమని కేంద్రం ప్రకటించుకోగా..  ఆందోళనలకు రెండ్రోజులు విరామం ప్రకటించాయి రైతు సంఘాలు. 

 • తమ తదుపరి కార్యచరణ రూపకల్పన కోసమే రెండ్రోజులు విరామం ప్రకటించినట్లు పంజాబ్‌ కిసాన్‌ మజ్దూర్‌ జనరల్‌ సెక్రటరీ శర్వాన్‌ సింగ్‌ పంథేర్‌ ప్రకటించారు. ఈలోగా కేంద్రం నుంచి ఏదైనా పురోగతి కనిపించకపోతే.. శుక్రవారం సాయంత్రం తర్వాయి ప్రకటన చేస్తామని చెప్పారాయన. కనీస మద్దతు ధరపై చట్టం తీసుకువచ్చేందుకు కేంద్రం ఒకరోజు పార్లమెంట్‌ను సమావేశపర్చాలని ఆయన తొలి నుంచి డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి అదే డిమాండ్‌ వినిపించారాయన. 
   
 • బుధవారం ఉదయం ఢిల్లీ వైపు వెళ్లేందుకు శంభు వద్ద 14వేల మంది రైతులు, 1200 ట్రాక్టర్లు, 300 కార్లు, 10 మినీ బస్సుల్లో కదిలారు. శంభూ-కనౌరీ సరిహద్దు వద్ద బుధవారం ఉదయం రైతులు బారికేడ్లను దాటే యత్నం చేశారు. వారిని నిలువరించేందుకు హర్యానా పోలీసులు మూడు రౌండ్ల టియర్‌ గ్యాస్‌ ప్రయోగం జరిపారు.  ఈ క్రమంలో ఘర్షణ వాతావరణం నెలకొనగా.. శుభ్‌కరణ్‌ సింగ్‌(22) అనే యువకుడు మృతి చెందినట్లు, పలువురు రైతులకు గాయాలు అయినట్లు రైతు సంఘాలు ప్రకటించాయి.
   
 • యువరైతు మృతి ఘటనపై పంజాబ్‌ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. శుభ్‌కరణ్‌ మృతదేహానికి పోస్ట్‌మార్టం తర్వాత కేసు నమోదు చేస్తామని పంజాబ్‌ సీఎం భగవంత్‌ సింగ్‌ మాన్‌ చెబుతున్నారు. ఘటనపై కఠిన చర్యలు తప్పవని చెబుతూనే.. బాధిత కుటుంబాన్ని పంజాబ్‌ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు.
   
 • ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో బుధవారం రైతులు భారీ ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన రైతులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. అతని పేరు బ్రిజ్‌పాల్‌ అని.. అతనూ ఓ రైతేనని రైతు సంఘాల నేతలు వెల్లడించారు. బ్రిజ్‌కు ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు వెల్లడించారు. 
   
 • అయితే హర్యానా పోలీసులు మాత్రం శుభ్‌కరణ్‌ సింగ్‌ ఘర్షణలోనే మరణించారన్న వాదనను తోసిపుచ్చారు. దాన్నొక రూమర్‌గా కొట్టిపారేశారు. ఈ విషయంలో పంజాబ్‌ ప్రభుత్వం మొదటి నుంచి తమకు సహకరించడం లేదని హర్యానా సర్కార్‌ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. బారికేడ్లను ధ్వంసం చేసే పరికరాలను వారు తమ వెంట తీసుకెళ్తున్నారని..  వాటిని స్వాధీనం చేసుకోవాలని పంజాబ్‌ బలగాలను అభ్యర్థించినా ఆ పని చేయలేదని హర్యానా పోలీసులు చెబుతున్నారు. కేంద్ర హోం శాఖ సైతం ముందుగా పంజాబ్‌ ప్రభుత్వానికి లేఖ రాసిన విషయాన్నీ ఈ సందర్భంగా హర్యానా ప్రభుత్వం గుర్తు చేస్తోంది. 
   
 • ‘మేం చేసిన నేరం ఏమిటి..? మిమ్మల్ని ప్రధానిని చేశాం. మమ్మల్ని అణచివేసేందుకు ఈ విధంగా బలగాలను ఉపయోగిస్తారని అనుకోలేదు. మేము అసలు డిమాండ్ల నుంచి వెనక్కి తగ్గేలా కేంద్రం ప్రతిపాదనలు చేసింది. ఇప్పుడు ఏం జరిగినా దానికి కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుంది’ అని పంజాబ్‌ కిసాన్‌ మజ్దూర్‌ జనరల్‌ సెక్రటరీ శర్వాన్‌ సింగ్‌ పంథేర్‌ అన్నారు. 
   
 • డిమాండ్ల సాధనకు రైతులు మళ్లీ ఆందోళనకు దిగడంపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్‌ ముండా బుధవారం స్పందించారు.  రైతు నేతలతో ఐదో విడత చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. నాలుగో విడత చర్చల తర్వాత.. నాలుగు ప్రధాన డిమాండ్లపై చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. ఈ మేరకు రైతు సంఘాల నేతలకు ఆహ్వానం పంపాం. శాంతియుత వాతావరణం నెలకొల్పాల్సిన అవసరం అందరికీ ఉంది’’ అని ట్వీట్‌ చేశారాయన.  మరోవైపు నిన్న జరిగిన కేబినెట్‌ భేటీలో చెరుకు రైతులకు శుభవార్త చెప్పింది కేంద్రం. 2024-25 సీజన్లో చక్కెర ఎఫ్ఆర్పి(గిట్టుబాటు) ధర క్వింటాల్ కు రూ.340 రూపాయలు పెంచుతున్నట్లు ప్రకటించింది. భేటీ అనంతరం కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మీడియాతో మాట్లాడుతూ.. తాము రైతుపక్ష ప్రభుత్వమని అన్నారు. 
   
 • ఇంకోవైపు తమ నిరసనలపై ప్రభుత్వాలు అవలంభిస్తున్న వైఖరిపై రైతు సంఘాలు మండిపడుతున్నాయి. రైతులను ఢిల్లీకి వెళ్లనివ్వకపోతే ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులను గ్రామాల్లోని రానివ్వబోమని భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) అధికార ప్రతినిధి రాకేశ్‌ తికాయత్‌ హెచ్చరించారు. డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ మీరట్‌లో రైతులు బుధవారం ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో.. కలెక్టరేట్‌కు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు.
   
 • పంజాబ్‌లోని రైతులు తమ ఢిల్లీ చలో మార్చ్‌ను పునఃప్రారంభించడం.. సరిహద్దులో బలగాల మోహరింపుతో ఢిల్లీకి వెళ్లే రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. ఈ క్రమంలో ట్రాఫిక్‌ ఆంక్షల్ని ప్రకటించారు. మరోవైపు ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే, NH-9లో వాహనాల రద్దీ కనిపించింది. ఇంకోపక్క.. హర్యానాతో సింగు-టిక్రీ సరిహద్దులు మూసివేత గురువారం కూడా అమల్లో ఉంటుందని అధికారులు ప్రకటించారు.
   
 • రైతుల నిరసన-బలగాల మోహరింపుతో తీవ్ర ఉద్రిక్తతల నడము.. హర్యానా-పంజాబ్‌ సరిహద్దులో ఈ నెల 23వ తేదీ వరకు ఇంటర్నెట్‌ సర్వీసులను రద్దును హర్యానా ప్రభుత్వం పొడిగించింది. అలాగే.. రైతులు విరామం ప్రకటించినా.. ముందు జాగ్రత్తగా సరిహద్దులో బలగాల మోహరింపును కొనసాగించనున్నట్లు వెల్లడించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement