
చట్టాలను అతిక్రమిస్తే వెళ్లగొడతాం
వీసా వచ్చినా ‘స్క్రీనింగ్’ కొనసాగుతుంది
వీసాదారులకు హెచ్చరిక
అడ్వైజరీ జారీచేసిన అమెరికా ఎంబసీ
న్యూఢిల్లీ: వీసా కష్టాల కడలిని ఈది అమెరికాలో అడుగుపెట్టాక సైతం వీసాదారులపై ‘స్క్రీనింగ్’ కత్తి వేలాడుతూనే ఉంటుందని ట్రంప్ సర్కార్ స్పష్టంచేసింది. ఏ చట్టాలు, నిబంధనల ప్రకారం విదేశీయులకు వీసా మంజూరు చేశామో అవే చట్టాలు, ఇమిగ్రేషన్ నిబంధనలను ఇక్కడికొచ్చాక అతిక్రమిస్తున్నట్లు తేలితే వెంటనే బహిష్కరించి దేశం నుంచి వెళ్లగొడతామని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం శనివారం ఒక అడ్వైజరీని విడుదలచేసింది.
‘‘అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా గ్రామ్, టెలిగ్రామ్, లింక్డ్‌ఇన్ వంటి మీ సామాజిక మాధ్యమ ఖాతాల వివరాలు ఇచ్చారు. అమెరికా వ్యతిరేక, హమాస్ ప్రతికూల సోషల్‌మీడియా పోస్ట్‌లు, వీడియోలు, వ్యాఖ్యానాలు ఉంటే ఆయా దరఖాస్తుదారులకు వీసాలను తిరస్కరించాం. అంతా సక్రమంగా ఉండి వీసాలు పొందిన విదేశీయులు ఆనందపడాల్సిన పనిలేదు. వీసాలు మంజూరైనా సరే మీపై సోషల్‌మీడియా ‘స్క్రీనింగ్’ప్రక్రియ ఇక మీదటా కొనసాగుతుంది. సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్ట్‌లపై ఓ కన్నేస్తాం. అమెరికా గడ్డపై ఉంటూ మా చట్టాలు, ఇమిగ్రేషన్ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే వెంటనే వీసాను రద్దుచేస్తాం. అలాంటి వ్యక్తులను బహిష్కరించి దేశం నుంచి వెళ్లగొడతాం’’అని అడ్వైజరీ ద్వారా అమెరికా హెచ్చరించింది.
‘అమెరికాలో ఉన్నంతకాలం ఇక్కడి చట్టాల ప్రకారం నడుచుకోవాలి. వీసా స్క్రీనింగ్‌లో భాగంగా మీ సోషల్‌మీడియా అకౌంట్లలోని పోస్ట్‌లు, వీడియోలు, వ్యాఖ్యానాలను ఇమిగ్రేషన్ అధికారులు పరిశీలించేందుకు వీలుగా అందరికీ కనిపించేలా సెట్టింగ్‌లను ‘పబ్లిక్’మోడ్‌లోనే కొనసాగించండి. జాతీయ భద్రతకు లోబడే వీసా జారీ అనేది ఉంటుంది. అందుకే ఎఫ్,ఎం,జే ఇలా ప్రతీ వీసాదారుడు ఈ నిబంధనలను అనుసరించాలి’ అని సూచించింది.