కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ తన ఆత్మకథ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్'లో వెల్లడించిన వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లో కేన్సర్‌కు సంబంధించిన కలవరపర్చే ఆసక్తికర వాస్తవం వెలుగులోకి వచ్చింది. ఆమె 2010లో రొమ్ము క్యాన్సర్‌కు శస్త్రచికిత్స చేయించుకోవడం గురించి, ఒక ఏడాది తదుపరి వైద్య పరీక్షల్లో క్లోమంలో గడ్డను కనుగొనడం తదితరాలు గురించి సోనియా రాశారు. ఆ క్లోమపు గడ్డ కేన్సర్ పూర్వపు దశలో ఉన్నట్లు గుర్తించి శస్త్ర చికిత్స చేసి తొలగించారని పేర్కొన్నారు. దాంతో ఒక్కసారిగా అందరిలో కేన్సర్ పట్ల తీవ్ర భయాందోళనలను లేవనెత్తాయి. ఎందుకంటే.. అసలు కేన్సర్‌కి విజయవంతంగా చికిత్స చేసినప్పటికీ..కొన్నిసార్లు కేన్సర్ మరో అవయవంలో ఎందుకు తిరగబెడుతుంది. అసలు శాశ్వతంగా తగ్గడం అనేది ఉండదా అనే అనుమానాలు లేవనెత్తాయి. దీని గురించి వైద్య నిపుణులు ఏమంటున్నారంటే..
Sonia Gandhi writes about breast cancer: నిపుణుల మాత్రం కణితికి విజయవంతంగా చికిత్స చేసినప్పటికీ కేన్సర్ వ్యాపించగలదని అన్నారు. ఇలా వ్యాపించడాన్ని మైక్రో మెటాస్టాసిస్ అంటారు. శరీరంలో ఒక భాగంలో కేన్సర్ సోకిన తర్వాత ఆ రోగి శస్త్రచికిత్స, కీమోధెరపీ, రేడియోఏషన్, టార్గెటెడ్ థెరపీ లేదా హార్మోన్ల చికిత్సను పూర్తి చేసినప్పటికీ వారిలో కేన్సర్ ఆనవాళ్లు కనిపించకపోవచ్చు. అయితే కొన్ని సూక్ష్మ కేన్సర్ కణాలు శరీరంలోని ఇతర భాగాలలో నిద్రాణస్థితిలో జీవించి ఉండవచ్చన్నారు.
అయితే ఈ కణాలలో లేదా వాటి పరిసరాలలో మార్పులు రావడం, లేదా కొత్త ఉత్పరివర్తనాలు(మ్యుటేషన్లు) ఏర్పడటం వల్ల, ఈ కణాలు మళ్లీ క్రియాశీలకం కావచ్చు. దాంతో వృద్ది చెందడం ప్రారంభించి..భవిష్యత్తులో కేన్సర్ పునరావృతానికి దారితీసే ప్రమాదం లేకపోలేదని చెబుతున్నారు కేన్సర్ నిపుణులు.
ఎందుకు వ్యాప్తి చెందుతాయంటే..
ఇందుకు అనేక జీవసంబంధమైన కారణాలున్నాయని చెప్పారు. కొత్త జన్యు ఉత్పరివర్తనాల అభివృద్ధి ఈ కేన్సర్ కణాలు అనియంత్రిత పద్ధతిలో అభివృద్ది చెందడానికి దారితీస్తుందని, ఫలితంగా కణాల సంఖ్య, ఆకారం, పరిమాణం, అసాధారణంగా ఉంటాయని అన్నారు. ఈ కణాలు చుట్టుపక్కల కణజాలలపై దాడి చేసి, స్వంత రక్తసరఫరాను అభివృద్ధి చేసుకోవడమే గాక చలనం పొందే సామర్థ్యాన్ని కూడా సంపాదించగలవని అన్నారు.
అంతేగాదు ఈ కేన్సర్ కణాలు అసలు కణితిన నుంచి విడిపోవడానికి మార్గాలు వెతుకుతాయట. అలా అవి చుట్టుపక్కల కణజాలలపై దాడిచేయడం లేదా రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తాయట. ఆ తర్వాత ఈ కణాలలో కొన్ని ఊపిరితిత్తులు, కాలేయం, ఎముకలు లేదా మెదడు వంటి వివిధ అవయవాల్లో స్థిరపడతాయని అన్నారు. ఒక్కోసారి ఇవి నిద్రావస్థలోకి వెళ్లి రోగనిరోధక వ్యవస్థ ద్వారా నాశనమవుతాయని కూడా చెబుతున్నారు. వాటిలో ఒక చిన్న భాగం మిగిలినా..అది క్రియాశీలకంగా మారి దాడి చేసే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
దీన్ని ఎలా గుర్తిస్తారంటే.
రోగులకు ఆకలి లేకపోవడం, వివరించలేని బరువు తగ్గడం, ఆయాసం, నిరంతర దగ్గు లేదా ఎముకలతో సహా ఒక నిర్దిష్ట ప్రదేశంలో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒక్కోసారి కామెర్లు మాదిరికి కళ్లల్లో తెల్లటి భాగం పసుపురంగులోకి మారడం, శరీరం మొత్తం దురద, కడుపు నొప్పి, పాలిపోయిన మలం తదితర సంకేతాలు ఉంటాయన్నారు.
అయితే ఈ లక్షణాలనే ప్రామాణికంగా తీసుకోవద్దని సూచిస్తున్నారు. ఒక్కోసారి ఇతర వైద్య పరిస్థితుల వల్ల కూడా ఇలాంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. అయినప్పటికీ నిరంతరంగా వివరించలేని లక్షణాలను, ముఖ్యంగా కేన్సర్ చరిత్ర ఉన్నవారు తక్షణమే వైద్య పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నారు.
ఎవరిలోఈ సమస్య ఎక్కువ అంటే..
రోగికి గతంలోని ఉన్న ఇతర అనారోగ్యాలు, శారీరక సామర్థ్య స్థాయి, రోగి కుటుంబ సభ్యుల చరిత్ర, తదితరాలపై ఇది ఆదారపడి ఉంటుందని అన్నారు. .
అందుకే వైద్యపరీక్షలు తప్పనిసరి..
కేన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నవారు ఇక వైద్య పర్యవేక్షణ నిలిపివేయడకూడదు. క్రమం తప్పని పరీక్షలు, పర్యవేక్షణ, ఏమైనా లక్షణాలు కనిపించినా తక్షణమే వైద్య పరీక్షలు చేయించుకోవడం తదితరాలు ముఖ్యమని చెబుతున్నారు నిపుణులు.
అయితే రోగులు ప్రతి నొప్పిని, దగ్గుని కేన్సర్‌గా అనుమానించాల్సిన పనిలేదన్నారు. ఏడాదికొకసారి సాధారణ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటే చాలని అన్నారు. అలాగే ఆయా వ్యక్తుల రిస్క్ ప్రొఫెల్ ఆధారంగా వైద్యుడు సూచించిన విధంగా పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం అని చెబుతున్నారు.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
ఇదీ చదవండి: రూ. 40 వేలు నుంచి రూ. 1 కోటిపైనే..! ‘ఉన్నతికి’ అసలైన అర్థం..


