ప్రాణ నష్టం
పరిసరాల విధ్వంసం
వాయు కాలుష్యం
యుద్ధం విషాదాన్నే కాదు.. విషాన్ని మిగులుస్తుంది. ప్రాణనష్టంతో మొదలై ప్రజలను నిరాశ్రయులను చేయడంతోపాటు మొత్తంగా పరిసరాల విధ్వంసానికి దారి తీస్తుంది. కానీ ఈ క్రమంలో తరచూ విస్మరించే మరో పరిణామం యుద్ధం మిగిల్చే కాలుష్యం. పై నష్టాలన్నీ యుద్ధం జరుగుతుండగా, జరిగిన వెంటనే తెలిస్తే.. కాలుష్యం ప్రభావం మాత్రం సంఘర్షణ ముగిసిన తర్వాత కూడా చాలా కాలం కొనసాగుతుంది. కొన్నిసార్లు దశాబ్దాలు పట్టొచ్చు.
యుద్ధంలో తీవ్ర ప్రమాదాకానికి గురయ్యేవి మండే ఇంధనాలు, ప్రమాదకరమైన రసాయనాలుండే ఇంధన వ్యవస్థలు. దాడులు చమురు డిపోలు, రిఫైనరీలు, పైప్‌లైన్లలో మంటలను రాజేస్తాయి. ఈ మంటల వల్ల విష వాయువులు, క్యాన్సర్ కారక కణాలు, అవశేషాలు విడుదలై, చుట్టుపక్కల భూమి, నీరు సంవత్సరాల తరబడి కలుషితమవుతుంది. ఇరాన్ యుద్ధం విషయంలో ఇదే జరిగింది. ఇరాన్, గల్ఫ్‌లో ఇంధన మౌలిక సదుపాయాలపై జరిగిన బాంబు దాడులు ఇప్పటికే తీవ్ర నష్టాన్ని కలిగించాయి.
మండుతున్న ఇంధన ట్యాంకులు విషపూరిత కణాలను గాలిలోకి పంపుతుండగా, వాటి శిథిలాలు, ప్రవాహాలు, చమురు అవశేషాలు గల్ఫ్ అంతటా తీరప్రాంత జలాలను, సముద్ర జీవావరణ వ్యవస్థలను భయపెడుతున్నాయి. ఈ కాలుష్య దాడి ప్రస్తుతం ఇక్కడికే పరిమితమైనా, తర్వాతి కాలంలో వ్యాప్తి విస్తృతంగా ఉంటుంది. ఇది ఎంతకాలం కొనసాగుతుందనే విషయాన్ని కూడా అంచనా వేయలేం.
పారిశ్రామిక అగ్నిప్రమాదాలు
టెహ్రాన్ సమీపంలోని పలు చమురు డిపోలపై జరిగిన దాడులు, దాదాపు కోటి జనాభా ఉన్న పట్టణ ప్రాంతంపై దట్టమైన నల్లటి పొగను వ్యాపింపజేశాయి. చమురు మండటం వల్ల వెలువడే దట్టమైన పొగను ఇప్పుడు ఇరాన్‌లో చిన్నపిల్లలతో సహా ప్రజలు నేరుగా పీలుస్తున్నారు. ఈ పొగలో బెంజీన్, ఫార్మాల్డిహైడ్, పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్‌లు, ఇతర సూక్ష్మ కణ పదార్థాలు ఉంటాయి.
ఇవి శ్వాసకోశంలోకి లోతుగా చొచ్చుకుపోయి, శ్వాసకోశ, హృదయ సంబంధ వ్యాధులను తీవ్రతరం చేస్తాయి. ఇది ఎక్కువకాలంపాటు కొనసాగితే ఈ ప్రభావాలు దీర్ఘకాలం ఉంటాయి. క్యాన్సర్ల ప్రమాదం పెరగడంతో పాటు, కొన్ని నాడీ సంబంధిత రుగ్మతలు వస్తాయి. ఇరాన్‌లో వాయు నాణ్యత ఇప్పటికే ప్రధాన పర్యావరణ సమస్యల్లో ఒకటిగా ఉంది. ఇక ఈ పారిశ్రామిక మంటలు లక్షలాది మంది ప్రజలు వాయు కాలుష్యం బారిన పడటానికి కారణమవుతాయి.
నేల కాలుష్యం, విషపూరిత శిధిలాలు
మందుగుండు సామగ్రి, సైనిక శిధిలాల పేలుడు దీర్ఘకాలిక నేల కాలుష్యానికి దారితీస్తుంది. బాంబు దాడికి గురైన ప్రాంతాల్లో సీసం, కాడ్మియం, నికెల్ లేదా క్రోమియం వంటి భారీ లోహాలు పేరుకుపోతున్నాయి. ఈ కాలుష్య కారకాలు నేలల్లో నిలిచిపోయి క్రమంగా ఆహార గొలుసులలోకి ప్రవేశిస్తాయి. కాలుష్యానికి మరో ప్రధాన కారణం ఆస్బెస్టాస్, పారిశ్రామిక రసాయనాలు, పేలని ఆయుధాల అవశేషాల శిథిలాలు, పట్టణ విధ్వంసం.
సంఘర్షణానంతర కాలంలో ఈ పదార్థాల నిర్వహణ ప్రధాన పర్యావరణ సవాళ్లలో ఒకటిగా ఉంటుంది. ఉక్రెయిన్‌లో, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, పట్టణ ప్రాంతాలపై జరిగిన బాంబు దాడుల వల్ల అనేక కాలుష్య కారకాలు పర్యావరణంలోకి వ్యాపించాయి. గాజా స్ట్రిప్‌లో, భవనాలు, మౌలిక సదుపాయాల భారీ విధ్వంసం వల్ల లక్షలాది టన్నుల శిథిలాలు పేరుకుపోయాయి. ఇవి కాలుష్య నిర్మూలన, పునరి్నర్మాణ కార్యకలాపాలను క్లిష్టతరం చేస్తాయి. ధ్వంసమైన నగరాలను పునర్నిర్మించడం వాతావరణంపై అదనపు భారం పడుతుంది.
మరింత నీటి సంక్షోభం
యుద్ధం నీటి భద్రతను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఆనకట్టలు, కీలకమైన మౌలిక నీటి సదుపాయాలను ధ్వంసం చేసి జనాభాను నియంత్రించడానికి ప్రత్యర్థి దేశాలు చేస్తున్న ప్రయత్నాలు సంక్షోభాలకు దారితీస్తున్నాయి. కరువులు, వ్యవసాయంలో అధిక వినియోగం, వివాదాస్పద నీటి నిర్వహణ విధానాలతో ఇప్పటికే ఇరాన్ నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. యుద్ధం వల్ల ఏర్పడే కాలుష్యం నీటి నాణ్యతను దీర్ఘకాలికంగా ప్రభావితం చేయనుంది.
పేలుళ్లు, అగ్నిప్రమాదాల కారణంగా హైడ్రోకార్బన్లు పట్టణ మురుగునీటి వ్యవస్థలలోకి, కొన్ని జలమార్గాల్లోకి ప్రవహించి, నేలలను, భూగర్భ జలాలను కలుషితం చేశాయి. ఇక విద్యుత్ గ్రిడ్‌లు, శుద్ధి కర్మాగారాలపై బాంబు దాడులు చేయడం వల్ల కీలకమైన నీటి శుద్ధి ప్రక్రియ నిలిచిపోతుంది. శుద్ధి చేయని నీటిని తాగడం వల్ల ప్రజలు తక్షణమే వ్యాధుల బారిన పడుతున్నారు. 1980లలో జరిగిన ఇరాన్–ఇరాక్ యుద్ధ సమయంలో గల్ఫ్‌లో సముద్రం పాలైన చమురు, ఆ ప్రాంతంలోని హాక్స్‌బిల్ సముద్ర తాబేళ్లు అంతరించడానికి, అక్కడి గ్రీన్ తాబేళ్ల వినాశనానికి కారణమైంది.
అంతరించనున్న అడవులు
సంఘర్షణ అటవీ నిర్మూలనకు దారి తీస్తుంది. విద్యుత్ సరఫరా నిలిచిపోయి, ఇంధన కొరత ఏర్పడినప్పుడు, బొగ్గు, వంటచెరుకు వైపు మొగ్గు చూపాల్సి వస్తుంది. ఫలితంగా అడవులు అంతరించపోతాయి. ప్రత్యామ్నాయ ఇంధనాలు కనుమరుగైన చోట అడవుల నరికివేత పెరుగుతుంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ సూడాన్. 2023లో ఇక్కడ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఖార్టూమ్, ఇతర పట్టణ ప్రాంతాల్లో చెట్ల విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది.
గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు
2022లో ప్రపంచవ్యాప్త గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల్లో సుమారు 5.5 శాతానికి సైనిక దళాలదే. ప్రపంచవ్యాప్తంగా సైనిక వ్యయం పెరిగేకొద్దీ, దాని వల్ల ఏర్పడే కర్బన్ ఉద్గారాలు కూడా పెరుగుతున్నాయి. 26 దేశాలు ఏడాది పొడవునా విడుదల చేసే ఉద్గారాల కంటే గాజా సంఘర్షణలో మొదటి 120 రోజుల్లోనే ఎక్కువ ఉద్గారాలు వెలువడ్డాయని ఒక పరిశోధనలో తేలింది. ఇరాన్ యుద్ధంలో జలాంతర్గామి కార్యకలాపాలు, సుదూర బాంబర్ దాడులు, క్షిపణి రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. వీటివల్ల వెలువడే ఉద్గారాల భారం చాలా ఎక్కువ.
గల్ఫ్ యుద్ధంలోనూ
ఈ ప్రాంతం గతంలోనూ యుద్ధ కాలుష్యాన్ని చూసింది. 1991 గల్ఫ్ యుద్ధ సమయంలో, ఇరాకీ దళాలు 600 కంటే ఎక్కువ కువైట్ చమురు బావులకు నిప్పంటించాయి. నెలల తరబడి, దట్టమైన పొగ ఆకాశాన్ని కమ్మేసింది. దీంతో గల్ఫ్ అంతటా వాయు కాలుష్యం, నేల, భూగర్భ జలాల కాలుష్యం విస్తృతమైంది. అది అనేక అనారోగ్య సమస్యలకూ కారణమైంది. ఇందుకుగాను ఐక్యరాజ్యసమితి పరిహార కమిషన్‌కు నష్టపరిహారంగా ఇరాక్ 50 బిలియన్ డాలర్లకు పైగా చెల్లించింది.
ఉక్రెయిన్‌లోనూ
మరో భయంకరమైన తాజా ఉదాహరణ ఉక్రెయిన్. యుద్ధం ఒక విషపూరిత వాతావరణాన్ని సృష్టించింది. ఇక్కడ ఇంధన డిపోలు, పారిశ్రామిక ప్రాంతాలు, రసాయన గిడ్డంగులు, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు దేశంలోని చాలా ప్రాంతాల్లో గాలి, నదులు, వ్యవసాయ భూములను కలుషితం చేశాయి. చమురు కేంద్రాల్లో మంటలు, అటవీ నిర్మూలన, దెబ్బతిన్న పారిశ్రామిక ప్రాంతాల నుంచి వెలువడిన కాలుష్యం నీటి వ్యవస్థల పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగించింది.


