మనవడితో వాకింగ్‌.. మాజీ మంత్రి లైఫ్‌లో ట్విస్ట్‌! | Evening Walk to Uttarakhand Governor: Dhal Singh Bisens Surprise Call | Sakshi
Sakshi News home page

మనవడితో వాకింగ్‌.. మాజీ మంత్రి లైఫ్‌లో ట్విస్ట్‌!

Oct 13 2026 11:58 AM | Updated on Oct 13 2026 12:04 PM

Evening Walk to Uttarakhand Governor: Dhal Singh Bisens Surprise Call

ఆయనో సీనియర్‌​ పొలిటీషియన్‌. మంత్రిగానూ పని చేశారు. ఇక రాజకీయాల నుంచి దాదాపుగా రిటైర్‌ అయినట్లేనని అంతా అనుకుంటున్నారు. అలాంటి వ్యక్తికి సాయంత్రం పూట మనవడితో కలిసి వాకింగ్‌ చేస్తున్న టైంలో ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. దాంతో ఆ మాజీ మంత్రి జీవితం ఒక్కసారిగా కొత్త మలుపు తిరిగింది. ఆ ఫోన్‌లోని సమాచారం రావడంతో మనవడిని ముద్దాడుతూ సంబురాలు చేసుకుంది ఆయన కుటుంబం.

మధ్యప్రదేశ్‌కు చెందిన మాజీ మంత్రి దల్‌ సింగ్‌ బిసేన్‌కు ఎదురైన అనూహ్య అనుభవమిది. 74 ఏళ్ల దల్‌ సింగ్‌ బిసేన్‌ను ఉత్తరాఖండ్‌ గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న లెఫ్టినెంట్‌ జనరల్‌ గుర్మీత్‌ సింగ్‌ (రిటైర్డ్‌) స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. గవర్నర్‌గా నియామక వార్త అందిన సమయంలో బిసేన్‌ తన స్వస్థలమైన మధ్యప్రదేశ్‌లోని సియోనీలో మనవడితో ఆడుకుంటున్నానని చెబుతున్నారు.

రాజకీయాల్లో అంచెలంచెలుగా..
1952 మే 14న మధ్యప్రదేశ్‌లోని సియోనీ జిల్లాలో పిపారియా గ్రామంలో దల్‌ సింగ్‌ బిసేన్‌ జన్మించారు. ఆయుర్వేద వైద్యుడిగా, రైతుగా ఆయనకు గుర్తింపు ఉంది. రాజకీయ ప్రస్థానాన్ని గ్రామ స్థాయిలో పంచాయతీ సభ్యుడిగా ప్రారంభించారు. 1990లో తొలిసారి మధ్యప్రదేశ్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1993, 1998, 2003 ఎన్నికల్లోనూ బర్గీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున విజయం సాధించారు. 2003 నుంచి 2005 వరకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అటవీ, రవాణా, ఖనిజాలు, పాఠశాల విద్య, జైళ్ల శాఖల వంటి బాధ్యతలు నిర్వహించారు. 2011 నుంచి 2013 వరకు రాష్ట్ర నాలుగో ఆర్థిక సంఘం చైర్మన్‌గా వ్యవహరించారు.

ఎంపీగా 99 శాతం హాజరు
బర్గీ నియోజకవర్గం ఎస్టీలకు రిజర్వ్‌ కావడంతో తర్వాతి ఎన్నికల్లో కియోలారీ నుంచి పోటీ చేశారు. అయితే 2008, 2013 ఎన్నికల్లో ఓటమి ఎదురైంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బాలాఘాట్‌ స్థానం నుంచి గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. 2024 వరకు 17వ లోక్‌సభ సభ్యుడిగా కొనసాగారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు.

పార్లమెంట్‌ పనితీరుకు సంబంధించి పీఆర్‌ఎస్‌ గణాంకాల ప్రకారం.. లోక్‌సభలో బిసేన్‌ హాజరు 99 శాతంగా నమోదైంది. 73 చర్చల్లో పాల్గొనడంతోపాటు 189 ప్రశ్నలు అడిగారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, రైల్వేలు, సాగునీరు, గిరిజన సంక్షేమం వంటి అంశాలపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు.

ఆరు రాష్ట్రాల్లో గవర్నర్ల మార్పులు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఆరు గవర్నర్ల నియామకాలు, బదిలీలకు ఆమోదం తెలిపారు. కేరళ గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ను తమిళనాడుకు బదిలీ చేశారు. సిక్కిం గవర్నర్‌ ఓం ప్రకాశ్‌ మాథుర్‌ను కేరళకు పంపించారు. దుష్యంత్‌ గౌతమ్‌ను సిక్కిం గవర్నర్‌గా, సుధా యాదవ్‌ను కర్ణాటక గవర్నర్‌గా, బ్రజ్‌ మోహన్‌ రామ్‌ను ఒడిశా గవర్నర్‌గా నియమించారు. ఈ మార్పుల్లో భాగంగా దల్‌ సింగ్‌ బిసేన్‌కు ఉత్తరాఖండ్‌ గవర్నర్‌ బాధ్యతలు అప్పగించారు.

ఇదీ చదవండి: అయోధ్యలో యోగి పోటీ చేస్తారా? అదే జరిగితే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement