ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో అయోధ్య కేంద్రంగా మాటల యుద్ధం మొదలైంది. 2027 అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే సీఎం యోగి ఆదిత్యనాథ్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు ఆసక్తి రేపుతున్నాయి. అయోధ్య నుంచి తనపై పోటీ చేయాలని అఖిలేశ్‌కు యోగి సవాల్ విసరగా.. ఎస్పీ అధినేత స్ట్రాంగ్ కౌంటర్ సంధించారు. దీంతో ఎన్నికల పోరు ఇప్పటి నుంచే రాజకీయ వేడిని పెంచుతోంది.
అయోధ్య అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిని ఎంపిక చేయడంలో బీజేపీ తడబడుతోందని అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. తమ పార్టీ ఇప్పటికే పవన్ పాండేను అభ్యర్థిగా ప్రకటించిందని, బీజేపీ మాత్రం సరైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోందని వ్యాఖ్యానించారు. దీనిపై బలరాంపూర్‌లో జరిగిన బహిరంగ సభలో యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. అఖిలేశ్ అయోధ్య నుంచి నామినేషన్ దాఖలు చేయాలని, తాను కూడా అక్కడి నుంచే పోటీకి దిగుతానని సవాల్ విసిరారు. ఇద్దరం పోటీ చేసి ఎవరి అదృష్టం ఎలా ఉందో తేల్చుకుందామని అన్నారు.
అయోధ్యలో అభివృద్ధి పనులు, రామమందిరం గురించి ప్రస్తావించిన యోగి.. తమ ప్రభుత్వం నగరాన్ని అభివృద్ధి చేసిందని పేర్కొన్నారు. గతంలో అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ అయోధ్యను పట్టించుకోలేదని విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌లో రామరాజ్య స్థాపన దిశగా మార్పులు తీసుకొచ్చామని తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు.
అఖిలేశ్ ఎదురు దాడి..
యోగి సవాల్‌పై లక్నోలో అఖిలేశ్ యాదవ్ స్పందించారు. తమ టికెట్లే ఖరారు కానివారు ఇతరులకు టికెట్ల గురించి చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ముందు నీ టికెట్ ఖరారు చేసుకోవయ్యా’’ అంటూ యోగిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అహంకారంతో వ్యవహరించే వారిని తమ పార్టీ తుడిచిపెడుతుందని అన్నారు. యోగి సవాల్‌ను అఖిలేశ్ నేరుగా స్వీకరించకుండానే.. సీఎం అభ్యర్థిత్వంపైనే ప్రశ్నలు లేవనెత్తారు. అదే సమయంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి ప్రజా సమస్యలను కూడా ప్రస్తావించారు.
బీజేపీకి గుర్తుండిపోయే ఓటమి..
అయోధ్య అసెంబ్లీ స్థానం రాజకీయంగా అత్యంత కీలకమైనది. రామమందిరం ఇక్కడే ఉండటంతో బీజేపీ హిందుత్వ రాజకీయాల్లో ఈ ప్రాంతానికి ప్రత్యేక స్థానం ఉంది. అయితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో రామమందిరం ప్రారంభోత్సవం జరిగిన కొద్ది నెలలకే ఫైజాబాద్ లోక్‌సభ స్థానంలో బీజేపీ ఓటమి పాలైంది. ఈ నియోజకవర్గ పరిధిలో అయోధ్య కూడా ఉంది.
సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి అవధేశ్ ప్రసాద్.. బీజేపీ సిట్టింగ్ ఎంపీ లల్లూ సింగ్‌పై 54 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రామమందిరం ప్రారంభోత్సవం తర్వాత కూడా బీజేపీ ఓడిపోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్థానిక సమస్యలు, ఉపాధి, ఆర్థిక పరిస్థితులు, అభివృద్ధి పనులు, భూసేకరణపై ఆందోళనలు కూడా ఎన్నికల చర్చలో భాగమయ్యాయి.
ఈ ఫలితం రామమందిరం అంశం ఒక్కటే బీజేపీకి ఓట్లు తెచ్చిపెడుతుందనే అంచనాపై ప్రశ్నలు లేవనెత్తింది. ఇప్పుడు 2027 అసెంబ్లీ ఎన్నికల ముందు అయోధ్యను కేంద్రంగా చేసుకుని యోగి సవాల్ విసరడం.. ఆ ప్రాంతంలో బీజేపీ రాజకీయ పట్టు, అభివృద్ధి వాదనలను మళ్లీ ముందుకు తీసుకురావాలనే ప్రయత్నంగా కనిపిస్తోంది.
పీడీఏ నినాదంపైనా యోగి వ్యంగ్యాస్త్రాలు
బలరాంపూర్ సభలో యోగి ఆదిత్యనాథ్ సమాజ్‌వాదీ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి, నేరాలకు రాజకీయ అండదండలు కల్పించడం వంటి ఆరోపణలు చేశారు. ఎస్పీ ప్రతిపాదిస్తున్న పీడీఏ (వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీలు) నినాదాన్ని కూడా వ్యంగ్యంగా ప్రస్తావించారు. పీడీఏ అంటే ‘పరివార్ డెవలప్‌మెంట్ అథారిటీ’ అని వ్యాఖ్యానిస్తూ, ఆ పార్టీ నిర్ణయాలు సామాజిక వర్గాల కంటే కుటుంబ సభ్యులు, సంపన్న వర్గాల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయని ఆరోపించారు. మరోవైపు, రామమందిరం నిర్మాణం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, శాంతిభద్రతల మెరుగుదల తమ ప్రభుత్వ విజయాలని బీజేపీ చెబుతోంది. ఈ అంశాలు వచ్చే ఎన్నికల్లో ఎంతమేరకు ఓట్లుగా మారతాయనేది కీలకం కానుంది.
2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి కోలుకుని అయోధ్యలో మళ్లీ రాజకీయ ఆధిపత్యం సాధించాలని బీజేపీ భావిస్తుండగా.. ఆ పార్టీ వాదనలను సవాలు చేస్తూ ముందుకెళ్లాలని ఎస్పీ చూస్తోంది. ఎన్నికలకు ముందే యోగి, అఖిలేశ్ మధ్య మొదలైన ఈ మాటల యుద్ధం.. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో అయోధ్య ప్రాధాన్యాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది.
ఇదీ చదవండి: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ‘రాజీనామా’పై రాజకీయ దుమారం!


