రష్యా అత్యాధునిక యుద్ధ విమానాన్ని కూల్చేసిన ఉక్రెయిన్ | Ukraine Downs Russian Su-35 Fighter Jet on Eastern Front | Sakshi
Sakshi News home page

రష్యా అత్యాధునిక యుద్ధ విమానాన్ని కూల్చేసిన ఉక్రెయిన్

Jul 9 2026 5:58 AM | Updated on Jul 9 2026 6:01 AM

Ukraine Downs Russian Su-35 Fighter Jet on Eastern Front

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తూర్పు ఫ్రంట్‌లో రష్యాకు చెందిన అత్యాధునిక Su-35 మల్టీరోల్ ఫైటర్ జెట్‌ను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం ప్రకటించింది. "ఈ రోజు మరో రష్యన్ వైమానిక ఉగ్రవాదిని నేలకూల్చాం" అంటూ టెలిగ్రామ్‌లో వెల్లడించిన ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్, ఘటన జరిగిన ప్రాంతాన్ని మాత్రమే వెల్లడించగా.. దాడి ఎలా నిర్వహించారన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఈ ప్రకటనపై రష్యా అధికారికంగా స్పందించలేదు. స్వతంత్ర వర్గాలు కూడా ఈ ఘటనను పూర్తిగా ధ్రువీకరించలేదు.

Su-35 (నాటో కోడ్‌నేమ్ Flanker-E) రష్యా వైమానిక దళంలోని అత్యంత శక్తివంతమైన నాలుగో తరం మల్టీరోల్ యుద్ధ విమానాల్లో ఒకటి. గగనతల ఆధిపత్యం సాధించడం, దీర్ఘదూర క్షిపణి దాడులు, భూ లక్ష్యాలపై బాంబుదాడులు వంటి కీలక ఆపరేషన్లలో ఈ విమానాలను విస్తృతంగా వినియోగిస్తున్నారు. అధునాతన రాడార్, శక్తివంతమైన ఇంజిన్లు, దీర్ఘశ్రేణి ఆయుధ వ్యవస్థలు దీనికి ప్రత్యేకత.

ఇటీవలే జూన్ 26న రష్యా ఆక్రమిత క్రిమియాలోని బెల్‌బెక్ ఎయిర్‌బేస్‌పై నిర్వహించిన దాడిలో రష్యా మిగ్-29 యుద్ధ విమానం ధ్వంసమైనట్లు ఉక్రెయిన్ సైనిక గూఢచారి సంస్థ (HUR) వెల్లడించింది. ఆ ఘటనతో రష్యాకు కోట్ల డాలర్ల మేర నష్టం వాటిల్లిందని ఉక్రెయిన్ అంచనా వేసింది.

ఉక్రెయిన్ జనరల్ స్టాఫ్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా ఇప్పటివరకు 436 యుద్ధ విమానాలు, 353 హెలికాప్టర్లను కోల్పోయినట్లు పేర్కొంది. అయితే ఈ గణాంకాలను రష్యా అంగీకరించలేదు. స్వతంత్రంగా కూడా నిర్ధారణ కాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement